తేజ్ ఊచకోత చూస్తారు – రామ్ చరణ్
‘‘సంబరాల ఏటిగట్టు’ తేజుకి 18వ సినిమా. అందరికీ ఒకటే మాట చెబుతున్నా. తేజు ఊచకోత ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూడబోతున్నారు. ఔట్ స్టాండింగ్ విజువల్స్. డైరెక్టర్ రోహిత్ మొదటి సినిమా చేస్తున్నట్టుగా లేదు.. చాలా అద్భుతంగా తీస్తున్నాడు’’ అని రామ్ చరణ్ తెలిపారు. సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘ఎస్వైజీ’(సంబరాల ఏటిగట్టు) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. ప్రైమ్‌షో ఎంటర్టైన్ మెంట్‌పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాని 2025 సెప్టెంబర్ 25 తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మూవీ టైటిల్ టీజర్‌ని రామ్ చరణ్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘తేజు ఈరోజు ఇక్కడ ఇలా నిలిచి ఉండటానికి కారణం అభిమానుల ఆశీర్వాదాలే. ఇది తనకి పునర్జన్మ. ఈ జన్మ అభిమానులే ఇచ్చారు. అంటే తను మా తేజ్ కాదు.. మీ తేజ్. తనపై ఇంత పెద్ద బడ్జెట్ పెడుతున్న నిర్మాతలు నిరంజన్, చైతన్యగార్లను చూస్తే సినిమా పట్ల వారికి ఉన్న ప్యాషన్ తెలిస్తోంది. ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలి’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ–‘‘తేజు ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయిందంటే నమ్మశక్యంగా లేదు. మా విజయ దుర్గ అదృష్టవంతురాలు. తన పేరును తీసుకెళ్లి తన పేరులో పెట్టుకున్నాడు తేజు(సాయి దుర్గా తేజ్). అలాంటి కొడుకు ఉండటం అదృష్టం. తను మృత్యుంజయుడు’’ అని తెలిపారు. సాయి దుర్గా తేజ్ మాట్లాడుతూ–‘‘ఈ వేదికపై నేను ఉండటానికి కారణమైన మా ముగ్గురు మావయ్యలకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీ(అభిమానులు) అందరి ప్రేమను ΄÷ందే అదృష్టం నాకు దక్కింది. బైక్ నడుపుతున్నప్పుడు నేను హెల్మెట్ ధరిస్తాను.. మీరు కూడా హెల్మెట్ ధరించాలి’’ అని కోరారు. ‘‘ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, తేజుగారికి ధన్యవాదాలు’’ అన్నారు రోహిత్ కేపీ. ‘‘సంబరాల ఏటిగట్టు’ చాలా కొత్తగా, అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాని మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను’’ అన్నారు చైతన్య రెడ్డి. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి, డైరెక్టర్స్ వైవీఎస్ చౌదరి, దేవా కట్టా, కిషోర్ తిరుమల, మారుతి, అనిల్ రావిపూడి, ప్రశాంత్ వర్మ, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, ఎస్కేఎన్ మాట్లాడారు.