మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు కన్నుమూత
జియ్యమ్మవలస: వైఎస్సార్ సీపీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్‌రాజు తండ్రి, మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మామ, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు శుక్రవారం కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మూడురోజుల నుంచి విశాఖపట్నంలో ఉంటూ వైద్యసేవలు పొందుతున్నారు. శుక్రవారం ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబీకులు ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే ప్రాణాలు విడిచారు.
ఆయన భౌతికకాయాన్ని పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలోని చినమేరంగి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. చంద్రశేఖరరాజు 1989 నుంచి 1994 వరకు నాగూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున గెలుపొందారు. ఏపీఈసీజీసీ చైర్మన్‌గా పనిచేశారు. కొమరాడ జెడ్పీటీసీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయనకు భార్య రాజశ్రీదేవి, కుమారుడు పరీక్షిత్‌రాజు, కుమార్తె పల్లవిరాజు ఉన్నారు. మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజు ఈయనకు సోదరుడు.
కాగా, శత్రుచర్ల చంద్రశేఖరరాజు మృతివార్త తెలిసిన వెంటనే జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు, డాక్టర్ రామ్మోహనరావు చినమేరంగి చేరుకుని భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.