రేపు బైరాన్‌పల్లికి సాంస్కృతిక సైన్యం శౌర్యయాత్ర
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా మద్దూరు మండలం బైరాన్‌పల్లి గ్రామానికి 14న(శనివారం) సాంస్కృతిక సైన్యం శౌర్యయాత్ర తలపెట్టినట్లు తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధి పాశం యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో ప్రజల ఆలోచనల మీద, సంస్కృతిపైన ఉన్న ఆధిపత్యాన్ని ఎదురించడానికి ప్రగతిశీల, ప్రజాస్వామ్య కవులు, ర చయితలు, కళాకారులు సాంస్కృతిక ఉద్యమం నిర్మించాలని ఈ నెల 7న జరిగిన సమావేశం తీర్మానించిందని పేర్కొన్నారు.
ప్రజాకళాకారులు గద్దర్, గోరటి వెంకన్న, విమలక్క, సుద్దాల అశోక్‌తేజ, జయరాజ్, మాదాల రవి తదితరులు సమావేశమై తీసుకున్న నిర్ణయంలో భాగంగా శనివారం సాయంత్రం నాలుగు గంటలకు బైరాన్‌పల్లి అమరులకు సబ్బండ కళల నివాళి అర్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 21వ తేదీన ఇదే జిల్లాలోని దేవరుప్పుల మండలం కడవెండిలో తెలంగాణ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్యకు నివాళి అర్పించనున్నట్లు తెలిపారు.