పోరుకు సిద్ధం!
= రేపటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
= విమర్శనాస్త్రాలను సిద్ధం చేసుకున్న విపక్షాలు
= ప్రభుత్వ వివాదాస్పద నిర్ణయాలను ఎండగట్టేలా వ్యూహాలు
= సంతోష్ లాడ్‌పై చర్యలకు ఒత్తిడి తెచ్చే అవకాశం
= బెల్గాంలో ఇది నాలుగో సమావేశం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బెల్గాంలో సోమవారం నుంచి శాసన సభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశముంది. ఇప్పటికే విపక్షాలు ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలను ప్రయోగించడానికి సిద్ధం చేసుకున్నాయి. ఈ ఆరు నెలల పాలనలో ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను ఎండగట్టడానికి పూనుకున్నాయి. సంతోష్ లాడ్‌ను మంత్రి పదవి నుంచి తప్పించినా.. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయనున్నాయి. పథకాలలో చోటుచేసుకున్న అవినీతిపై నిలదీయనున్నాయి.
భారీ భద్రత..
బెల్గాంలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న శాసన సభ శీతాకాల సమావేశాల్లో ఉత్తర కర్ణాటక సమస్యలపై చర్చించడానికి ఎక్కువ అవకాశం కల్పిస్తామని శాసన మండలి చైర్మన్ డీహెచ్. శంకరమూర్తి తెలిపారు. శనివారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ పది రోజుల పాటు సమావేశాలు జరుగుతాయన్నారు. మొత్తం 1,150 ప్రశ్నలకు అవకాశం కల్పించనున్నామన్నారు. మహారాష్ట్రలోని మరాఠీ రెజిమెంట్‌కు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో శాసన సభ సమావేశాల్లో పాల్గొనే సభ్యులకు పూర్తి భద్రతను కల్పించాల్సిందిగా సూచించినట్లు ఆయన తెలిపారు.
కాంగ్రెస్ అధికార పక్షంగా....
బెల్గాంలో ఈసారి నాలుగో సమావేశాలు జరుగనున్నాయి. 1952 నుంచి ఇప్పటి వరకు మొత్తం 61 ఏళ్లకు గాను కాంగ్రెస్ 43 సంవత్సరాలు అధికారంలో ఉంది. కేవలం 18 సంవత్సరాలు అధికారాన్ని చెలాయించిన విపక్షాలు బెల్గాంలో గత మూడు సమావేశాల్లో అధికార పార్టీలుగా ఉంటూ వచ్చాయి. 2005లో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు బెల్గాంలో శాసన సభ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. అప్పట్లో ధరం సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే జేడీఎస్ మద్దతు ఉపసంహరణతో ఆయన నాయకత్వంలోని సంకీర్ణ సర్కారు కుప్పకూలింది. తదనంతరం జేడీఎస్-బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చింది.
అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామి 2006 డిసెంబరు 25 నుంచి ఐదు రోజుల పాటు బెల్గాంలోని కేఈఎల్ సంస్థకు చెందిన జవహర్లాల్ నెహ్రూ వైద్య కళాశాలలో తొలి సమావేశాలను నిర్వహించారు. అనంతరం 2009 జనవరి 16 నుంచి అప్పటి ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఐదు రోజులు, గత ఏడాది డిసెంబరు ఐదో తేదీ నుంచి పది రోజుల పాటు జగదీశ్ శెట్టర్లు సమావేశాలను నిర్వహించారు. ఈ మూడు పర్యాయాలు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు అధికారం పక్షంగా మారింది.