ఇప్పుడు గుర్తుకొచ్చిందా : సండ్రా
సాక్షి, సత్తుపల్లి: ‘కొడుకు కోసం సిరిసిల్లా జిల్లాను చేశావ్. ఒక పద్ధతి లేదు. ఒక కమిటీ లేదు. సత్తుపల్లి జిల్లా చేయమంటే సీఎం కేసీఆర్ అపహాస్యంగా మాట్లాడారు. జిల్లాల పునర్వీభజన అశాస్త్రీయంగా జరిగింది. సత్తుపల్లికి పూర్వ వైభవం తగ్గింది. ఎన్నికలప్పుడు సత్తుపల్లి జిల్లా గుర్తుకు వచ్చిందా?’ అని టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌లు ప్రశ్నించారు. సత్తుపల్లిలో మున్వర్ హుస్సేన్ నివాసంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారంలో ఉండి చేయలేని వాళ్లు.. ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చి మోసగించేందుకు వస్తున్నారని ఆరోపించారు. టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్ పార్టీలు సమన్వయంతో ఒకే పార్టీ వ్యవస్థలా పని చేస్తున్నాయన్నారు.
సింగరేణి సంస్థ షేప్ నిధులు రూ.16 కోట్లు కేటాయిస్తే ప్రభావిత ప్రాంతాలైన ఎన్టీఆర్నగర్, వెంగళరావునగర్, కిష్టారం, కొమ్మేపల్లి, రేజర్లలో నిధులు ఖర్చు చేయలేదని విమర్శించారు. భూ నిర్వాసితులకు పరిహారంలో చాలా అన్యాయం చేశారన్నారు. సత్తుపల్లి సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని, సత్తుపల్లి అభివృద్ధిలో రోల్‌మోడల్‌గా చేస్తామన్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ ఎన్నికల్లో అలజడి సృష్టించి లబ్ధిపొందే ప్రయత్నం చేస్తోందని, ప్రజాకూటమి కార్యకర్తలు దేనికీ భయపడే ప్రశక్తే లేదన్నారు. ఇంటింటి ప్రచారంతో ఓటు బదలాయింపు వందశాతం జరిగేలా పని చేయాలని కోరారు. సీతారామ ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని.. దీని దోపిడీకి వ్యతిరేకమన్నారు. ఇంతకంటే మెరుగైన పథకాలను తీసుకొస్తామన్నారు. పరెడ్ల సత్యనారాయణరెడ్డి, కొర్రపాటి సాల్మన్‌రాజు, నున్నా రామకృష్ణ, గోళ్ల అప్పారావు, దేశిరెడ్డి సత్యనారాయణరెడ్డి, దొడ్డా శంకర్రావు, కూసంపూడి మహేష్, మధు పాల్గొన్నారు.