Sarannavaratri festival
-
ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారంలో దుర్గమ్మ (ఫొటోలు)
-
శరదృతువులో అక్కడ పడవలతో పండుగ సందడి..ఏకంగా..!
సరస్సులో పడవల సందడితో కనువిందు చేసే పండుగ ఇది. ఏటా శరదృతువులో పద్దెనిమిది రోజుల పాటు కొనసాగే ఈ పండుగ కోలాహలం చూసి తీరాల్సిందే! మయాన్మార్‌లోని ఇన్లే సరస్సు ఒడ్డున ఉన్న ‘ఫాంగ్ డా వూ’ పగోడా వరకు పద్దెనిమిది రోజుల పాటు పడవల ఊరేగింపు జరుగుతుంది. మయాన్మార్ చాంద్రమాన కేలండర్లోని ఏడో నెల అయిన థాడింగ్యుట్ నెలలో శుక్లపక్షం మొదటి రోజు నుంచి బహుళపక్షం మూడో రోజు వరకు జరిగే ఈ పండుగలో లక్షలాది మంది జనాలు పాల్గొంటారు. ఈసారి ఈ పండుగ అక్టోబర్ 3 నుంచి ప్రారంభమై, 20 వరకు జరుగుతోంది. మయాన్మార్‌లోని మైనారిటీ తెగలకు చెందిన ‘ఇంథా’, ‘పావో’ తెగలవారు ఈ పండుగలో పెద్దసంఖ్యలో పాల్గొంటారు. పండుగ జరిగే పద్దెనిమిది రోజుల్లోనూ ఇన్లే సరస్సులో పడవల మీద ఊరేగింపుగా వెళ్లి ‘ఫాంగ్ డా వూ’ పగోడాకు చేరుకుంటారు. పగోడాలో బంగారుపూతతో కొలువుదీరిన ఐదు బుద్ధప్రతిమలను భక్తిగా తాకి, వాటికి బంగారు రేకులను అతికిస్తారు. విగ్రహాలు మరీ బరువుగా మారడం వల్ల పగోడా నిర్వాహకులు విగ్రహాలకు భక్తులు బంగారు రేకులను అతికే ప్రక్రియపై 2019 నుంచి నిషేధం అమలు చేస్తున్నారు. ఈ విగ్రహాల వద్ద భక్తులు సామూహికంగా ప్రార్థనలు జరుపుతారు. ఇన్లే సరస్సు తీరంలోని గ్రామాల్లో ఈ పద్దెనిమిది రోజులూ పండుగ కోలాహలం అట్టహాసంగా కనిపిస్తుంది. పడవల ఊరేగింపు జరిగినన్ని రోజులూ హంస ఆకారంలో ఉన్న రాచపడవను అనుసరించి వందలాది పడవలు ‘ఫాంగ్ డా వూ’ పగోడా తీరం వరకు ప్రయాణిస్తాయి.(చదవండి: అత్యంత అరుదైన వరుణదేవుడి ఆలయం..!) -
అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన విజయవాడ కనకదుర్గ (ఫొటోలు)
-
పండగ వేళ : మూడవ రోజు గాయత్రీ అలంకారంలో అమ్మవారు
-
భక్తులతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి
-
మహిషాసురమర్దినిగా దుర్గమ్మ దర్శనం
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నిన్న దుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు...ఈ రోజు (సోమవారం) మహిషాసురమర్ధినిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆ జగన్మాత దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. మహిషుడు అనే రాక్షసుడిని సంహరించింనందుకు జగన్మాతకు మహిషాసురమర్దని అనే పేరు వచ్చింది. తొమ్మిదిరోజులపాటు సాగిన రణంలో రోజుకో రూపంతో అమ్మవారు యుద్ధం చేశారు. సింహ వాహనాన్ని అధిరోహించి, చేతిలో త్రిశూలం ధరించి ఉగ్రరూపంతో తల్లి దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై మహిషాసురమర్దినిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో దుర్గగుడి అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చి దుర్గామాత పటాన్ని బహుకరించారు. -
భక్తజనకీలాద్రి.. నవరాత్రుల శోభ
దిగువన కృష్ణమ్మ పరవళ్లు.. ఎగువన దుర్గమ్మ దీవెనలు.. కొండంతా సంబరమే.. అల కైలాసం ఇల దిగినంత వైభోగమే.. జగన్మాత కనక దుర్గమ్మ స్వర్ణరూప ధారిణిగా సాక్షాత్కరించిన వేళ.. దేదీప్యమానమైన ఇంద్రకీలాద్రి భక్తకోటితో మరింత తేజోమయమైంది. నవరాత్రుల శోభ విజయవాడ నలుదిశలా పండువెన్నెలలా ప్రకాశించింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు స్వర్ణ కవచాలంకృత దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు, దుర్గగుడి ఈవో ఎంవీ సురేష్‌బాబు దంపతులు తొలి దర్శనం చేసుకున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆది దంపతుల నగరోత్సవం కనులపండువగా సాగింది. ఇంద్రకీలాద్రి / విజయవాడ పశ్చిమ: ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు రికార్డు స్థాయిలో భక్తులు అమ్మవారి సన్నిధికి తరలిరావడంతో ఇంద్రకీలాద్రి భక్తజనకీలాద్రిగా మారింది. తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ, స్నపనాభిషేకం, అలంకరణ, నిత్య పూజల అనంతరం అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గగుడి ఈవో ఎంవీ సురేష్‌బాబు దంపతులు, నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, ఫెస్టివల్ ఆఫీసర్ రామచంద్రరావుతో పాటు పలువురు పోలీసు అధికారులు, ప్రముఖులు అమ్మవారి తొలి దర్శనం చేసుకొని తరించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని ఊరేగింపుగా మహా మండపం ఆరో అంతస్తుకు తరలించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆరో అంతస్తులో ఉత్సవమూర్తిని ప్రతిష్టించారు. ఆలయ ఈవో, సీపీ దంపతులు ఉత్సవమూర్తి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కిటకిటలాడిన క్యూలైన్లు దసరా ఉత్సవాల తొలి రోజు, ఆదివారం కావడంతో రికార్డు స్థాయిలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లో వేచిఉన్నారు. ఉదయం 8 గంటల నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. ఆదివారం ఒక్క రోజే సుమారు లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు పేర్కొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం భక్తులు మల్లేశ్వరాలయం, మహా మండపం మెట్ల మార్గం ద్వారా కొండ దిగువకు చేరుకున్నారు. లక్ష కుంకుమార్చన, శత చండీ హోమం మహామండపం ఆరో అంతస్తులో లక్ష కుంకుమార్చన, యాగశాలలో శత చండీహోమం నిర్వహించారు. పలువురు ఉభయదాతలు, భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. విశేష అర్చనలో పాల్గొన్న ఉభయదాతలను ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మను పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సేవలో పాల్గొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఐ.సీతారామమూర్తి, జస్టిస్ జి.శ్యామ్‌ప్రసాద్, గుంటూరు జిల్లా జడ్జి జస్టిస్ కె.వాసంతి, దేవదాయ శాఖ కమిషనర్ ఎం.పద్మ దంపతులు, మంత్రి మోపిదేవి వెంకటరమణ దంపతులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ప్రముఖులకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. ‘దసరా’లో ప్రత్యేక పూజలు ఇవే.. ఇంద్రకీలాద్రి: దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా మహోత్సవాల్లో భాగంగా ప్రతి నిత్యం అమ్మవారికి విశేష పూజలు జరుగుతున్నాయి. ఉత్సవాలు జరిగే పది రోజులు లక్ష కుంకుమార్చన, ఛండీయాగం నిర్వహిస్తారు. మహా మండపం ఆరో అంతస్తులో రెండు షిప్టుల్లో లక్ష కుంకుమార్చన జరుగుతుండగా, మొదటి షిప్టులో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, రెండో షిప్టులో 10 నుంచి 12 గంటల వరకు జరుగుతాయి. మల్లేశ్వరాలయానికి చేరుకునే మార్గంలోని యాగశాలలో ప్రతి రోజు 9 గంటల నుంచి ఛండీయాగం నిర్వహిస్తారు. ప్రతి నిత్యం జరిగే శ్రీచక్రనవార్చన దసరా ఉత్సవాల్లో యథావిధిగా జరిగినా భక్తులు పాల్గొనే అవకాశం లేదు. ఉత్సవాల పది రోజులు ప్రత్యేకంగా మహా మండపం ఆరో అంతస్తులో సూర్య నమస్కారాలు, బాలా, సుహాసిని పూజలు జరుగుతాయి. మనోహరం.. కళార్చనం విజయవాడ : వికారినామ దసరా మహోత్సవాల్లో భాగంగా దేవదాయ శాఖ, ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో మల్లికార్జున మహామండపంలో ప్రత్యేకంగా నిర్మించిన వేదికపై ఆదివారం ఉదయం 8 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తిరంజనిలో భాగంగా అమృత, నవ్య సిస్టర్స్, పి.ప్రమీల తదితరులు భక్తి గీతాలు, కీర్తనలను ఆలపించారు. దుర్గమ్మకు నృత్య హారతి నృత్య కార్యక్రమంలో భాగంగా పలువురు కళాకారులు భారతీయ నృత్య రీతులను ప్రదర్శించారు. కూచిపూడి, భరతనాట్యం, కథక్ అంశాలను కళాకారులు మనోహరంగా అభినయించారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాంశాలు ఆకట్టుకున్నాయి. నాట్యాచార్యులు మునిపల్లి నాగమల్లి, సప్పా శివకుమార్, దావులూరి అపర్ణ, ఎం.అనూషా నాయుడు తదితర బృందాలు అన్నమయ్య కీర్తనలు, జయదేవుని అష్టపదులు, రామదాసు కీర్తనలకు నృత్యాలను అభినయించాయి. నిర్వాహకులు కళాకారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. నేటి కార్యక్రమాలు ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు భక్తిరంజని, శాస్త్రీయ సంగీతం, వయోలిన్, మృద ంగం కార్యక్రమాలు సాగుతాయి. సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు కూచిపూడి, భరతనాట్యం అంశాలను ప్రదర్శిస్తారు. -
శ్రీస్వర్ణకవచాలంకృత అలంకారంలో దుర్గమ్మ
సాక్షి, విజయవాడ/శ్రీశైలం ప్రాజెక్ట్: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి ఆదివారం నుంచి దశమి వరకు పది రోజులపాటు అమ్మవారు పది అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇస్తారు. రాష్ట్ర పండగ కావడంతో అన్ని ప్రభుత్వ రంగ శాఖలు ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యం అవుతున్నాయి. తొలిరోజు శ్రీ స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. తెల్లవారుజాము నుంచే దర్శనాలు తొలిరోజు స్నపనాభిషేకం అనంతరం ఉ.9 గంటలకు భక్తులు అమ్మవారి దర్శనం ఇస్తున్నారు. రెండోరోజు నుంచి తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు. అక్టోబర్ 5 మూలా నక్షత్రం రోజున ఉదయం రెండు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం చేసుకునే అవకాశం ఉంది. 5న ముఖ్యమంత్రి పట్టువస్త్రాల సమర్పణ మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు సమర్పిస్తారు. 8వ తేదీ విజయదశమి రోజు సాయంత్రం కృష్ణానదిలో నదీవిహారం తెప్పోత్సవం నిర్వహిస్తారు. హంస వాహనంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీదుర్గామల్లేశ్వరుల నదీ విహారం కనులపండుగగా సాగుతుంది. కాగా, ఉత్సవాల్లో ఉభయదాతల కోసం ప్రత్యేకంగా లక్ష కుంకుమార్చన, విశేష చండీహోమాలను ఆలయ ఋత్వికులు ప్రతిరోజు నిర్వహించనున్నారు. భక్తులు నిర్ణీత రుసుము చెల్లించి ఈ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. అలాగే, ప్రతిరోజు సా.6 గంటలకు శివాలయం మెట్ల వద్ద నుంచి అర్జున వీధి మార్గం, రథం సెంటర్, వినాయక గుడి, తిరిగి రథం సెంటర్ మీదుగా టోల్గేట్ ద్వారా కొండపై వరకు నగరోత్సవం నిర్వహిస్తారు. ఎక్కడెక్కడ ఏమేంటి.. కనకదుర్గానగర్‌లో ప్రసాదాల కౌంటర్లు, అర్జున వీధిలోని అన్నదాన భవనం వద్ద అన్నప్రసాద వితరణ, సీతమ్మవారి పాదాలు వద్ద కేశఖండనశాలను ఏర్పాటుచేశారు. వృద్ధులు, వికలాంగులకు ఉచిత వాహనాలను ఏర్పాటుచేశారు. కొండ దిగువన చెప్పుల స్టాండ్, క్లోక్ రూమ్ ఏర్పాటుచేశారు. ఏ రోజున ఏ అలంకారం.. 29న స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి 30న బాలా త్రిపుర సుందరీదేవి 01న గాయత్రి దేవి 02న అన్నపూర్ణాదేవి 03న లలితా త్రిపుర సుందరీదేవి 04న మహాలక్ష్మీ దేవి 05న సరస్వతీదేవి (మూలా నక్షత్రం) 06న దుర్గాదేవి (దుర్గాష్టమి) 07న మహిషాసుర మర్ధనీదేవి (మహర్నవమి) 08న రాజరాజేశ్వరీ దేవి (విజయ దశమి) శ్రీశైలంలోనూ నేటి నుంచి.. కర్నూలు జిల్లా శ్రీశైల మహా క్షేత్రంలో కూడా ఆదివారం నుంచి అక్టోబర్ 8 వరకు శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఈ ఉత్సవాల సందర్భంగా శ్రీ మల్లికార్జునస్వామివార్లకు విశేషార్చనలు, శ్రీభ్రమరాంబాదేవికి ప్రత్యేక నవావరణార్చనలు, రుద్ర, చండీయాగాలు, అలంకారాలు, వాహన సేవలు నిర్వహిస్తారు. అలాగే, పలు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. అక్టోబర్ 7న రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ఉత్సవాల చివరి రోజు విజయ దశమి పర్వదినం నాడు సాయంత్రం ఆలయ పుష్కరిణిలో స్వామి, అమ్మవార్లకు తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ కేఎస్ రామారావు తెలిపారు. ఆ తరువాత శమీ పూజతో ఉత్సవాలు ముగుస్తాయి. -
శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలి
హన్మకొండ కల్చరల్ : భద్రకాళి ఆలయంలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని దేవాదాయశాఖ జేవీఓ, ఆలయ ఈఓ కట్టా అంజనీదేవి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆలయ ప్రాంగణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. శనివారం నుంచి 12వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భక్తుల కోసం తగిన సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. దసరారోజు వాహన పూజలు కీర్తి గార్డె¯Œ్స వద్దనే ఉంటాయన్నారు. అమ్మవారి విశేష సేవలో యాజమాన్యం కోరుకునే వారు రూ. 1,116 చెల్లించి దేవస్థాన కార్యాలయంలో రశీదు పొందాలన్నారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు మాట్లాడుతూ భద్రకాళి అమ్మవారు స్వయం వ్యక్తంగా వరంగల్‌లో వెలిసిందన్నారు. నవరాత్రుల్లో శతచండీయాగం నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం దేవీ నవరాత్రి ఉత్సవాల వాల్‌పోస్టర్లను అధికారులు, అర్చకులు ఆవిష్కరించారు. ఆలయ సూపరింటెండెంట్ అద్దంకి విజయ్‌కుమార్, కూచన హరినాథ్, వెంకటయ్య, అశోక్, అర్చకులు సోమసుందరశర్మ, రాము, చింత శ్యామ్‌సుందర్ పాల్గొన్నారు.