Samyuktha Hornad
-
యాంకర్ నుంచి నటిగా మారిన సంయుక్త.. అవార్డ్ విన్నర్
సొంత భాష చిత్రాల్లో కంటే కొంతమంది పరభాషా చిత్రాల్లో బాగా పాపులర్ అవుతుంటారు. ఆ కోవలోని నటే సంయుక్త హోర్నాడ్. తెలుగు సినిమాలతో పాటు వరుస సిరీస్‌లూ చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటున్న ఆమె పరిచయం బ్రీఫ్‌గా.. అవార్డ్ విన్నర్ సంయుక్త హోర్నాడ్ అసలు పేరు.. సంయుక్త బేలవాడి. వారిది కళాకారుల కుటుంబం. తల్లి సుధా బేలవాడి నటి. తండ్రి ఎమ్జీ సత్య రావు రచయిత. నానమ్మ భార్గవి నారాయణ్ మేకప్ ఆర్టిస్ట్. చదువు పూర్తి చేసిన వెంటనే యాంకర్‌గా మారింది. పలు టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. 2011లో ‘లైఫూ ఇష్టనే’ కన్నడం చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. మొదటి అవకాశంతోనే అదరగొట్టి, వరుసగా పలు భాషల్లో సినిమా అవకాశాలను అందుకుంది. ‘ఉలవచారు బిర్యాని’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి, 2014 ‘ఉత్తమ సహాయ నటి’ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది. తర్వాత ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ సినిమాలోనూ నటించింది. సంయుక్త జంతు ప్రేమికురాలు. మూగజీవుల సంరక్షకురాలిగా పలు స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాల్లో పాల్గొంటూ తన వంతు సేవ చేస్తోంది. ఈ మధ్యనే ‘పీపుల్ ట్రీ ఫౌండేషన్’ సంస్థను స్థాపించి, పేద రోగులకు ఉచిత చికిత్స అందేలా చూస్తోంది. ప్రస్తుతం జీ5లో ‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి’, ఆహాలో ‘ లాక్డ్’, డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ‘ఝాన్సీ’ సిరీస్‌లతో అలరిస్తోంది. ఓటీటీతో మంచి, చెడు రెండూ ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఇంట్లోంచే ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తున్నారు. ఇది డిస్ట్రిబ్యూటర్లకు నష్టం కలిగిస్తున్నా.. ఇప్పుడిప్పుడే సినీ ప్రయాణం ప్రారంభిస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్లకు, జూనియర్ ఆర్టిస్టులకు, చిన్న నిర్మాతలకు మేలు చేస్తోంది. –సంయుక్త హోర్నాడ్ -
రియల్ దండుపాళ్యం
1980లో కర్ణాటకలో జరిగిన ఓ యథార్థ సంఘటన నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘రియల్ దండుపాళ్యం’. రాగిణీ ద్వివేది, మేఘనా రాజ్, దీప్తి, ప్రథమ ప్రసాద్, సంయుక్త హొర్నాడ్ ముఖ్య తారలుగా నారాయణ భట్ సమర్పణలో మహేశ్ దర్శకత్వంలో రూపొందింది. సి.పుట్టుస్వామి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. మహేశ్ మాట్లాడుతూ– ‘‘కన్నడలో వచ్చిన ‘దండుపాళ్యం’ చిత్రకథకు, మా ‘రియల్ దండుపాళ్యం’ కథకు ఏమాత్రం సంబంధం లేదు. శ్రీధర్ ఈ చిత్రానికి మంచి మ్యూజిక్ ఇచ్చారు’’ అన్నారు. ‘‘ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే చట్ట పరంగా ఎదురైన సమస్య ను ఎలా ఎదుర్కొన్నారు? అన్నదే కథ. ఈ నెలాఖరున విడుదల చేయనున్నాం’’ అన్నారు పుట్టుస్వామి. -
ఆ నలుగురూ ఆడాళ్లే... అండ్ బ్యాగ్రౌండ్ ఉన్నవాళ్లే!
కన్నడలో ‘ఎమ్ఎమ్సిహెచ్’ అనే ఓ సినిమా రూపొందుతోంది. దీని స్పెషాలిటీ ఏంటంటే... ఇందులో ముఖ్య తారలు నలుగురూ ఆడాళ్లే! ఈ సిన్మాకు ఇంకో స్పెషాలిటీ కూడా ఉందండోయ్! అదేంటంటే.. ఆ నలుగురూ ఫిల్మీ బ్యాగ్రౌండ్ ఉన్నవాళ్లే. ఆ నలుగురూ... ‘దూకుడు, ఓ మై ఫ్రెండ్’ తదితర తెలుగు చిత్రాలు చేసిన నటి వినయ్ ప్రసాద్ కుమార్తె ప్రతిమా ప్రసాద్, ‘ఉలవచారు బిర్యాని’ ఫేమ్ సంయుక్తా హోర్నాడ్ (నటుడు ప్రకాశ్ బేలవాడి మేనకోడలు, రీసెంట్గా విడుదలైన ‘గృహం’లో పాస్టర్‌గా నటించారీయన), మేఘనా రాజ్ (నటుడు సుందర్ రాజ్ కుమార్తె), నక్షత్రా బాబు (నటుడు రాజేంద్రబాబు కుమార్తె). సినిమాలో ఈ హీరోయిన్లు అందరూ కాలేజ్ స్టూడెంట్స్‌గా కనిపిస్తారట! ఇంకో స్పెషాలిటీ ఏంటంటే... ఇందులో కన్నడ స్టార్ హీరోయిన్ రాగిణీ ద్వివేది అతిథి పాత్ర చేస్తున్నారు. ఇదొక సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. నాని ‘జెండాపై కపిరాజు’ సినిమాలో రాగిణి ఓ హీరోయిన్గా నటించారు. -
సినిమా రివ్యూ: ఉలవచారు బిర్యాని
నటీనటులు: ప్రకాశ్ రాజ్, స్నేహ, తేజూస్, సంయుక్త, ఎంఎస్ నారాయణ, బ్రహ్మజీ, ఊర్వశి నిర్మాత, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రకాశ్ రాజ్ మ్యూజిక్: ఇళయరాజా కెమెరా: ప్రీతా ప్లస్ పాయంట్స్: కొంతలో కొంత ఇళయరాజా మ్యూజిక్, ప్రీతా ఫోటోగ్రఫి మైనస్ పాయింట్స్: కథ, కథనం విభిన్న పాత్రలతో సినీ అభిమానులను ఆకట్టుకున్న నటుడు ప్రకాశ్ రాజ్ 'ధోని' చిత్రం తర్వాత మరో రీమేక్ 'ఉలవచారు బిర్యాని' తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 2011లో మలయాళంలో విడుదలై విజయం సాధించిన కామెడీ చిత్రం 'సాల్డ్ అండ్ పెప్పర్' అనే చిత్రం ఆధారంగా 'ఉలవచారు బిర్యాని చిత్రాన్ని స్యయంగా నిర్మించి, దర్శకత్వం వహించారు. చిత్ర విడుదలకు ముందే టీజర్లు, పాటలతో అంచనాలను పెంచిన 'ఉలవచారు బిర్యాని' చిత్రం ప్రేక్షకుల అభిరుచికి తగినట్టే ఉందా అనే అంశాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. కాళిదాసు( ప్రకాశ్ రాజ్) ఓ పెళ్లికాని ప్రసాద్. ఆయన పురావస్తుశాఖ(అర్కియాలజి) శాఖలో పనిచేసే అధికారి. గౌరీ (స్నేహ) మధ్యవయస్సు వచ్చినా..కుజదోషంగా కారణంగా పెళ్లికాని ఓ సినీ డబ్బింగ్ ఆర్టిస్ట్. మోబైల్ రాంగ్ కాల్ తో అనుకోకుండా కలిసిన కాళిదాసు, గౌరీలు ఒకరికి మరొకరు తెలియకుండానే దగ్గరవుతారు. ఇష్టాలు, అభిరుచులు ఒకేలా ఉండటంతో కాళిదాసు, గౌరీలు కలుసుకోవాలనుకుంటారు. వీరిద్దరీ కథలో కాళిదాసు మేనల్లుడు నవీన్ (తేజూస్), గౌరీ స్నేహితురాలు మేఘన (సంయుక్త హోర్నాడ్)లు ప్రవేశిస్తారు. వీరిద్దరి కథలో నవీన్, గౌరీలు ఎందుకు ప్రవేశించారు; కాళిదాసు, గౌరీలు కలుసుకున్నారా? కలుసుకోవడానికి మధ్య జరిగిన సంఘటనలు ఏంటీ? లేటు వయసులో చిగురించిన ప్రేమతో వారిద్దరూ ఒక్కటయ్యారా అనే ప్రశ్నలకు సమాధానమే 'ఉలవచారు బిర్యాని' సినిమా. నటీనటుల ఫెర్మార్మెన్స్: బ్రహ్మచారి పాత్రలో కాళిదాసుగా ప్రకాశ్ రాజ్, గౌరిగా స్నేహలు నటించారు. విభిన్నమైన పాత్రలు పోషించిన ప్రకాశ్ రాజ్ కు కాళిదాసు పాత్ర కొత్తేమి కాదు. కాళిదాసు పాత్ర ప్రకాశ్ రాజ్ స్థాయికి సరిపడేంత రేంజ్ లో లేకపోవడం అభిమానుల్లో ఆసక్తిని కలిగించలేకపోయింది. కాళిదాసు, గౌరీ పాత్రలు క్యారెక్టరైజేషన్ గొప్పగా లేకపోవడంతో వారిద్దరికి కూడా వారి సత్తాను ప్రదర్శించాల్సిన స్కోప్ లేకుండా పోయింది. కథలో వేగం, ఉద్వేగం లేకపోవడంతో మొదటి భాగంలోనే ప్రేక్షకుడికి విషయం లేదని అంశం బోధపడుతుంది. దీనికి తోడు రెండవ భాగం కూడా సాగదీయడంతో ఓ దశలో ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో నటించిన సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఊర్వశి, ఎంఎస్ నారాయణ, బ్రహ్మజీ, దేవయానిల పాత్రల ప్రాధాన్యత కూడా అంతంతమాత్రమే. టెక్నిషియన్స్ పనితీరు: కథలో పస లేకున్నా ఫోటోగ్రఫీతో ప్రీతా ఆకట్టుకున్నారు. ఇళయరాజా సంగీతం కూడా ఈ చిత్రంపై ఆసక్తిని కలిగించలేకపోయింది. ఫీల్ ఉన్న పాటల్ని ఇళయరాజా అందించినప్పటికి.. చిత్రీకరణ విషయంలో తేలిపోయాయనే చెప్పవచ్చు. ప్రతిభావంతుడైన నటుడిగా ప్రేక్షకులు హృదయాల్లో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రకాశ్ రాజ్ 'ఉలవచారు బిర్యాని' నిర్మాత, దర్శకుడిగా ప్రకాశ్ రాజ్ సినీ అభిమానులను మెప్పించలేకపోయారు. కథలో క్లారిటీ లేకపోవడం, కాళిదాసు, గౌరీల, నవీన్, మేఘనల మధ్య ప్రేమ కథలకు సరియైన న్యాయం చేయలేకపోవడం, ప్రేమ కథలో ఫీల్ లోపించడం, గిరిజన సామాజిక అంశాన్ని ప్రేమ కథలో జొప్పించడానికి చేసిన ప్రయత్నాలు చిత్ర విజయానికి అనుకూలంగా మారలేకపోయాయి. ప్రకాశ్ రాజ్ నుంచి భారీగా ఆశించి... మంచి ఆకలితో థియేటర్ కెళ్లిన ప్రేక్షకుడికి రుచి లేని 'ఉలవచారు బిర్యాని'ని వడ్డించారని చెప్పవచ్చు.