'టీ సర్కారుది కోర్టు ధిక్కారం'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చట్టాన్ని, కోర్టును కూడా ధిక్కరిస్తూ ఎటువంటి ప్రణాళిక, ప్రజాభిప్రాయం లేకుండా హుస్సేన్ సాగర్‌ను అశాస్త్రీయంగా ఖాళీ చేయిస్తోందని సేవ్ అవర్ అర్బన్ లేక్స్ (సోల్) ప్రతినిధులు ఆరోపించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో సోల్ కో- కన్వినర్ లుబ్నా సర్వత్, వ్యవస్థాపక సభ్యులు బి.వి. సుబ్బారావు, పర్యావరణ వేత్త ప్రొఫెసర్ పురుషోత్తమ్ రెడ్డి తదితరులు మాట్లాడారు. హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన విషయమై పూర్తి వివరాలు కావాలని తాము జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పీసీబీకి సమాచార హక్కు ద్వారా దరఖాస్తు చేసుకోగా వారు తమవద్ద ఎలాంటి సమాచారం లేదని జవాబిచ్చారని తెలిపారు. దీంతో తాము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేసినట్లు తెలిపారు.
ట్రిబ్యునల్ ఈ నెల 22 లోపు హుస్సేన్‌సాగర్‌ను ఖాళీ చేసే విషయమై పూర్తి వివరాలు అందించాలని, అప్పటివరకూ ఎలాంటి పనులూ చేయవద్దని నీటిని ఎక్కడకూ తరలించరాదని ఆదేశించిందని తెలిపారు. అయితే, ట్రిబ్యునల్ ఆదేశాలను సైతం ప్రభుత్వం బేఖాతారు చేస్తూ తిరిగి నీటిని మళ్లిస్తోందన్నారు. ప్రభుత్వం కోర్టు ధిక్కారంపై సోమవారం మరోసారి కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ప్రమాదకర కలుషిత నీటిని హుస్సేన్‌సాగర్ నుంచి మూసీకి తరలించడం ద్వారా మూసీ చుట్టుప్రక్కన నివసిస్తున్న వారికి ప్రమాదం ఏర్పడుతుందన్నారు.