కప్పు టీ అడిగితే.. కాలు కాల్చేశారు!
న్యూఢిల్లీ: విమానంలో ఎక్కితే చక్కగా గాలిలో ఎగురుతూ త్వరగా గమ్యం చేరుకోవచ్చని అనుకుంటాం. కానీ, విమాన ప్రయాణం ఓ మోడల్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. టీ అడిగిన పాపానికి.. తన తొడ కాలిపోయిందంటూ ఆమె ఫేస్బుక్లో పోస్ట్ చేసిన లేఖ ప్రకంపనలు సృష్టిస్తోంది. యాడ్ మోడల్ మౌమతి (25)... 2015 ఏప్రిల్ 10న ఢిల్లీ నుంచి గోవాకు స్పైస్‌జెట్ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు తనకు ఎదురైన అసౌకర్యాన్ని గురించి తెలుపుతూ బహిరంగంగా లేఖ రాశారు.
''విమానయాన సంస్థలకు ఆదాయం మీద ధ్యాస తప్ప ప్రయాణికుల సౌకర్యాలు, సౌలభ్యం పట్టదు.. షేమ్ ఆన్ యూ'' అంటూ ప్రారంభయ్యే ఆ లేఖ భవిష్యత్తులో ఎవరైనా విమానంలో ప్రయాణించాలనుకుంటే ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకెళ్లడం మర్చిపోవద్దనే సలహాతో ముగుస్తుంది. తాను ఎంతో సంతోషంగా అవార్డు సభకు వెళ్లేందుకు బయల్దేరానని, విమానంలో టీ అడిగి.. దానికి డబ్బులు కూడా చెల్లించానని ఆమె చెప్పింది. వేడి నీళ్లు, టీ బ్యాగ్ తీసుకొచ్చిన ఫ్లైట్ అటెండెంట్.. పొరపాటున ఆ వేడివేడి నీళ్ల కప్పును తన ఒళ్లో పారేసిందని తెలిపింది. ఇది పొరపాటునే జరిగినా.. ఆ తర్వాత వాళ్లు ప్రవర్తించిన తీరు చాలా దారుణంగా ఉందని వాపోయింది.
కాలినగాయాల బాధతో తాను విలవిల్లాడుతుంటే సిబ్బంది అస్సలు పట్టించుకోకుండా.. తమ పని చేసుకుంటూ పోయారని ఆరోపించారు. తాను వాష్‌రూంలోకి వెళ్లి చూసుకుంటే.. తొడ కాలిపోయిందని, క్షణక్షణానికీ ఆ బాధ భరించలేనంతగా పెరిగిపోయిందని మౌమిత ఆవేదన వ్యక్తం చేసింది. ప్రాథమిక చికిత్సకు ఉండాల్సిన కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. విమాన ప్రయాణికుల్లో ఓ డాక్టర్ కూడా ఉండి, ఆయన బర్నాల్ ఆయింట్మెంట్ అడగ్గా.. లేదనే సమాధానం వచ్చిందని విమర్శించింది. కనీసం ఐస్ ముక్కలను సరఫరా చేయలేకపోయారని మండిపడింది. దీనివల్ల తాను మూడు నెలలు మంచానికి పరిమితమవ్వాల్సి వచ్చిందన్నారు.
అధిక చార్జీలు వసూలుచేసే విమానయాన సంస్థలు.. ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేస్తున్నాయని, భవిష్యత్తులో విమానాల్లో ప్రయాణించాలనుకునేవాళ్లు తమకు కావల్సిన జాగ్రత్తలు తామే తీసుకుంటే మంచిదంటూ తన లేఖను ముగించింది.