కభీం కుపాం.. మిక్రిన జంభో.. అకూంపధం..
ఒక మనిషి ఐదు పైసలు లంచం తీసుకుంటే తప్పా...?
తప్పుకాదన్నా...
ఐదువందల మంది ఐదు పైసలు లంచం తీసుకుంటే తప్పా...?
అదీ పెద్ద తప్పు కాదన్నా....
ఐదు కోట్ల మంది ఐదు పైసలు లంచం తీసుకుంటే... ?
పెద్ద తప్పేనన్నా....
శంకర్ ఆలోచిస్తున్నాడు. అన్నీ చిన్న చిన్న తప్పులే. చిన్న చిన్న నిర్లక్ష్యాలే. చిన్న చిల్లే పెద్ద ఓడను ముంచేస్తుందని ఈ జనానికి తెలియదా? మన దేశం ఎటు పోతోంది? ఇండియాలో ఓ స్టేట్ అంత ఉండే సింగపూర్,అభివృద్ధిలో మనకంటే ముందుంది. ఎందుకు? అసలేం జరుగుతోంది? ఏదో జరగాలి. రాక్షసుల్ని అంతమొందించేందుకు దేవుడు అవతరించి నట్టుగా... ఈ అవినీతినీ, అలసత్వాన్నీ, నిర్లక్ష్యాన్నీ రూపుమాపేందుకు ఓ శక్తి కావాలి. అది దేవుడు కానవసరం లేదు. మనిషి చాలు. ఇంతకూ ఎవరా మనిషి?
అతనొక్కడే. కానీ ముగ్గురు. కాసేపు ట్రెడిషనల్. ఇంకాసేపు అల్ట్రా మోడ్రన్. మరికాసేపు రెబల్. ట్రిపుల్ రోల్ కాదు. ఒకే మనిషి ముగ్గురిలా కనిపిస్తాడు. అదెలా సాధ్యం? సాధ్యమే. అదొక మాయ రోగం. ఈ రోగమే సమాజానికి పట్టిన రోగాన్ని తొలగిస్తుంది. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్. ఒకే వ్యక్తి వేర్వేరు వ్యక్తుల్లా వ్యవహరించే ఉన్మాదస్థితి. అతనికి సమాజంపై కోపం. కాదు... అతి ప్రేమ. అతనొక అపరిచితుడు. ఎవ్వరికీ తెలీదు. చివ రికి అతనికే తెలీదు. తప్పు చేసిన కేటరింగ్ వాడు కభీం కుపాం. నకిలీ బ్రేక్వైర్ అమ్మినవాడు మిక్రిన జంభో. యాక్సిడెంట్ చూసినా పట్టించుకోనివాడు అకూంపధం.
శంకర్ ఇప్పటిదాకా ఏడు సినిమాలు తీశాడు. దేనికీ ఇంత టెన్షన్ పడలేదు. సుజాతా రంగరాజన్ ఈజీగా స్టోరీ రాసిచ్చేశాడు కానీ, దానికి స్క్రీన్‌ప్లే రాయడానికి నాలుగు రెట్ల టెన్షన్ పడుతున్నాడు శంకర్. సీన్లు మారుస్తున్నాడు. క్యారెక్టర్లు మార్చి పారేస్తున్నాడు. ఫస్ట్ ఈ ముగ్గురిలో ఒకడు సర్దార్జీ. ఫన్ వస్తుంది. కానీ సౌత్వాళ్లు కనెక్టవుతారా? ఎందుకు... హాయిగా వైష్ణవ బ్రాహ్మణున్ని చేస్తే పోలా! స్క్రిప్టు ఫైల్ మూసేసి ఊపిరి పీల్చుకున్నాడు. ఆ పక్కనే టేబుల్ మీద గరుడ పురాణం. దాన్ని కళ్లకద్దుకున్నాడు. ఈ కథకు అదే పెద్ద ఆసరా.
హిందీ ‘నాయక్’ అయిపోయింది. నెక్ట్స్ ‘రోబో’ తీద్దామా? బడా ప్రొడ్యూసర్ కావాలి. దొరకలేదు. అందుకే ‘బాయ్స్’ తీశాడు శంకర్. మామూలుగా ఒక సినిమా అయ్యేవరకూ ఇంకో సినిమా గురించి ఆలోచించడు. కానీ ‘బాయ్స్’ టైమ్‌లోనే ‘అపరిచితుడు’ గురించి థింక్ చేస్తున్నాడు. అంతలా హాంట్ చేస్తోందీ స్క్రిప్టు. రజనీకాంత్ దగ్గరికెళ్లి కథ చెప్పాడు. ‘సారీ’ అన్నాడు రజనీ. ఆయనిలా చెప్పడం రెండోసారి. ఇంతకుముందు ‘ఒకే ఒక్కడు’ కూడా రిజెక్ట్ చేశాడు. రజనీ ‘నో’ అంటే విక్రమ్ దగ్గరికెళ్లిపోదామని ప్లాన్. అక్కడ విక్రమ్ ఇలాంటి అవకాశం కోసం పొంచి చూస్తున్నాడు. ఆకలితో ఉన్న సింహానికి మంచి ఆహారమే దొరికింది.
బడ్జెట్ చాలా అవుతుంది. డేరింగ్ ప్రొడ్యూసర్ కావాలి. ఆస్కార్. వి. రవిచంద్రన్ ఇలాంటి వాటికి ఎప్పుడూ రెడీ. అప్పటికి సౌత్‌లో ‘జీన్స్’ కాస్ట్లీ ఫిల్మ్. ఇది దానికి బాబులాంటిది. అయినా ఓకే.
హీరోయిన్గా ఐశ్వర్యారాయ్ అయితే బాగుంటుంది. ఆమెకూ శంకర్‌తో చేయడం ఇష్టమే. ‘జీన్స్’తో తనకు గ్రాండ్ సక్సెస్ ఇచ్చిన డెరైక్టర్ మరి. కానీ బాలీవుడ్లో బిజీ. సిమ్రాన్‌ని అడిగారు. తనకప్పుడే పెళ్లి కుదిరింది. 120 కాల్షీట్స్ అంటే అయ్యే పని కాదు. మరి ఎవరా లక్కీ గాళ్? ‘జయం’తో పెద్ద హిట్టు కొట్టిన సదాని వెతుక్కుంటూ వెళ్లిందీ ఆఫర్. శంకర్ కథ లేకుండా అయినా సినిమా తీస్తాడేమో కానీ, రెహమాన్ లేకుండా చేయడు. కానీ ఈ సినిమాకు రెహమాన్ లేడు. తన శిష్యుడు హ్యారిస్ జై రాజ్‌ని తీసుకున్నారు. ఇలాంటి సినిమాకు కెమెరామ్యా న్గా పీసీ శ్రీరామ్ అయితే కరెక్ట్. ఆయన ఫుల్ బిజీ. రవివర్మన్ వచ్చాడు. ఫేమస్ కెమెరామ్యాన్. రవి.కె.చంద్రన్‌కి అసిస్టెంట్. ‘బాయ్స్’కి జెనీలియా ఫొటోషూట్ అంతా అతనే చేశాడు. ‘‘సార్... ఒక్క చాన్స్’’ అన డిగాడు. శంకర్ అప్పటికే మణికందన్‌తో మాట్లాడేశాడు. అతను ‘మై హూ నా’లాంటి భారీ హిట్ సినిమాలకు పని చేశాడు.
ఇక్కడ ప్రీప్రొడక్షన్ జరుగుతుంటే, అక్కడ విక్రమ్ కేరెక్టర్స్ మౌల్డింగ్ కోసం హోమ్‌వర్క్ చేసుకుంటున్నాడు. అద్దం ముందు రామానుజం గెటప్‌లో ఉన్నాడు. బాడీ లాంగ్వేజ్ చూసుకున్నాడు. అంతా ఓకే. కానీ కొంచెం పొట్ట పెంచాలి. నెక్ట్స్ రెమో. అల్ట్రామోడ్రన్‌గా తయారయ్యాడు. వాకింగ్ స్టయిల్ మార్చేశాడు. ఇంకొంచెం బాడీ షేప్ మార్చాలి. ఇప్పుడు ‘అపరిచితుడు’ గెటప్. బాగుంది కానీ, ఇంకా బాగుండాలి. ఫుల్‌గా ఎక్సర్సైజ్ చేసి బాడీ బిల్డింగ్ చెయ్యాలి. పగలూ, రాత్రీ ఈ మూడు పాత్రల గురించే ఆలోచన. నిద్ర కూడా సరిగ్గా పోవడం లేదు. విక్రమ్ వైఫ్ శైలజ సైకాలజిస్ట్. ఆమెతో కూర్చుని పర్సనాలిటీ డిజార్డర్ గురించి డిస్కషన్స్. యాక్టింగ్ అంటే మరీ ఇంత పిచ్చా అనుకుందామె.
2004 మార్చి 4. ఉదయం 9.30 గంటలు. చెన్నైలోని ఏవీయమ్ స్టూడియోలో లెవెన్త్ ఫ్లోర్. ‘అపరిచితుడు’ ఓపెనింగ్. తమిళంలో ‘అన్నియన్’, హిందీలో ‘అపరిచిత్’. ప్రెస్మీట్లో శంకర్ మాట్లాడుతున్నాడు. ‘‘ఇది ఫిక్షన్ థ్రిల్లర్. ఆరు నెలల్లో కంప్లీట్ చేస్తా’. జర్నలిస్టులు అయోమయంగా చూశారు. కాన్సెప్ట్ చూస్తే కొండంత ఉంది. ఆరు నెలల్లో కంప్లీ షన్ అంటే హౌ ఈజ్ ఇట్ పాజిబుల్?
షూటింగ్ జరుగుతూనే ఉంది. షెడ్యూల్ మీద షెడ్యూల్... ప్లానింగ్ మీద ప్లానింగ్. తిరువయ్యూరులో ఏటా త్యాగ రాజ మహోత్సవాలు జరుగుతుంటాయి. ఈ సినిమాలో ఆ ఎపిసోడ్ ఉంది. ఏవీయమ్ స్టూడియోలో సెట్ వేశారు. ఫేమస్ వయొలిన్ విద్వాంసుడు కన్నకుడి వైద్యనా థన్, ఫేమస్ సింగర్స్ ఉన్నికృష్ణన్, సుధా రఘునాథన్ తదితరులపై షాట్స్ తీశారు.
వెరీ ఇంపార్టెంట్ యాక్షన్ ఎపిసోడ్. వియత్నాం నుంచి 127 మంది మార్షల్ ఆర్ట్స్ నిపుణులు దిగారు. టేకింగ్ హాలీవుడ్ లెవెల్లో ప్లాన్ చేశారు. ‘మ్యాట్రిక్స్’ మూవీకి వాడిన టెక్నాలజీ. చెన్నైలోని జేబీ ఇన్డోర్ స్టేడియమ్లో సెట్ వేశారు. 25 రోజులు తీశారు. అపరిచితుడు పబ్లిక్‌తో మాట్లాడే సీన్‌ని హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియమ్లో తీశారు. గేదెల సీన్‌కి కూడా చాలా కష్టపడ్డారు. సీజీ వర్క బాగా యూజ్ చేశారు. పాటల్నీ భారీగానే తీశారు. ‘ఓ సుకుమారి’ పాటను నెదర్లాండ్స్‌లో జరిగే వరల్డ్ ఫ్లవర్ షోలో తీశారు. ఆ టైమ్‌లో అక్కడ చలి చాలా ఎక్కువ. అంత చలిలో, విక్రమ్‌తో సహా డాన్సర్లంతా పంచెకట్టుతో పాల్గొన్నారు.
ఆరు నెలలు పూర్తయ్యాయి. ఇంకా షూటింగ్ పార్ట్ చాలా ఉంది. కెమెరామ్యాన్ మణికందన్‌కి వేరే కమిట్మెంట్ ఉంది. ఆయన జంప్. శంకర్ ఇంకేం చేస్తాడు? రవివర్మన్‌ను రమ్మన్నాడు. అప్పుడే అతను ఓ బెంగాలీ సినిమా కమిట్ అయ్యాడు. ఇక్కడేమో శంకర్ ఆఫర్. బెంగాలీ సినిమా వదిలేసుకుని మరీ ఇక్కడికొచ్చేశాడు.విక్రమ్ పరిస్థితీ అంతే. డేట్ల మీద డేట్లు ఇస్తున్నాడు. ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలీని పరిస్థితి. పెద్దపెద్ద ఆఫర్లొస్తున్నాయి. అన్నీ రిజెక్ట్ చేస్తున్నాడు. పూర్తిగా ‘అపరిచితుడు’ మైకంలో ఉన్నాడు. అది మైకం కూడా కాదు. ఓ రకంగా ఉన్మాదం. ఆ పాత్రనే కలవరిస్తున్నాడు. పిచ్చోడిలా శూన్యంలోకి చూస్తున్నాడు. తనలో తానే ఏదో మాట్లాడుకుంటున్నాడు. విక్రమ్ భార్యకు కంగారొచ్చేసింది. షూటింగ్ త్వరగా పూర్తి కావాలని దేవుడికి దణ్ణాలు పెట్టుకుంటోంది.
గుమ్మడికాయ కొట్టేశారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ టేక్స్ మోర్ టైమ్. ఇంకో పక్క గ్రాఫిక్స్. ఆస్కార్ రవిచంద్రన్ కోట్లకు కోట్లు పోస్తున్నాడు. ఫైనల్‌గా లెక్క తేలింది. 26 కోట్ల 38 లక్షలు. షాకింగ్ ఫిగర్. సౌత్‌లో హయ్యెస్ట్ బడ్జెట్ ఫిల్మ్. అంత డబ్బు తిరిగొస్తుందా?!
తెలుగు డబ్బింగ్ రైట్స్ కోసం ఫుల్ కాంపిటీషన్. పెద్ద పెద్ద వాళ్లు అడుగుతు న్నారు. రవిచంద్రన్ పెద్ద రేట్లు చెబుతున్నాడు. ‘లక్ష్మీగణపతి ఫిలిమ్స్’ బాడిగ సుబ్రహ్మణ్యం రూ. 6.75 కోట్లకు బేరమాడాడు. డీల్ ఓకే. రిస్కీ ఫిగర్. ‘టెర్మినేటర్-3’, ‘స్పైడర్‌మ్యాన్ 2’ లాంటి హాలీవుడ్ డబ్బింగ్‌లు, ‘శివపుత్రు డు’లాంటి తమిళ డబ్బింగ్‌లు చేసినవాడు ఈ దెబ్బతో ఫినిష్ అనుకున్నారు చాలామంది. చూద్దాం ఏం జరుగుతుందో!
2005 జూన్ 17. సమ్మర్ ఎండింగ్లో ఉంది. బాక్సాఫీస్ మాత్రం ఓవర్హీట్లో ఉంది. పెద్ద పెద్ద సినిమాలు రిలీజవుతున్నాయి. వీటిమధ్య శంకర్ మ్యాజిక్ వర్కవుట్ అయ్యింది. డివైడ్ టాక్‌తోనే ‘అపరిచితుడు’ సూపర్‌హిట్. 104 ప్రింట్లతో రిలీజ్ చేసిన సినిమా 37 సెంటర్స్‌లో హండ్రడ్ డేస్. పదిహేను కోట్ల వరకూ కలెక్షన్స్. ఈ సినిమాకి నిజంగా విక్రమే హీరో. ప్రాణం పెట్టి పని చేశాడు. మూడు కేరెక్టర్ల హావభావాలను క్షణాల్లో మార్చి మార్చి చూపించడం చాలా చాలా కష్టం. శంకర్ సిని మాల్లో ఎప్పుడూ సోషల్ అవుట్‌లుక్ కనిపిస్తుంది. ఇందులో మాత్రం పీక్‌కి వెళ్లిపోయింది. పాజిబిలిటీ - ఇంపాజిబిలిటీ పక్కన పెడితే సోషల్ లేజీనెస్‌ని ఈ రేంజ్లో సెల్యులాయిడ్ మీద ఉతికి ఆరే సింది మాత్రం శంకరే. కలిసొస్తే అన్నీ కలిసొస్తాయ్. ఈ సినిమాకి పాటలూ అంతే. భువనచంద్ర లిరిక్స్ గురించి మెన్షన్ చేసి తీరాల్సిందే. ‘పువ్వులు పేల్చేటి స్టెన్‌గన్ రెమో’, ‘పువ్వుల్తోనే బాణం వేసే ఫూలన్‌దేవి నువ్వే జాణా’ లాంటి మోడరన్ ఎక్స్ప్రెషన్స్ భలే అనిపిస్తాయి.
కొన్ని కలలు నిజమైతే బావుంటుంది. శంకర్ కన్న కల ‘అపరిచితుడు’. ఈ కల నిజమైతే ఎంత బావుంటుందో కదా!