మహోజ్వల భారతి: మహామహులు చదివిన కాలేజీ
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ‘స్కాటిష్ చర్చ్ కాలేజ్’ సంస్థాపన జరిగి నేటికి 192 ఏళ్లు. ప్రస్తుతం కలకత్తా యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న ఈ కాలేజ్‌ని 1830 జూలై 13న అలెగ్జాండ్ డఫ్ అనే క్రైస్తవ సంఘం ప్రముఖుడు కలకత్తాలో స్థాపించారు. కో–ఎడ్ అయిన ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ట్ కళాశాల మొదట ‘జనరల్ అసెంబ్లీ’స్ ఇన్స్టిట్యూట్’ అనే పేరుతో మొదలైంది. తర్వాత ‘ఫ్రీ చర్చ్ ఇన్స్టిట్యూట్’, ‘డఫ్ కాలేజ్’, ‘స్కాటిష్ చర్చస్ కాలేజ్’ అని పేర్లు మార్చుకుంటూ.. 1929లో ‘స్కాటిష్ చర్చి కాలేజ్’గా స్థిరపడింది.
స్వామి వివేకానంద, సుభాస్ చంద్రబోస్, చంద్రముఖి బసు, గురుదాస్ బెనర్జీ, జానకీనాథ్ బోస్, బ్రహ్మబాంధవ్ ఉపాధ్యాయ వంటి ప్రసిద్ధులు, ఉద్యమకారులు ఈ కళాశాలలో చదివారు. అలెగ్జాండర్ డఫ్ స్కాట్లాండ్లోని ‘జనరల్ అసెంబ్లీ ఆఫ్ ది చర్చ్ ఆఫ్ స్కాట్లాండ్’ ను ఆదర్శంగా తీసుకుని కలకత్తాలో ఈ స్కాటిష్ చర్చ్ కాలేజ్‌ని నెలకొల్పారు. ఈస్టిండియా కంపెనీతో ఉన్న సంబంధాలలో భాగంగా కలకత్తా వచ్చినప్పుడు ఇంగ్లిష్ భాషకు ఇండియాలో ప్రాచుర్యం తెచ్చేందుకు కళాశాల ఏర్పాటును ఒక మార్గంగా ఎంచుకున్నారు. ఇంగ్లిష్తో పాటే స్థానిక భాషలైన బెంగాలీ, సంస్కృతాలకు తగిన ప్రాధాన్యం ఇచ్చారు. భారత ప్రభుత్వం 1980లో ఈ కళాశాల పేరు మీద తపాలా బిళ్లను విడుదల చేసింది.