104 వైద్య సిబ్బందికి వేతనాలేవీ..?
ఘట్కేసర్ టౌన్: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందించడానికి ప్రవేశపెట్టిన ‘104’ పథకం నీరుగారుతోంది. ఈ పథకానికి నిధుల సమస్య ఎదురవడంతో గ్రామీణులకు తగిన వైద్య సేవ లు అందడం లేదు. కనీసం ‘104’ వాహనాల్లో పనిచేసే సిబ్బం దికి వేతనాలు కూడా రావడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందించే ‘104’ వాహనంలో ఓ డ్రైవర్, ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నిషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిన నియమించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు దూరంగా ఉన్న గ్రామాలకు వెళ్లి నిర్ణీత సమయంలో పేదలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేయడం వీరి విధి. జిల్లాలో 17 క్లస్టర్లు ద్వారా గ్రామీణా ప్రజలకు ‘104’ వాహనాలు నిత్యం సేవలందిస్తున్నాయి.
నిలిచిన వేతనాలు...
వైఎస్ఆర్ మరణాంతరం ఈ పథకం నిర్లక్ష్యానికి గురైంది.ప్రభుత్వం ఈ పథకానికి తగిన నిధులు సమకూర్చకపోవడంతో గ్రామీణులకు వైద్య సేవలు అందడం లేదు. అంతేకాకుండా ఈ పథకంలో పనిచేసే సిబ్బందికి నాలుగు నెలలుగా వేతనాలు కూడా అందడం లేదు. మే, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల వేతనాలు ఇప్పటికీ అందకపోవడంతో ‘104’ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని సిబ్బంది పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. వేతనాలకు తోడు రోజు వారీగా చెల్లించే అలవెన్సులు కూడా నిలిచిపోయాయి.
వేతనం చెల్లించే సమయంలోనే ప్రతి నెలా డీఏను కూడ చెల్లించేవారు. అయితే డీఏ చెల్లింపులకూ ప్రభుత్వం మొండిచేయి చూపడంతో ఆరు నెలలుగా అవి వారికి అంద డం లేదు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి వేతనాలను అందజేయాలని కోరుతున్నారు. ఈ విషయమై సీనియర్ ప్రజా ఆరోగ్య అధికారి నారాయాణరావ్ మాట్లాడుతూ.. ‘104’ సిబ్బంది వేతనాలకు ప్రభుత్వం నిధులు కేటాయించలేదని చెప్పారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలకాగానే సిబ్బందికి వేతనాలు అందిస్తామని తెలిపారు.