ఫిబ్రవరిలో గిరిజన సంబురం
- ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు వనజాతర
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఆసియాలోనే అతి పెద్ద గిరిజన ఉత్సవంగా ప్రఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వహణ తేదీలు ఖరారయ్యాయి. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర 2016 ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు పూజారులు (వడ్డెలు) ఆదివారం ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి జరగనున్న మేడారం జాతర ఏర్పాట్లు ఘనంగా చేయాలనే ఉద్దేశంతో ఈసారి ముందుగానే తేదీ లను వెల్లడించారు. నాలుగు రోజులపాటు పతాక స్థాయిలో జరగనున్న జాతర వివరాలను తెలియజేశారు. 2016 ఫిబ్రవరి 17న(బుధవారం) సారలమ్మను గద్దెపైన ప్రతిష్టిస్తారు. అదేరోజు గోవింద రాజు, పగిడిద్దరాజులు గద్దెలపై ఆశీనులవుతారు. 18న(గురువారం) చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్టిస్తారు. 19న(శుక్రవారం) భక్తులు మొక్కులు సమర్పిస్తారు. 20న తల్లులు తిరిగి వనప్రవేశం చేయనున్నారు.
తెలంగాణలో తొలిసారిగా మహాజాతర జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అధికార యంత్రాంగం ఇప్పటి నుంచే చర్యలు మొదలుపెట్టింది. ఏర్పాట్ల కోసమే మహాజాతర తేదీలను ఈసారి ముందుగా ప్రకటించినట్లు మేడారం పూజారు(వడ్డె)ల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు తెలిపారు. యాదగిరి ఇతర పుణ్యక్షేత్రాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేసిన తరుణంలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నామన్నారు.
మేడారం జాతరను రాష్ట్ర ప్రభుత్వం 1996 నుంచి రాష్ట్ర పండుగగా ప్రకటించింది. మేడారం గత జాతర 2014 ఫిబ్రవరి 12 నుండి 15 వరకు జరిగింది. అంచనాల కంటే అధికంగా 1.30 కోట్ల మంది భక్తులు వచ్చారు. భక్తుల సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం రూ.95 కోట్లను కేటాయిం చింది. అయినా, భక్తులకు తగినట్లు ఏర్పా ట్లు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తాయి.