పుష్పపై ‘ఫైర్’.. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌కే ముచ్చెమటలు పట్టించి..
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ‘పుష్ప అంటే ఫ్లవరనుకొంటివా.. ఫై..రు..’ అంటూ అల్లు అర్జున్ పుష్ప సినిమాలో చెప్పిన డైలాగ్ ఎంతో పాపులర్ అయ్యింది. ఆ సినిమాలో అల్లు అర్జున్‌ది గంధపు చెక్కల స్మగ్లర్ పాత్ర. ఈ సినిమా రావడానికి దశాబ్దాల కిందటే కర్ణాటక-తమిళనాడు ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేసి.. ఆ రాష్ట్రాల సరిహద్దుల్లోని సత్యమంగళం అడవుల్లో సొంతంగా ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకొని.. యథేచ్ఛగా గంధపు చెక్కలు, ఏనుగు దంతాల స్మగ్లింగ్‌కు పాల్పడుతూ, మారణహోమానికి సైతం తెగించిన వాడు వీరప్పన్. అటువంటి వీరప్పన్‌కు ముచ్చెమటలు పట్టించి, సజీవంగా బంధించిన ధీశాలి.. పందిళ్లపల్లి శ్రీనివాస్ మన గోదారమ్మ ముద్దుబిడ్డ కావడం విశేషం. సోమవారం ఆయన జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం..
చదువు.. ఉద్యోగం..
పందిళ్లపల్లి అనంతరావు, జయలక్ష్మి దంపతులకు 1954 సెప్టెంబర్ 12న కాకినాడలో శ్రీనివాస్ జన్మించాడు. రాజమహేంద్రవరం ఫిషర్స్ కాలనీ పాఠశాలలో ప్రాథమిక విద్య చదివాడు. 1975–77లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ చదివి, బంగారు పతకం సాధించాడు. 1978లో యూపీఎస్సీ పరీక్షలు రాసి ఉత్తీర్ణుడైన శ్రీనివాస్ 1979లో ఇండియన్ ఫారెస్టు సరీ్వస్(ఐఎఫ్ఎస్)కు ఎంపికయ్యాడు. శిక్షణ అనంతరం 1981లో కర్ణాటక కేడర్ అధికారిగా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. చామరాజనగర్‌లో అసిస్టెంట్ ఫారెస్ట్ కన్జర్వేటర్‌గా తొలి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాడు.
కర్ణాటకలో శ్రీనివాస్ చెల్లెలు ఆదివారం ప్రారంభించిన కాంస్య విగ్రహం
అదే ఏడాది స్మగ్లింగ్ నిరోధక బాధ్యతలతో చిక్‌మగళూరు కేంద్రంగా డిప్యూటీ ఫారెస్టు కన్జర్వేటర్‌గా పదోన్నతి పొందాడు. ఈ విధులను శ్రీనివాస్ చాలా శ్రద్ధతో నిర్వహించాడు. సత్యమంగళం అడవుల్లో ఏనుగులను చంపి, వాటి దంతాలను అక్రమ రవాణా చేస్తున్న వీరప్పన్‌ను ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నాడు. నిజాయితీ గల అధికారిగా అటవీ గ్రామాల్లో ప్రజల మన్ననలు చూరగొన్నాడు. 1985లో వీరప్పన్‌ను సజీవంగా పట్టుకుని, మైసూరు జిల్లా బూదిగపాడు అటవీ శాఖ అతిథి గృహంలో బంధించాడు. అయితే వీరప్పన్ తప్పించుకు పారిపోయాడు.
సహాయ నిరాకరణ, సత్యాన్వేషణ
స్మగ్లింగ్ కార్యకలాపాలతో చెలరేగిపోతున్న వీరప్పన్‌కు అడ్డుకట్ట వేసేందుకు శ్రీనివాస్.. సాధారణంగా నేరస్తులను పట్టుకునే వ్యూహాలకు భిన్నంగా గాంధేయవాద పద్ధతులైన సహాయ నిరాకరణ, సత్యాన్వేషణ వంటివి అమలు చేశారు. వీరప్పన్‌కు అటవీ ప్రాంతంలో ఉన్న ఆదరణను దెబ్బ తీయడానికి ప్రజలను చైతన్యవంతులను, అక్షరాస్యులను, సంపాదనాపరులను చేశారు. పీహెచ్‌సీలు, పాఠశాలలు నెలకొల్పారు. రోడ్లు అభివృద్ధి చేశారు. మంచినీటి సౌకర్యాలు కల్పించారు. వీరప్పన్ స్వగ్రామమైన గోపీనాథంలో ప్రజల ఇష్టదైవం మారియమ్మన్ ఆలయాన్ని కట్టించాడు.
ఈ నేపథ్యంలో వీరప్పన్ పట్ల ప్రజల్లో ఏర్పడిన నమ్మకం క్రమంగా సడలిపోసాగింది. లొంగిపోయిన నేరస్తులకు శ్రీనివాస్ పునరావాసం కల్పించారు. అక్రమ రవాణాను అడ్డుకోవడానికి అధునాతన సౌకర్యాలతో ప్రభుత్వ యంత్రాంగాన్ని, ‘వాచ్ టవర్లు‘ ఏర్పాటు చేశారు. అటవీ ఉద్యోగులు నివసించడానికి, విధులకు అందుబాటులో ఉండడానికి చామరాజనగర్‌లో ‘ఫారెస్టు కాంప్లెక్స్’ నిర్మించారు. అనుచరులను దెబ్బ తీయడం, వెతుకులాట పెంచడం, ఉద్యోగులు మరింత సమర్థంగా పని చేసేలా చేయడం వంటి చర్యలతో వీరప్పన్ అక్రమ రవాణాను దెబ్బ తీశారు.
తమ్ముడు, చెల్లెళ్లతో శ్రీనివాస్ (పాతచిత్రం)
నమ్మించి.. హతమార్చి..
శ్రీనివాస్ ముమ్మర వ్యూహాలతో వీరప్పన్‌కు ఎటూ పాలు పోలేదు. దీంతో ఆయనను వంచించి, దెబ్బ తీయడానికి సిద్ధమయ్యాడు. శ్రీనివాస్ ఒంటరిగా వస్తే లొంగిపోతానని సహచరుడు అర్జున్‌తో వీరప్పన్ కబురు పంపాడు. ఆ మాటలు నమ్మిన శ్రీనివాస్.. 1991 నవంబర్ 10వ తేదీ తెల్లవారుజామున గోపీనాథం సమీపంలోని నెమళ్లకొండ వద్దకు వెళ్లారు. అప్పటికే వీరప్పన్ సూచనలను అందుకున్న అతడి అనుచరుడు పలాండీ.. తుపాకీతో శ్రీనివాస్‌ను కాల్చి చంపాడు. ఆయన వెన్నంటి వచ్చిన మరో ముగ్గురు అటవీ ఉద్యోగులను కూడా దారుణంగా హతమార్చారు. చనిపోయిన తరువాత కూడా శ్రీనివాస్ ఎక్కడ లేచి వస్తోడోననే భయంతో వీరప్పన్.. మొండెం నుంచి తల నరికి అడవుల్లోకి తీసుకుపోయాడు. దీనినిబట్టి వీరప్పన్‌కు చావు భయాన్ని శ్రీనివాస్ ఎంతలా చూపించారో అర్థం చేసుకోవచ్చు.
చాలా గర్వంగా ఉంది
శ్రీనివాస్ మా అన్నయ్య అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. నీతి, నిజాయితీకి మారు పేరుగా నిలిచారు. ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలయినా సరే ఇప్పటికీ జనం గుర్తు పెట్టుకుంటున్నారంటే ఆయనపై అభిమానం, ప్రేమ వెలకట్టలేనిది. మా అన్నగారంటే నాకు, నా ఇద్దరు చెల్లెళ్లకు చాలా ఇష్టం.
– పందిళ్లపల్లి సత్యనారాయణ, సోదరుడు
దైవంతో సమానంగా..
శ్రీనివాస్ చిత్రపటాన్ని మారియమ్మన్ గుడిలో స్థానికులు, ఆయన అభిమానులు దైవంతో సమానంగా ఉంచి పూజలు నిర్వహిస్తున్నారు. ఆయనను వీరప్పన్ హతమార్చిన చోట స్మారక స్థూపం నిర్మించారు. మరణానంతరం శ్రీనివాస్‌కు కేంద్ర ప్రభుత్వం 1992లో కీర్తిచక్ర పురస్కారం ప్రకటించింది. యువతకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచిన పందిళ్లపల్లి శ్రీనివాస్ పేరును రాజమహేంద్రవరంలో ఒక వీధికి పెట్టారు. శ్రీనివాస్ జీవిత చరిత్రను కొత్తగా శిక్షణకు వచ్చే ఐఏఎస్, ఐపీఎస్‌లకు బోధిస్తున్నారు. శ్రీనివాస్ చనిపోయిన 10వ తేదీని జాతీయ అటవీ అధికారుల అమరవీరుల సంస్మరణ దినంగా ప్రభుత్వం ప్రకటించింది.
అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్‌లో..
తన ఉద్యోగ బాధ్యతలు కొనసాగిస్తూనే అడవుల్లో కార్చిచ్చు, కాలిపోతున్న అడవుల పరిరక్షణ చర్యలపై పరిశోధనకు శ్రీనివాస్ 1985లో అమెరికా వెళ్లాడు. అక్రమ రవాణాను నిరోధించేందుకు, వీరప్పన్‌ను పట్టుకునేందుకు కర్ణాటక – తమిళనాడు ప్రభుత్వాలు సంయుక్తంగా టాస్‌్కఫోర్స్ ఏర్పాటు చేశాయి. అందులో ప్రత్యేకాధికారిగా శ్రీనివాస్‌ను నియమించారు. దీంతో ఆయన అమెరికా నుంచి తిరిగి మన దేశం వచ్చారు. వస్తూ వస్తూ సొంతూరైన రాజమహేంద్రవరం వెళ్లకుండా నేరుగా కర్ణాటక వెళ్లి బాధ్యతలు స్వీకరించారు.
చదవండి: సంస్థాన వారసుడు.. మొగల్తూరు మొనగాడు