భారత్‌ను ఓడించేందుకు.. మాజీల వ్యూహాలు
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో కామెంటేటర్లుగా అవతారమెత్తిన మాజీ క్రికెటర్లు తమ జట్టు విజయాలకు వ్యూహాలు రచిస్తున్నారు . గురువారం భారత్- శ్రీలంక మ్యచ్‌లో శ్రీలంక గెలుపుకు ఆ జట్టు మాజీ కెప్టెన్ కుమార సంగక్కర సూచనలే కారణమని కెప్టెన్ మాథ్యూస్ వెల్లడించిన విషయం తెలిసిందే. మ్యాచ్‌కు ముందు సంగక్కర శ్రీలంక ఆటగాళ్ల శిక్షణ శిభిరంలో పాల్గొని యువ ఆటగాళ్లకు బ్యాటింగ్ టిప్స్ అందించాడు. ఈ సూచనలు అమలు చేసిన లంకేయులు భారత్‌పై సంచలన విజయాన్ని నమోదు చేశారు. ఇప్పుడు ఆ దారిలోనే సఫారీలు నడుస్తున్నారు. ఇక ఆదివారం జరిగే కీలక మ్యాచ్‌లో భారత్‌ను మట్టికరిపించేందుకు ఆ దేశ మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ సలహాలు తీసుకుంటున్నారు.
శుక్రవారం సఫారీల ప్రాక్టీస్ సెషన్లో గ్రేమ్ స్మిత్ పాల్గొన్నాడు. సుమారు 35 నిమిషాలపాటు వారి శిక్షణను గమనించాడు. ఆ జట్టు ప్రధాన కోచ్ రస్సెల్ డొమింగో, సహాయక సిబ్బందితో భారత్ మ్యాచ్‌కు అనుసరించే ప్రణాళికలపై ముచ్చటించాడు. ఈ విషయంపై దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ నీల్ మెకంజీతో ప్రస్తావించగా.. గ్రేమ్ స్మిత్ దక్షిణాఫ్రికా గొప్ప కెప్టెన్ అని ఆయన సూచనలు ఆటగాళ్లకు విలువైనవని బదులిచ్చాడు. భారత్ జరిగే మ్యాచ్‌కు ఆటగాళ్లు ఎలా సిద్దం కావాలని స్మిత్ తన అభిప్రాయాలను ఆటగాళ్లతో పంచుకున్నాడని నీల్ పేర్కొన్నాడు. స్మిత్ చాంపియన్స్ ట్రోఫీ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు.