చర్మం నుంచి నాడీకణాలు!
మనిషి చర్మ మూల కణాల నుంచి పరిణతి చెందిన నాడీకణాలను శాస్త్రవేత్తలు సృష్టించారు. చర్మకణాల నుంచి సృష్టించినా.. ఇవి సహజ నాడీకణాల మాదిరిగానే పనిచేస్తుండటం విశేషం. ఈ కొత్త నాడీకణాలపై పరిశోధనల ద్వారా అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి నాడీసంబంధమైన వ్యాధులకు కొత్త చికిత్సలు, ఔషధాలు కనుగొనేందుకు మార్గం సుగమం అయిందని భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి నాడీకణాలతో నాడీకణాల మార్పిడి కూడా వీలు కావచ్చని అంటున్నారు. సాధారణంగా మూలకణాలు శరీరంలో ఏ కణంగానైనా మారే శక్తిని కలిగి ఉంటాయి.
ఎప్పుడు విభజన చెందాలి? ఎప్పుడు విభజన చెందడం ఆగాలి? ఎప్పుడు ఏ కణంగా మారాలి? అన్నదీ ఇవి నియంత్రించుకోగలవు. అయితే శరీరంలోని చాలా అవయవాల్లో కణజాలాల్లో ఉండే ట్రాన్స్‌స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్ అనే ప్రొటీన్లకు కూడా ఇలాంటి మూలకణాలను ఏర్పర్చే శక్తి ఉందని గతంలోనే గుర్తించారు. ఈ నేపథ్యంలో కప్ప టాడ్‌పోల్ డింభకాల్లో నాడులు ఎలా ఏర్పడుతున్నాయన్న కోణంలో పరిశోధించిన యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి శాస్త్రవేత్తలు మనిషి నాడీకణాలను వేగంగా పరిణతి చెందించేందుకు ఉపయోగపడే ప్రక్రియను గుర్తించారు. ట్రాన్స్‌స్క్రిప్షన్ ఫ్యాక్టర్ ప్రొటీన్లను చర్మకణాలకు జతచేసి చర్మకణాలతో పరిణతి చెందిన నాడీకణాలను వారు విజయవంతంగా తయారు చేయగలిగారు.