ఇద్దరు కవలల ముద్దుల బాయ్ ఫ్రెండ్
సిడ్నీ: వారిద్దరు కవలలు. అచ్చుగుద్దినట్టుగా ఒకేలా ఉంటారు. జుట్టు నుంచి పాదాల వరకు ఇద్దరి మధ్య అణువంత కూడా తేడా ఉండదు. ఒకే రకమైన దుస్తులు ధరిస్తారు. ఒకే రకమైన మేకప్ వేసుకుంటారు. మాట తీరులో కూడా తేడా ఉండదు. ఒక నిమిషం తేడాతో పుట్టడం వల్ల వారిలో ఒకరు అక్కయ్యారు. ఒకరు చెల్లయ్యారు. వారిలో ఎవరు అక్కో, ఎవరు చెల్లెలో మిత్రులే కాదు, వారిని కన్న తల్లి కూడా గుర్తుపట్టలేదు. వారి వయస్సు 28 ఏళ్లు. వారి బరువు కూడా ఒకటే. తినే తిండి దగ్గరి నుంచి పడుకునే పక్క వరకు వారివి ఒకే రకమైన అభిరుచులు. అందుకే వారికి బాయ్ ఫ్రెండ్ కూడా ఒక్కరే. అతడినే ఇద్దరు పంచుకుంటున్నారు. వారు ఒకరిని విడిచి ఒకరు ఒక క్షణం కూడా ఉండరు. వారి గురించి యూట్యూబ్ ద్వారా తెలుసుకున్న ఓ జపాన్ టెలివిజన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కవలలను ఇటీవల పిలిపించి ఓ పోటీ నిర్వహించింది. కంప్యూటర్ కూడా వారి మధ్యనున్న తేడాను గుర్తించలేక పోయిందట. దానితో ప్రపంచంలోనే అచ్చుగుద్దినట్టు ఒకే పోలికల్లో ఉన్న కవలలుగా టైటిల్ ఇచ్చి వారిని సత్కరించింది. ఆ కవలల పేర్లు అన్నా, లూసీ డీ సింక్యూ.
అస్ట్రేలియాలోని పెర్త్‌లో జన్మించిన ఈ కవలలు ఇప్పుడు అక్కడే తల్లితో కలసి జీవిస్తున్నారు. బాయ్ ఫ్రెండ్ మాత్రం వచ్చిపోతుంటాడు. అతని పేరు బెన్ బైర్న్. ఎలక్ట్రికల్ మెకానిక్. అన్నా, లూసీలు చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. ప్రాథమిక, మాధ్యమిక చదువులు ఒకే పాఠశాలలో చదివారు. ఒకే కాలేజీలో ఒకే కోర్సు చేశారు. బ్యూటీషియన్లుగా ఒకే వృత్తి చేపట్టారు. చిన్నప్పటి నుంచి ఇద్దరి మధ్య పోలికలు ఎక్కువనే ఉన్నా కను రెప్పల్లో, కనుబొమ్మల తీరులో, పెదవుల్లో, బ్రెస్టులో కొన్ని తేడాలు ఉండేవట. వాటిని సరిచేసుకోవడం కోసం పలు మార్లు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారు. వాటి కోసం దాదాపు కోటిన్నర రూపాయలు ఖర్చు పెట్టారట. వారు బయటకు ఎక్కడికెళ్లాలన్నా కలిసేపోతారు. కలిసే వస్తారు. సరదాగా అప్పుడప్పుడు మిత్రులను పేర్లు మార్చి బురడీ కొట్టిస్తారు. ఇటీవల జపాన్ టీవీ పోటీలో, అంతకుముందు చానెల్-7 టీవీలో ఎవరు, ఎవరో కనుక్కోకుండా జడ్జీలను, ప్రేక్షకులను బురిడి కొట్టించారు. ప్రేమికులను బురిడీ కొట్టించొద్దన్న ఉద్దేశంతోనేమో ఒకే బాయ్ ఫ్రెండ్‌తో సెటిలయ్యారు.