ఫైనల్లో సాకేత్ జోడి
న్యూఢిల్లీ: ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు సాకేత్ మైనేని తన భాగస్వామి సనమ్ సింగ్‌తో కలిసి డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో సాకేత్-సనమ్ జంట 6-3, 6-2తో నాలుగో సీడ్ అడ్రియన్ మెనాన్డెజ్ (స్పెయిన్)-నెదోవ్‌యెసోవ్ (కజకిస్థాన్) ద్వయంపై గెలిచింది. శనివారం జరిగే ఫైనల్లో సంచాయ్ రాటివటానా-సొంచాట్ రాటివటానా (థాయ్‌లాండ్) జోడితో సాకేత్-సనమ్ తలపడతారు. మరో సెమీఫైనల్లో సంచాయ్-సొంచాట్ జోడి 3-6, 6-3, 10-7తో విష్ణువర్ధన్-జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్) జంటను ఓడించింది.
సెమీస్‌లో సోమ్‌దేవ్
పురుషుల సింగిల్స్ విభాగంలో భారత అగ్రశ్రేణి ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో సోమ్‌దేవ్ 6-2తో తొలి సెట్ గెల్చుకున్నాక... అతని ప్రత్యర్థి జె జాంగ్ (చైనా) భుజం నొప్పితో మ్యాచ్ నుంచి వైదొలిగాడు. 2010 గ్వాంగ్జూ ఆసియా క్రీడల్లో జె జాంగ్‌ను ఓడించిన సోమ్‌దేవ్ ఈసారి పూర్తి ఆధిపత్యం చెలాయించాడు.
34 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి సోమ్‌దేవ్ 5-0తో ముందంజ వేశాడు. ఆ తర్వాత రెండు గేమ్‌లు కోల్పోయినా వెంటనే తేరుకొని సెట్‌ను సొంతం చేసుకున్నాడు. మహిళల విభాగంలో భారత పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో అంకిత రైనా 3-6, 5-7తో యూలియా బెగెల్జిమర్ (ఉక్రెయిన్) చేతిలో ఓడిపోయింది.