త్రిష చీర సింగారం
నటి త్రిష చీర సింగారం పురాణంతో తెగ మురిసిపోతున్నారు. దర్శకుడు గౌతమ్‌మీనన్ విన్నై తాండి వరువాయా చిత్రంలో త్రిషను చీరకట్టుతో ఆవిష్కరించిన జెస్సీ పాత్రను తమిళ ప్రేక్షకులు ఇంకా మరచిపోలేదు. ఆ పాత్రకు లభించిన అప్లాజ్ త్రిష జీవితాంతం మరచిపోలేరు కూడా. ఆ తరువాత ఈ చెన్నై చిన్నదానికి అంత పేరు తెచ్చిన పాత్ర లేదన్నది నిజం. అందుకే త్రిష కూడా దర్శకుడు గౌతమ్‌మీనన్‌పై తన అభిమానాన్ని చాటుకుంటుంటారు.
మరో విషయం ఏమిటంటే త్రిష మార్కెట్ పడిపోతుందనుకుంటున్నప్పుడల్లా గౌతమ్‌మీనన్ ఆమెకో అవకాశం ఇస్తూ ఆదుకుంటున్నారట. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో అజిత్ సరసన నటించే ఛాన్స్ ఇచ్చారు. ఈ విషయాన్ని త్రిష స్వయంగా తన ట్విట్టర్లో పేర్కొనడం విశేషం. అదేవిధంగా ఈ చిత్రంలో మరోసారి త్రిషను చీరలో బహు సుందరంగా చూపించనున్నారట. ఇటీవల వినాయక చతుర్ధశి రోజున స్టైలిష్ గెటప్‌లో అజిత్, చీర కట్టు సింగారంతో త్రిష నటించిన సన్నివేశాల్లో మెరిసిపోయారు. ఈ జంటను చూసిన అజిత్ అభిమానులు తెగ సంతోష పడిపోతున్నారట.
తల (అజిత్) సరన అత్యధిక చిత్రాల్లో నటించిన హీరోయిన్ త్రిషేనని, సరైన జోడి కూడా వీరేనని అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తూ ట్విట్టర్లో పేర్కొన్నారు. దీంతో త్రిష ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నా యి. దీని కంతటికీ కారణం దర్శకుడు గౌతమ్‌మీనన్ అని ఆయనకి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. అయితే ఇటీవల కన్నడ చిత్ర రంగంలోకి ప్రవేశించిన ఈ బ్యూటీ అక్కడ టూపీస్ దుస్తులు ధరించి గ్లామరస్లా దుమ్ము లేపారు. ఈ వ్యవహారంలో ఆమె అందాలను ఆహా అంటూ సొంగ కార్చుకుంటూ ఆశ్వాదించిన వారు కొందరైతే ఈ వయసులో ఈమెకు ఎక్స్పోజ్ అవసరమా? అంటూ విమర్శ లు గుప్పిస్తున్నారు మరి కొందరు. ఇలాంటి వాటిని పక్కదోవ పట్టించడానికే త్రిష తన చీర పురాణం అందుకుందని కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి.