‘బంగారు పతకాల తెలంగాణ’ సాధిద్దాం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడల్లో మేటిగా ఉంచేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తామని స్పోర్ట్స అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్స్) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఆటల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. బంగారు తెలంగాణకు కొనసాగింపుగా ‘బంగారు పతకాల తెలంగాణ’ సాధించడమే తమ లక్ష్యమని చైర్మన్ వెల్లడించారు. తాను చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వివిధ అంశాలపై తీసుకున్న చర్యలు, సమీక్షా సమావేశాలు తదితర అంశాల గురించి బుధవారం జరిగిన మీడియా సమావేశంలో వెంకటేశ్వర రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో ‘శాట్స్’ మేనేజింగ్ డెరైక్టర్ ఎ.దినకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
భారీ ప్రోత్సాహకాలు...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి క్రీడల నిర్వహణతో పాటు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని చైర్మన్ చెప్పారు. 2014 జూన్ 2నుంచి ఇప్పటి వరకు ఇందు కోసం మొత్తం రూ. 15 కోట్ల 8 లక్షలు ఖర్చు చేసినట్లు ఆయన వివరాలు ప్రకటించారు. తాను జరిపిన సమావేశాల్లో ఆటల అభివృద్ధి కోసం క్రీడా ప్రముఖులు, అర్జున, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలనుంచి పలు విలువైన సూచనలు వచ్చాయని, వాటిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని వెంకటేశ్వర రెడ్డి పేర్కొన్నారు. గచ్చిబౌలి స్టేడియంను పూర్తి స్థారుులో క్రీడా కేంద్రంగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటాని చైర్మన్ స్పష్టం చేశారు. మరో వైపు కొంత మంది క్రీడాకారులకే భారీ మొత్తం ఇవ్వడంపై స్పందిస్తూ... అది వేర్వేరు కారణాలు, అంశాలపై ఆధారపడి ప్రభుత్వం తీసుకున్న విచక్షణాపరమైన నిర్ణయమని ఎండీ దినకర్ బాబు వివరణ ఇచ్చారు. మరోవైపు యోగాలాంటి గుర్తింపు లేని క్రీడల టోర్నీ నిర్వహణ కోసం పెద్ద మొత్తం కేటారుుంచడాన్ని కూడా ఆయన సమర్థించుకున్నారు.
చాలా కాలంగా తగిన ప్రోత్సాహం లేకుండా ఉన్న కొన్ని రకాల క్రీడలను గుర్తించి వాటిని కూడా తగిన విధంగా సహాయం అందించడంపై దృష్టి పెట్టామని ఆయన అన్నారు. ప్రతిభ గల యువ ఆటగాళ్లను తగిన విధంగా ఉద్యోగాల ద్వారా, చదువుల్లో రిజర్వేషన్ ద్వారా ప్రోత్సహిస్తామని దినకర్‌బాబు హామీ ఇచ్చారు. మరో వైపు ‘శాట్స్’లో ఖాళీగా ఉన్న కోచ్‌ల ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని, గతంలో కొన్ని అక్రమాలు జరిగినా, ఈసారి దానికి అవకాశం ఇవ్వకుండా సమర్థులైన వారినే ఎంపిక చేస్తామని ఎండీ వెల్లడించారు. తెలం గాణలో క్రీడాభివృద్ధి కోసం ఎవరైనా ముందుకొచ్చి సూచనలు చేయవచ్చని, తాము వాటిని తీసుకొని తగిన విధంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని చైర్మన్ విజ్ఞప్తి చేశారు.