salary advance
-
జీతాలను ముందుగానే చెల్లించేశా!
కరోనా వైరస్ జనజీవనాన్ని తారుమారు చేసింది. ముఖ్యంగా దినసరి కార్మికుల జీవనశైలి తీవ్రంగా దెబ్బతింటోంది. సినిమా పరిశ్రమలో దినసరి వేతనాలు తీసుకునే చిన్న కార్మికుల సంఖ్య ఎక్కువే ఉంది. కొందరు సినిమా తారలు వారికి అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. తన సిబ్బందికి మూడు నెలల జీతాన్ని ముందుగానే చెల్లించానని పేర్కొన్నారు నటుడు ప్రకాష్‌రాజ్. ‘‘జనతా కర్ఫ్యూ రోజు నా మనసులో చాలా చాలా ఆలోచనలు వచ్చాయి. నా నగదు నిల్వను ఓసారి పరిశీలించుకున్నాను. నా ఇల్లు, ఫార్మ్‌హౌస్, ఫిల్మ్ ప్రొడక్షన్, ఫౌండేషన్ లో ఉద్యోగం చేసేవారితో పాటు నా వ్యక్తిగత సిబ్బందికి మే నెల వరకూ జీతాలు ముందుగానే చెల్లించేశాను. నేను నిర్మిస్తున్న మూడు చిత్రాలకు సంబంధించి దినసరి వేతనం తీసుకునే కార్మికుల గురించి ఆలోచించాను. కరోనా మహ మ్మా రితో పాటిస్తున్న సామాజిక దూరం మూలంగా చిత్రీకరణలు అన్ని నిలిచిపోయాయి. నా సినిమాల దినసరి వేతన కార్మికులకు సగం మొత్తం ఇవ్వాలని నిర్ణయించాను. ఇంకా నా శక్తి మేరకు చేస్తాను. అందరికీ నేను చేసే విన్నపం ఒక్కటే... మీ సహాయం అవసరమైన వారిని ఆదుకోండి. ఒకరి జీవితాన్ని మీరు నిలపగలిగే సమయం ఇది. ఒకరికి అండగా నిలవాల్సిన తరుణం ఇది’’ అని సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు ప్రకాష్ రాజ్. -
సీమాంధ్ర ఉద్యోగులకు 2 నెలల అడ్వాన్స్!
రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా 66 రోజుల పాటు సమ్మె చేసిన సీమాంధ్ర ఉద్యోగులకు రెండు నెలల జీతాన్ని అడ్వాన్స్‌గా ఇవ్వడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈమేరకు రూపొందించిన ఫైల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఆర్థిక శాఖకు వెళ్లింది. ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి వద్దకు ఫైల్ వెళ్లనుందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 13వ తేదీ నుంచి ఉద్యోగులు సమ్మెలో ఉండటం వల్ల ఆగస్టు, సెప్టెంబర్ నెల జీతాలు ఉద్యోగులకు అందలేదు. ట్రెజరీ ఉద్యోగులు కూడా సమ్మెలో ఉండటంతో ఆగస్టు 12 వరకు పనిచేసిన రోజులకు కూడా జీతాలు ఇవ్వడానికి అప్పట్లో వీలు కాలేదు. సమ్మె విరమించిన నేపథ్యంలో రెండు నెలల జీతాన్ని అడ్వాన్స్‌గా ఇవ్వాలంటూ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించాయి. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎస్ ఈమేరకు ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపారు. ఉద్యోగులకు రెండు నెలల అడ్వాన్స్ చెల్లించాలనే ప్రతిపాదనపై ఆర్థిక శాఖ కూడా సానుకూలంగానే ఉన్నట్లు తెలిసింది. ఉద్యోగులకు చెల్లించే అడ్వాన్స్‌ను ఏడాది వ్యవధిలో నెలవారీ వాయిదాల్లో రికవరీ చేయనున్నారు. సమ్మె కాలానికి జీతాలు ఇవ్వకూడదంటూ ‘నో వర్క్ నో పే’ విధానాన్ని అమలు చేస్తూ తెలంగాణ ఉద్యోగుల సమ్మె సమయంలో ప్రభుత్వం 177 జీవో జారీ చేసిన విషయం విదితమే. ఈ జీవో అమల్లో ఉండగా జీతాలు చెల్లించకూడదని హైకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమ్మె కాలానికి సరిపడా (66 రోజులు) ఆర్జిత సెలవు(ఈఎల్)లను తీసుకొని జీతాలు చెల్లించడానికి న్యాయస్థానం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్జిత సెలవులు లేని వారికి భవిష్యత్‌లో వచ్చే సెలవులు తీసుకుంటామనే నిబంధన(ఈఎల్స్ డ్యూ) మీద జీతాలు చెల్లించడానికి అవకాశం ఉంటుంది. ఈ దిశగా ప్రభుత్వం ప్రయత్నించే అవకాశం ఉంది.