ప్రధాని సతీమణికి భారీ జరిమానా
జెరూసలెం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సతీమణికి లేబర్ కోర్టు భారత కరెన్సీలో సుమారు 30 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. గతంలో నమోదైన కేసును విచారించి తమ తీర్పును వెల్లడించింది. నెతన్యాహు భార్య సారా నెతన్యాహు తమ ఇంట్లో పనిచేసే స్టాఫ్ పై వ్యక్తిగత దూషణకు దిగిందని గతంలో ఫిర్యాదులు అందాయి. మెని నఫ్టాలి అనే వ్యక్తి గతంలో సారా ఇంట్లో ఉంటూ ఆమె కెర్ టేకర్ గా ఉండేవాడు. అయితే ఆవేశానికి లోనైన సారా తనను అవమానించడంతో పాటు దూషించిందని తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు.
తాజాగా ఈ కేసు విచారణ చేపట్టిన లేబర్ న్యాయస్థానం నఫ్టాలి చెప్పిన వివరాలపై స్పందించి ప్రధాని సతీమణికి జరిమానా విధించింది. ఈ పరిహారాన్ని నఫ్టాలికి చెల్లించాలని తీర్పునిచ్చింది. తనపై చేసినవన్నీ అసత్యాలంటూ సారా కొట్టిపారేశారు. ఇంట్లో పనిచేసే వారితో పద్ధతిగానే వ్యవహరించానని పేర్కొన్నారు. ప్రధాని కార్యాలయం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. గతంలోనూ హౌస్ కీపర్ పై ఆమె దురుసుగా ప్రవర్తించిందంటూ కేసు నమోదు కాగా, ఆ వ్యవహారం కోర్టు వరకు వెళ్లకుండానే సెటిల్ చేసుకున్న విషయం విదితమే.