సాక్షి, విజయవాడ/శ్రీశైలం ప్రాజెక్ట్: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి ఆదివారం నుంచి దశమి వరకు పది రోజులపాటు అమ్మవారు పది అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇస్తారు. రాష్ట్ర పండగ కావడంతో అన్ని ప్రభుత్వ రంగ శాఖలు ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యం అవుతున్నాయి. తొలిరోజు శ్రీ స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.
తెల్లవారుజాము నుంచే దర్శనాలు
తొలిరోజు స్నపనాభిషేకం అనంతరం ఉ.9 గంటలకు భక్తులు అమ్మవారి దర్శనం ఇస్తున్నారు. రెండోరోజు నుంచి తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు. అక్టోబర్ 5 మూలా నక్షత్రం రోజున ఉదయం రెండు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం చేసుకునే అవకాశం ఉంది.
5న ముఖ్యమంత్రి పట్టువస్త్రాల సమర్పణ
మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు సమర్పిస్తారు. 8వ తేదీ విజయదశమి రోజు సాయంత్రం కృష్ణానదిలో నదీవిహారం తెప్పోత్సవం నిర్వహిస్తారు. హంస వాహనంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీదుర్గామల్లేశ్వరుల నదీ విహారం కనులపండుగగా సాగుతుంది. కాగా, ఉత్సవాల్లో ఉభయదాతల కోసం ప్రత్యేకంగా లక్ష కుంకుమార్చన, విశేష చండీహోమాలను ఆలయ ఋత్వికులు ప్రతిరోజు నిర్వహించనున్నారు. భక్తులు నిర్ణీత రుసుము చెల్లించి ఈ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. అలాగే, ప్రతిరోజు సా.6 గంటలకు శివాలయం మెట్ల వద్ద నుంచి అర్జున వీధి మార్గం, రథం సెంటర్, వినాయక గుడి, తిరిగి రథం సెంటర్ మీదుగా టోల్‌గేట్ ద్వారా కొండపై వరకు నగరోత్సవం నిర్వహిస్తారు.
ఎక్కడెక్కడ ఏమేంటి..
కనకదుర్గానగర్‌లో ప్రసాదాల కౌంటర్లు, అర్జున వీధిలోని అన్నదాన భవనం వద్ద అన్నప్రసాద వితరణ, సీతమ్మవారి పాదాలు వద్ద కేశఖండనశాలను ఏర్పాటుచేశారు. వృద్ధులు, వికలాంగులకు ఉచిత వాహనాలను ఏర్పాటుచేశారు. కొండ దిగువన చెప్పుల స్టాండ్, క్లోక్ రూమ్ ఏర్పాటుచేశారు.
ఏ రోజున ఏ అలంకారం..
29న స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి
30న బాలా త్రిపుర సుందరీదేవి
01న గాయత్రి దేవి
02న అన్నపూర్ణాదేవి
03న లలితా త్రిపుర సుందరీదేవి
04న మహాలక్ష్మీ దేవి
05న సరస్వతీదేవి (మూలా నక్షత్రం)
06న దుర్గాదేవి (దుర్గాష్టమి)
07న మహిషాసుర మర్ధనీదేవి (మహర్నవమి)
08న రాజరాజేశ్వరీ దేవి (విజయ దశమి)
శ్రీశైలంలోనూ నేటి నుంచి..
కర్నూలు జిల్లా శ్రీశైల మహా క్షేత్రంలో కూడా ఆదివారం నుంచి అక్టోబర్ 8 వరకు శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఈ ఉత్సవాల సందర్భంగా శ్రీ మల్లికార్జునస్వామివార్లకు విశేషార్చనలు, శ్రీభ్రమరాంబాదేవికి ప్రత్యేక నవావరణార్చనలు, రుద్ర, చండీయాగాలు, అలంకారాలు, వాహన సేవలు నిర్వహిస్తారు. అలాగే, పలు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. అక్టోబర్ 7న రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ఉత్సవాల చివరి రోజు విజయ దశమి పర్వదినం నాడు సాయంత్రం ఆలయ పుష్కరిణిలో స్వామి, అమ్మవార్లకు తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ కేఎస్ రామారావు తెలిపారు. ఆ తరువాత శమీ పూజతో ఉత్సవాలు ముగుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment