సాయివరలక్ష్మి ఆగ్రోఫుడ్స్‌రైస్‌మిల్ సీజ్
మిల్లులో ఉన్న బియ్యం ఎఫ్‌సీఐకి తరలింపు
గంట్యాడ: ఫిబ్రవరి 2వ తేదీన వెలుగులోకి వచ్చిన ఫోర్జరీ ట్రక్షీట్ల వ్యవహారంపై ఎట్టకేలకు అధికారులు స్పందించి చర్యలు చేపట్టారు. బినామీ పేర్లతో ఫోర్జరీ సంతకాలు చేసి అటురైతులను,ఇటుప్రభుత్వాన్ని మోసంచేసి అక్రమంగా ధాన్యం కొనుగోలుచేసిన సాయివరలక్ష్మి ఆగ్రోఫుడ్స్ రైస్‌మిల్ యజమానిపై కేసునమోదుచేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. రైతులు,అయ్యప్ప ట్రేడర్స్ రైస్‌మిల్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లాయంత్రాంగం విచారణ చేపట్టింది.అధికారులు చేపట్టిన దర్యాప్తులో సాయివరలక్ష్మి ఆగ్రోఫుడ్స్ యజమాని అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో జేసీ ఆదేశాల మేరకు శుక్రవారం మిల్లులో ఉన్న బియ్యం, ధాన్యం నిల్వలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీన పరుచుకున్న బియ్యాన్ని విజయనగరం ఎఫ్‌సీఐ గొడౌన్‌కు తరలించగా,ధాన్యాన్ని సమీపానగల రైస్‌మిల్‌కు అప్పగిస్తామని తమశీల్దార్ బాపిరాజు తెలిపారు.గ్రామపెద్దల సమక్షంలో నిల్వలను లెక్కించి స్వాధీన పరుచుకున్నారు.అక్రమాలకు పాల్పడిన మిల్ యజమాని కొల్లా బద్రీనాథ్‌ద్‌పై 6ఎ కేసుతోపాటు,మిల్ లెసైన్స్ రద్దుచేసి బ్లాక్ లిస్టులో పెట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. బినామీపేర్లతో సంతకాలు ఫోర్జరీ చేసినందుకు క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సంబంధిత అధికారులకు కలెక్టర్ ఎం.ఎం.నాయక్ ఆదేశాలు జారీచేశారు.
రైతుల ఆందోళన
మిల్ యజమాని పరారీలో ఉండడంతో మిల్లులో ఉన్న నిల్వలను అధికారులు స్వాదీనం చేసుకోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
మిల్లులో ఉన్నధాన్యం రైతులకు ఇప్పించాలని తహశీల్దార్ బాపిరాజును కోరారు.6ఎ కేసు నమోదు చేయడంవల్ల ధాన్యం రైతులకు ఇచ్చే అవకాశంలేదని, ఫిర్యాదు చేసిన రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని తహశీల్దార్ హామీ ఇవ్వడంతో రైతులు కాస్త ఊరట చెందారు.