గంటలో 75 మందికి గుండు!
యూకేకు చెందిన క్షురకుడు శామ్ ర్యాన్ గంటలో 75 మందికి గుండు కొట్టేసి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కేశాడు. రికార్డుల పిచ్చికాకపోతే.. గుండు కొట్టించుకున్నవాళ్ల పరిస్థితి ఏంటో పాపం! అని విచారించాల్సిన పనిలేదు. గుండు కొట్టడంలో మనోడు ఎక్స్పర్ట్. ఇంతకీ ర్యాన్ ఈ పని చేయడానికి కారణమేంటో తెలుసా..? అతని స్నేహితురాలి మరణం! అవును.. క్యాన్సర్‌తో చనిపోయిన క్లేర్ ఎల్లిస్ కోసమే ఈ గుండు గీత కార్యక్రమం!
రెగ్యులర్‌గా తన సెలూన్‌కి వచ్చే ఎల్లిస్‌కు కొన్ని సంవత్సరాల క్రితం క్యాన్సర్ సోకింది. దీంతో ఆమె కీమోథెరపీ చేయించుకోవాల్సివచ్చింది. ఈ కారణంగా జుట్టు కోల్పోయిన ఆమె.. తర్వాత పూర్తిగా సెలూన్‌కు రావడం మానేసింది. ఆరోగ్యం క్షీణించిన ఎల్లిస్ కొద్దిరోజులకే మరణించింది. ఈ వార్త తెలుసుకున్న శామ్ ర్యాన్ ఆమె జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. ముందుగా ఓ పెద్ద పార్కుని ఎంచుకున్న ఆయన.. 75 మందికి ఊదారంగు టీషర్టులు తొడిగి, వరుసగా కూర్చోబెట్టి పనికానిచ్చేశాడు. ఒక్కోగుండుకు సగటున 48 సెకండ్లు తీసుకున్న ర్యాన్, గంటలోనే మొత్తాన్నీ ఫినిష్ చేసేశాడు. వారి నుంచి సేకరించిన నగదును ఓ స్వచ్ఛంద సంస్థకు అందించాడు. ఈ విషయం కాస్త ఆలస్యంగా తెలుసుకున్న గిన్నిస్ ప్రతినిధులు ఆయనకు ఇటీవలే సర్టిఫికెట్ కూడా అందించారు.