samsung j7
-
జే7 ఫోన్ పేరుతో మోసం చేసిన యువతి
సాక్షి, ధర్మపురి : వెల్గటూరు మండలం తాళ్లకొత్తపేట గ్రామంలో శనివారం మరో ఆన్లైన్ మోసం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన పొన్నం అనిల్‌కు ‘మీకు ఆన్లైన్లో జే 7 ఫోన్ ఆఫర్ వచ్చింది. రూ.1800 చెల్లించి ఫోన్ తీసుకోవాలని ఓ అమ్మాయి పదిరోజుల నుంచి ఫోన్‌చేసి విసిగిస్తోంది. అనుమానం వచ్చిన అతడు మొదట ఫోన్ వద్దని తప్పించుకున్నాడు. అయినా వదలకుండా ‘నీకు ఫోన్ పోస్టులో వచ్చిందని, తక్కువ ధరకు వచ్చిన ఫోన్‌ను ఎందుకు వదిలేస్తున్నావని, ఫోన్‌తో పాటు జియోసిమ్, ఆరునెలల పాటు నెట్, కాల్స్ ఉచితంగా వస్తాయని’ మభ్యపెట్టారు. దీంతో అనిల్ పోస్ట్‌మాన్‌కు రూ.1800 చెల్లించి పార్సల్‌ను తీసుకున్నాడు. తెరిచి చూడగా అందులో రూ.20 కూడా ఖరీదు చేయని ధనలక్ష్మీ యంత్రం ఉంది. తాను మోసపోయానని తెలుసుకుని సదరు నంబరుకు ఫోన్ చేస్తే పొంతన లేని సమాధాలు వచ్చాయి. ఎండపెల్లి ఘటన మరిచిపోక ముందే ఇది జరుగడం మండలవాసులను విస్మయానికి గురి చేస్తోంది. యువకులు అపరిచితుల ఆఫర్స్‌కు ఆశపడి మోసపోవద్దని వెల్గటూరు పోలీసులు సూచిస్తున్నారు. -
శాంసంగ్‌ను వీడని పేలుడు కష్టాలు
సాక్షి, న్యూఢిల్లీ: కొరియా మొబైల్‌దిగ్గజం శాంసంగ్‌ను స్మార్ట్‌ఫోన్ పేలుడు కష్టాలు వీడడం లేదు. తాజాగా ఢిల్లీనుంచి ఇండోర్‌కు బయలుదేరిన జెట్ ఎయిర్వేస్ విమానంలో పేలిన మొబైల్ శాంసంగ్ గెలాక్సీ జె 7 గా తేలింది. శాంసంగ్ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించింది. హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, శాంసంగ్ గెలాక్సీ జె7 డివైస్ ఢిల్లీ- ఇండోర్ జెట్ ఎయిర్వేస్ విమానంలో పేలిపోయింది. ఈ ప్రమాదంపై శాంసంగ్ ఇండియా అధికార ప్రతినిధి స్పందిస్తూ మరింత సమాచారం కోసం సంబంధిత అధికారులతో చర్చిస్తున్నామనీ, కస్టమర్ భద్రతే తమ ప్రధాన ప్రాధాన్యత అని ప్రకటించారు. 120 మంది ప్రయాణీకులతో విమానం బయలుదేరిన 15 నిమిషాలకే ఈ పేలుడు సంభవించింది. ఒక ప్రయాణికురాలి హ్యాండ్‌బ్యాగులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ద్వారా అకస్మాత్తుగా మంటలంటుకొని, పొగలు వ్యాపించడంతో ప్రయాణీకులు భయాందోళనలకు లోనయ్యారు. అయితే సిబ్బంది అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మరోవైపు విమానంలో ఉన్న అగ్నిమాపక పరికరం చేయకపోవడంతో.. నీళ్లు చల్లి మంటల్ని అదుపు చేయడం మరో వివాదానికి దారి తీసింది. అటు డీజీసీఎస్ మార్గదర్శకాలన్నింటినీ తాము పాటిస్తున్నామని ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. కాగా గత ఏడాది శాంసంగ్ నోట్ 7 పేలుళ్లతో కంపెనీ తీవ్ర నష్టాలను మూటగట్టుకుంది. ఈ క్రమంలో చాలా గ్యాప్ తరువాత ఇటీవల శాంసంగ్ ఎస్ 8, గెలాక్సీ్ నోట్ 8 ను లాంచ్ చేసింది. ఈ నేపథ్యంలో మళ్లీ విమానంలో శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ పేలడం కలకలం రేపింది. -
మీ ఫోన్ నంబర్ లక్కీడ్రాలో గెలిచిందని..
కడ్తాల్ : 'మీ సెల్ నెంబర్ లక్కీడ్రాలో గెలిచిందని, రూ.16వేల సెల్‌ఫోన్‌ను రూ.3500కు ఇస్తాం' అని నమ్మించి హరికృష్ణ అనే యువకుడిని మోసం చేశారు. ఈ ఘటన కడ్తాల్ మండలంలోని కర్కల్‌పహడ్ పంచాయితీ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుడు హరికృష్ణ తెలిపిన ప్రకారం.. పదిహేను రోజుల కిందట గుర్తుతెలియని వ్యక్తికి చెందిన సెల్ ఫోన్ నెంబర్ల నుండి, తనకు కాల్ వచ్చిందని చెప్పాడు. తాము నిర్వహించిన లక్కీడ్రాలో మీ సెల్ నెంబర్ గెలుపొందిందని, రూ. 16వేల విలువ గల శాంసంగ్ జే7 ఫోన్‌ను కేవలం రూ.3500కే పార్శీలు ద్వారా పోస్టులో అందిస్తామని నమ్మబలికారు. హరికష్ణ తన పూర్తి చిరునామా, వివరాలు ఆ అజ్ఞాత వ్యక్తికి తెలిపి డబ్బులు చెల్లించాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం పార్శీలు వచ్చిందని సమాచారం రావడంతో కడ్తాల్ పోస్టాఫీస్‌కు వచ్చి డబ్బులు చెల్లించి పార్శీలు తీసుకున్నాడు. అది తెరిచి చూడగా.. సెల్‌ఫోన్ బదులుగా పూజ సామాగ్రి, లక్ష్మీదేవి విగ్రహం, ఓ పల్లెం, మెడల్ లాంటివి కనిపించడంతో షాక్ తిన్నాడు. తాను మోసానికి గురైనట్లు గమనించి స్థానిక పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరుతూ వారికి ఫిర్యాదు చేశాడు. తనతా మరెవరూ మోసపోవద్దని.. అపరిచిత కాల్స్‌పైన నిఘా ఉంచాలని, అనుమానం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని బాధితుడు హరికృష్ణ అవేదనతో చెప్పాడు.