ముప్పు నీరు!
=తీర గ్రామాలకు ఉప్పునీటి ప్రమాదం
=భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం
=తగ్గిపోతున్న మంచినీటి పరిమాణం
=సముద్ర జలాల ఉధృతితో దుష్పరిణామం
తీరంలో ఉండడమే ఆ గ్రామాల ప్రజలు చేసుకున్న నేరం.. సాగరానికి చేరువలో బతకాల్సి రావడమే వారు చేసిన పాపం... మంచినీటి వనరులు ఉప్పునీటి కాసారాలవుతూ ఉంటే నిస్సహాయంగా చూస్తూ ఉండడమే వారి బతుకుల్లో తప్పని విషాదం. జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల్లో మంచినీటి వనరులను ఉప్పునీటి ఉప్పెన ముంచెత్తుతూ ఉన్నా ఏమీ చేయలేని దుస్థితి వారి సొంతం. భూగర్భ జలాలలను క్రమేపీ ఉప్పునీరు కబళిస్తూ ఉంటే నిట్టూరుస్తూ బతకడం వారి ఖర్మం.
సాక్షి, విశాఖపట్నం : తీర ప్రాంత గ్రామాలను కనిపించని ఉపద్రవం చాపకింద నీరులా ముంచెత్తుతోంది. జిల్లాలోని తీర ప్రాంత గ్రా మాలకే కాదు వాటి సమీప గ్రామాలకు కూడా తాగునీటి ముప్పు పొంచి ఉంది. సముద్ర జలాలు చొచ్చుకొస్తూ ఉండడంతో భూగర్భంలోని స్వచ్ఛమైన నీరు ఉప్పునీటితో కలుషితమవుతోంది. దీంతో ఉప్పు నీటి ప్రభావం రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఇప్పటికే తాగడానికి అనుకూలంగా లేవని సుమారు 120 గ్రామాలకు వివిధ మార్గాల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్న అధికారులకు ఇదో సవాలు కానుంది. భవిష్యత్తులో మరికొన్ని గ్రామాలు ఉప్పునీటి ఉచ్చులో చిక్కుకోనున్నాయి. భూగర్బ జల శాఖ చేస్తున్న అధ్యయనం ద్వారా ఈ వివరాలు తెలియవస్తున్నాయి.
ప్రమాద ఘంటికలు : జిల్లాలో 120 కిలోమీటర్ల పొడవున తీర ప్రాంతం ఉంది. ఇందులో 62 మత్స్యకార గ్రామాలు,మరో 100 వరకు ఇతర పల్లెలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే ఉప్పు నీటి ప్రభావం ఉంది. దీంతో అత్యధిక గ్రామాలకు వివిధ మార్గాల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. కానీ ఉప్పునీటి ప్రభావిత గ్రామాల సంఖ్య మరింత పెరిగే అవకాశం కన్పిస్తోంది. తీర ప్రాంతం ఆనుకుని ఉన్న గ్రామాల్లో నీటి వినియోగం మోతాదుకు మించి రోజురోజుకూ ఎక్కువవుతూ ఉండడంతో భూగర్బ జలాల్లోని మంచినీటి స్థాయి పడిపోతోంది. దీంతో సముద్ర జలాల ఒత్తిడి పెరుగుతోంది. భూగర్బ జలాల్లోకి సముద్ర జలాలు చొచ్చుకొచ్చేస్తున్నాయి. మరోవైపు పరిశ్రమల వ్యర్థ జలాలు కూడా రకరకాల మార్గాల్లో భూగర్భ జలాల్లోకి కలిసిపోతున్నాయి. దీంతో లవణాల శాతం గణనీయంగా పెరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఇబ్బందికరమైన పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉంది.
విస్తృత అధ్యయనం : మారుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని భూగర్బ జల శాఖ ప్రస్తుతం అధ్యయనం చేస్తోంది. రుషికొండ నుంచి తిమ్మాపురం మీదుగా పోర్టు వరకు ఒక యూనిట్గా చేసుకుని అధ్యయానికి శ్రీకారం చుట్టింది. అనుమానించినట్టుగా అధ్యయనంలో ప్రమాదకర సంకేతాలొస్తున్నాయి. దీని తర్వాత జిల్లాలోని మిగతా ప్రాంతాల్ని దశల వారీగా అధ్యయనం చేయాలని అధికారులు యోచిస్తున్నారు.
ఈ క్రమంలో ఎప్పటికప్పుడు తీర ప్రాంతాల గ్రామాల భూగర్బ జలాలను శాంపిల్గా తీసుకుని పరిశీలిస్తున్నారు. సమస్యను అదుపులో ఉంచాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని భూగర్బ జల శాఖ నిపుణులు చెబుతున్నారు. నీటి దుర్వినియోగాన్ని తగ్గించుకోవాలని, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, వర్షపు నీటిని కందకం ద్వారా కాపాడుకోవాలని, బోరుబావులను రీఛార్జ్ చేసుకోవాలని, నదుల్లో ఇసుకను కాపాడుకోవాలని, విచ్చలవిడిగా బోర్లు తవ్వకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.