పద్యానవనం: నిజం నశించిన విధం
ఆడిన మాటను తప్పిన గాడిదకొడుకా యటన్న, గాడిద యదివి
న్వీడా నాకొక కొడుకని గాడిదయే యేడ్చెనటర ఘన సంపన్నా!
ఇదొక చాటుపద్యం. ఎంతో కాలంగా ప్రజాసమూహాల్లో ప్రచారంలో ఉంది. ఎవరు రాశారో తెలియదు. మాట తప్పడం ఎంత అవమానకరమో సాపేక్షంగా చెప్పాడు. అల్ప పదాలతోనూ ఆ చెప్పడం అద్భుతంగా ఉన్నందుకేమో పదికాలాలు పదిలంగా ఉండిపోయిందీ పద్యం. నిజమే, మాట మరచినపుడు ఎన్ని అనర్థాలు జరిగాయి! కాలమే మౌన సాక్షి. మాట నిలబెట్టుకోవడానికి ఎందరెందరో ఎన్నెన్ని కష్టాలు పడ్డారో.... అందుకు చరిత్ర సజీవ సాక్ష్యంగా ఉంది. సత్యహరిశ్చంద్రుడి కథ అంతగా ప్రభావితం చేసింది కనుకే మన జాతిపిత మహాత్ముడు సత్య పరిశోధనకు తన జీవితాన్నే ప్రయోగశాల చేసి విజేత అయ్యారు. తానిచ్చిన మాట కూడా కాదు, పితృవాక్యపరిపాలన కోసం శ్రీరామచంద్రుడు పద్నాలుగేళ్లు అరణ్యవాసం చేసి అష్టకష్టాలనుభవించడమే కదా రామాయణం!
కాలక్రమంలో పరిస్థితులు మారిపోయాయి. ఈ మధ్య అలవోకగా అబద్ధాలాడేస్తున్నారు జనాలు. ఇక కొందరు రాజకీయనాయకులైతే... చెప్పనవసరం లేదు. అబద్ధాలాడి కూడా రాజకీయాల్లో ఎలా మనగలుగుతున్నారంటే, శీఘ్ర గతిన మరచిపోయే ప్రజల తత్వం మాటున వారు హాయిగా బతికిపోతున్నారు. మన స్వాతంత్య్రపు తొలినాళ్లలో... అబద్ధమాడటం కాదు, చట్టసభల్లో అబద్ధమన్న పదాన్ని ఉచ్ఛరించడమే పెద్ద తప్పిదంగా భావించేవారు.
అందుకే, ఇప్పుడు మన శాసనసభలో కూడా ఎదుటివాళ్లను విమర్శించేప్పుడు అవసరమైతే ‘సత్య దూరమైన మాట’ అనొచ్చంటారు తప్ప ‘అబద్ధం‘ అన్న మాట రికార్డుల్లోకి వెళ్లకుండా చూస్తుంటారు. ఆచరణలో మాత్రం... అధికారంలో ఉంటే ఒక మాట, విపక్షంలో ఉంటే ఇంకోమాట. నిన్నటి మాట మీద ఈ రోజు నిలబడని నేతలెందరో! అవసరమైతే మరో అబద్ధాన్ని జోడించి ‘మీడియా వక్రీకరించింది’ అని తప్పుకోజూస్తారు. పాత రోజులు కాదు కదా, ఎలక్ట్రానిక్ మీడియా విస్తృతి తర్వాత...‘ఇదుగో నిన్న ఇలా అన్నారు, ఈ రోజిలా... ’అని రెండు దృశ్యాలు పక్కపక్కన చూపిస్తూ ఎండగట్టినా దబాయింపే తప్ప తప్పు ఒప్పుకునే సంస్కారం తక్కువ మందిలో ఉంటుంది.
ఇచ్చిన మాటకోసం ఎన్ని అవాంతరాలెదురయినా మొక్కవోని దీక్షతో ముందుకు కదలిన పాలకులు లేరని కాదు, కానీ చాలా అరుదు. మాట తప్పకుండా సత్యం పక్షాన నిలిచిన వారు కాలాలకతీతంగా చరిత్రలో నిలిచారు. మాట తప్పిన వాళ్లు అనామకంగా కాలగర్భంలో కలిసిపోయారు. ‘నువ్వెవరో నాకు తెలియదు’ అన్న దుష్యంతుని మాటలకు చిగురుటాకులా అల్లాడిపోయింది శకుంతల. ఎవరి వల్ల తనకు పుత్రోదయం కలిగిందో ఆయనే ఆ మాటలంటే తనకేది తెరగు? అని చింతిస్తూ ఆమె ఒక మాట చెప్పింది.
‘‘నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కన్న సూనృతవ్రత....’’ అంటూ నన్నయ ఒక గొప్ప పద్యం రాశారు. సత్యవాక్కు గొప్పదనం వివరిస్తేనన్నా వింటాడేమోనని.... ‘నూరు చేదుడు బావుల కన్నా ఒక దిగుడు బావి మేలు, నూరు దిగుడు బావులు తవ్వించడం కన్నా ఒక యజ్ఙం మేలు, నూరు యజ్ఙాలకన్నా ఒక కుమారుణ్ని కలిగి ఉండటం గొప్ప, అటువంటి నూర్గురు కుమారుల కన్నా ఒక సత్యవాక్కు గొప్పద’ని శకుంతల వివరిస్తుంది. అదే నిజమని అశరీరవాణి పేర్కొన్న మీదట దుష్యంతుడు గతం గుర్తుకు తెచ్చుకొని శకుంతలనూ, తనయుడు భరతుణ్నీ చేరదీస్తాడు. వ్యాసభారతంలో ‘‘అశ్వమేధ సహస్రం చ సత్యం చ తులయా ధృతమ్, అశ్వమేధసహస్రాద్ధి సత్యమేవాతిరిచ్చతే’’ అనే గొప్ప మాటుంది. అంటే, వెయ్యి అశ్వమేధయాగా(ఫలా)లూ, సత్యమూ-వీటిని తక్కెడలో పెట్టి తూచగా సత్యమే బరువుగా తూగిందని అర్థం. ‘సత్యమేవ జయతే’.
- దిలీప్‌రెడ్డి