జగన్ నచ్చజెప్పడంతో దీక్ష విరమించిన విజయమ్మ
గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమరదీక్షను విరమించారు. ఆమె ఆరోగ్యం పూర్తీగా క్షీణించిన పరిస్థితులలో పార్టీ అధ్యక్షుడు, కుమారుడు వైఎస్ జగన్మోహన రెడ్డి నచ్చజెప్పడంతో విజయమ్మ దీక్ష విరమించారు. రాష్ట్రాన్ని విభజిస్తే అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని, అలా చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో విజయమ్మ
గుంటూరులో ఆమరణదీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. తీవ్ర ఉద్రిక్తతల మధ్య శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత 1.55 గంటలకు పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేశారు. ఆమె ఆరోగ్యం బాగా క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. తక్షణం దీక్ష విరమించాలన్న వారి విజ్ఞప్తిని ఆమె తిరస్కరించారు. దాంతో వారు బలవంతంగా పోలీస్ వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో కూడా ఆమె దీక్ష కొనసాగించారు. ఇదే విధంగా దీక్ష కొనసాగిస్తే ప్రమాదకరం అని వారు హెచ్చరించారు. ఆమె మూత్రపిండాలు పాడయ్యే అవకాశముందన్నారు. తక్షణం వైద్యచికిత్స అందించకుంటే మెదడు మీదా ప్రభావం చూపుతుందని చెప్పారు. కీటోన్ బాడీస్ విడుదలవుతున్నట్లు తేలిందని, ఇది ప్రమాదకరమని వైద్యులు తెలిపారు. కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరించారు. అయినా ఆమె వినలేదు. దీక్ష కొనసాగిస్తానని చెప్పారు.
ఈ పరిస్థితులలో జైలు అధికారుల సహకారంతో జగన్ ఫోన్లో మాట్లాడారు. ఆరోగ్యకారణాల రీత్యా దీక్ష విరమించమని తల్లికి ఆయన నచ్చజెప్పారు. తొలుత ఆమె జగన్ చెప్పినా వినలేదు. ఉద్యమాన్ని కొనసాగిద్దామని, దీక్ష విరమించమని ఆయన కొద్దిసేపు నచ్చజెప్పిన తరువాత విరమించడానికి ఆమె అంగీకరించారు.