తేజస్వి సూర్య హత్యకు కుట్ర.. ఆరోజు ఏం జరిగింది
సాక్షి, బెంగళూరు: హిందూ సంఘాల నేతలను హత్య చేసి బెంగళూరు నగరంలో అల్లకల్లోలం సృష్టించేందుకు సోషియల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) పన్నిన కుట్ర బట్టబయలైంది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తపై జరిగిన హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయిన ఆరుగురు ఎస్‌డీపై కార్యకర్తలను విచారణ చేపట్టగా కుట్ర విషయం వెలుగుచూసింది. నగర పోలీస్ కమిషనర్ భాస్కర్‌రావ్ శుక్రవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ఈ మేరకు... టైలర్‌గా పనిచేసే ఆర్టీ.నగర శాంపుర మెయిన్‌రోడ్డు నివాసి ఇర్ఫాన్ అలియాస్ మహ్మద్ ఇర్ఫాన్, ఆర్టీ.నగర భువనేశ్వరినగరకు చెందిన సయ్యద్ అక్బర్‌అలియాస్ మెకానిక్ అక్బర్, ఓ కంపెనీలో డెలివరీ బాయ్‌గా పనిచేసే కేజీ.హళ్లి గోవిందపుర, గాందీనగర నివాసి అక్బర్‌బాషా అక్బర్, లింగరాజపుర సివిల్ కాంట్రాక్టర్ సయ్యద్‌సిద్దికి అక్బర్, ఆర్టీ.నగర శాంపుర మెయిన్‌రోడ్డులో ఎలక్ట్రికల్ ఇంటీరియల్ పనులు నిర్వహించే సన అలియాస్ సనావుల్లా ష్‌రీఫ్, శివాజీనగర చాందినీచౌక్ సౌండ్‌సిస్టమ్స్ దుకాణంలో పనిచేసే సాధిక్ ఉల్ అమీన్ అలియాస్ సౌండ్ సాధిక్లు నిందితులు. వీరంతా తమ వృత్తుల్లో కొనసాగుతూ మరో వైపు ఎస్డీపీఐ కార్యకర్తలుగా చలామణిలో ఉన్నారు.
వీరు గత ఏడాది డిసెంబరు 22 న కలాసీపాళ్య న్యూలేఔట్ కంబారగుండి రోడ్డులో ఆర్ఎస్ఎస్ కార్యకర్త వరుణ్‌పై నిందితులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. నిందితులను విచారణ చేపట్టగా బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్వి సూర్య, వాగ్మి యువబ్రీగేడ్ సంస్థాపకుడు చక్రవర్తి సూలబెలెలను హత్య చేయాలని కుట్ర పన్నినట్లు వెలుగు చూసింది.
ఆరోజు ఏం జరిగిందంటే..
బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్వి సూర్య, వాగ్మియు వబ్రిగేడ్ సంస్థాపకుడు చక్రవర్తి సూలబెలెలు డిసెంబరు 22 తేదీన సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలకు మద్దతుగా టౌన్హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో నిందితులు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. అనంతరం ఒంటరిగా బైక్‌పై వెళ్తున్న వరుణ్‌ను వెంబడించారు. కంబారగుండి రోడ్డులో అడ్డుకుని మారణాయుధాలతో తల, గొంతు ఇతర భాగాల్లో దాడి చేసి ఉడాయించారు.
తొలుత రాళ్లదాడి..అనంతరం హత్యకు పథకం
హిందూ సంఘాల నాయకులు ర్యాలీలు నిర్వహించే సమయంలో రాళ్లదాడికి పాల్పడితే ప్రజలు చెల్లాచెదరవుతారని, ఆ సమయంలో హిందూ సంఘాల నేతలు మాత్రమే ఉంటారని ఆ సమయంలో వారిని హత్య చేస్తే మత కలహాలు జరిగినట్లు ప్రజలు భావించేలా నిందితులు కుట్ర పన్నారు.
ముందు జాగ్రత్తలు
ఎస్డీపీఐ కార్యకర్తలు తమ దురాగతాలపై సాక్ష్యాలు, ఆధారాలు లభించకుండా ముందు జాగ్రత్తలు పాటించారు. తమ సెల్ఫోన్లను ఇంట్లోనే పెట్టి వెళ్లేవారు. ముఖం కనబడకుండా హెల్మెట్ ధరించేవారు. దురాగతాలకు పాల్పడేందుకు చోరీలకు పాల్పడిన వాహనాలను వినియోగించేవారు. వాహనాల నెంబర్ప్లేట్లకు నల్లరంగుతో రాసేవారు. పథకాన్ని అమలు చేయడానికి వెళ్లే సమయంలో రెండు మూడు జీన్స్ ప్యాంట్స్, షర్ట్స్, టీషర్ట్స్‌లను ఒకదానిపై ఒకటి ధరించేవారు. ఘటనకు పాల్పడేటప్పుడు ఒక రకం దుస్తులు, ఘటన అనంతరం టీషర్ట్ వేసుకునేవారు. కొద్దిదూరం వెళ్లి టీ షర్ట్స్ తొలగించి వాహనాలను మార్చి ఇంటికి వెళ్లే సమయంలో మరో రకం దుస్తులు ధరించేవారు.
ఇలా పట్టుకున్నారు
వరుణ్‌పై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి నిందితులను అరెస్ట్ చేసేందుకు పశ్చిమవిభాగ డీసీపీ బీ.రమేశ్, చిక్కపేటే ఉపవిభాగ ఏసీపీ మహంతరెడ్డి నేతృత్వంలో చామరాజపేటే పోలీస్‌స్టేషన్ సీఐ బీజీ.కుమారస్వామి, కలాసీపాళ్య సీఐ శివకుమార్, ఎస్ఐలు నారాయణ, కృష్ణమూర్తి, మూర్తి, శృతి, మంజునాథ్, రవీశ్ తతదితరులతో కూడిన ప్రత్యేకబృందం ఏర్పాటైంది. ఘటనా స్థలం నుంచి వెయ్యి మీటర్ల వరకు మధ్యలో ఉన్న 700 సీసీ కెమెరాలనుంచి 850 గంటల నిడివి ఉన్న ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. దుండగులు వాడిన పేపరు, సిగరెట్, వాడి పడేసిన హెల్మెట్, దుస్తులు, వినియోగించిన వాహనాలు, వాహనాలకు పెట్రోల్ వేసిన బిల్లులతో పాటు మొత్తం సమాచారం సేకరించి నిందితులను పట్టుకున్నారు. నిందితులపై కలాసీపాళ్య పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 143, 147,148,149,307 తో పాటు దేశద్రోహానికి పాల్పడే యుఏపీఏ, ఐసీసీ సెక్షన్ 120, 153ఏ, 295 సెక్షన్లు కింద అదనంగా క్రిమినల్ కేసులు నమోదు చేశామని భాస్కర్‌రావ్ పేర్కొన్నారు.