2070 నాటికి ఆ ఖండం పరిస్థితి
ఈ భూమి మీద ఏ జీవరాశికి లేని అరుదైన లక్షణం విచాక్షణ శక్తి మానవుని సొంతం. మంచికి, చెడుకు మధ్య తేడా గుర్తించడం మానవునికే సాధ్యం. ఇంత అరుదైన సామార్ధ్యం ఉన్న మనిషి మాత్రం స్వార్ధపూరితంగా తయారయ్యాడు. అతని అత్యాశకు బలవుతున్నది వాతావరణం, జీవరాశి. వీటి గురించి శాస్త్రవేత్తలు గొంతు చించుకుని చెప్తున్న మనం మాత్రం తలకెక్కించుకోవటం లేదు. ఫలితం ఎలా ఉండబోతుందో ఇప్పటికే చూస్తూనే ఉన్నాము.
ఇప్పటికే గతి తప్పిన వాతావరణం, విరుచుకుపడుతున్న ప్రకృతి విపత్తులు, నిప్పులు చెరుగుతున్న భానుడు వెరసి తీవ్ర క్షామం, ఆకలి, దరిద్రం. వీటన్నింటిని నిత్యం చూస్తున్నా మనిషిలో మార్పు రావడం లేదు. కనీసం ఇప్పటికైనా మనిషి మేలుకోకపోతే అతి త్వరలోనే మనిషి మనుగడ తుడిచిపెట్టుకుపోతుందంటున్నారు శాస్త్రవేత్తలు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఆందోళనకరంగా మారిన అంటార్కిటికా వాతావరణ పరిస్ధితులు.
భూమి మీద ఉన్న ఏడు ఖండాల్లో అంటార్కిటికాకు ప్రత్యేక స్థానం ఉంది. నిత్యం మంచుతో కప్పబడి మానవ నివాసానికి అనుకూలంగా లేని వాతవారణంతో పాటు.. అరుదైన జీవరాశికి ఆవాసంగా ఉన్న ప్రాంతం ఇది. అలాంటిది ఇప్పుడు ఈ ఖండంలోని మంచు ఆందోళనకర రీతిలో కరిగిపోతుంది. కేవలం 1992 నుంచి 2017 మధ్య కాలంలో దాదాపు 3 ట్రిలియన్ టన్నుల మంచు కరిగిందని సాటిలైట్ పరిశీలనలో తెలింది. దక్షణ అంటర్కిటికా ప్రాంతంలో ఈ పరిస్థితులు మరింత దిగజారుతున్నాయంటున్నారు శాస్త్రవేత్తల. గడిచిన శతాబ్ద కాలంలో మంచు మూడు రెట్ల అధికంగా కరుగుతూ ఏకంగా ఏడాదికి 159 బిలియన్ టన్నులకు చేరుకున్నట్లు అంచనా వేశారు శాస్త్రవేత్తలు.
మంచే కదా.. కరగుండా ఉంటుందనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే మంచు కరిగి నీరుగా మారుతుంది. ఆ నీరు సముద్రాలలో కలుస్తుంది. ఫలితంగా సముద్రాల నీటి మట్టం పెరుగుతుంది. గత పాతికేళ్ల నుంచి అంటార్కిటికాలో మంచు కరగడం వల్ల సముద్ర జలాల స్థాయి దాదాపు 8 మిల్లి మీటర్లు పెరిగింది. ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే 2070నాటికి అంటార్కిటికా పరిస్థితి ఏంటి..? అంటార్కిటికాలో కలిగే మార్పులు.. ప్రపంచపై ఉండే ప్రభావం వంటి అంశాల గురించి పరిశోధించిన శాస్త్రవేత్తలు ఆందోళనకర వాస్తవాలను వెల్లడించారు. ఈ అంశాల గురించి ప్రముఖ బ్రిటీష్ జర్నల్ ‘నేచర్’లో వెల్లడించారు. అంతేకాక ప్రంపంచ ముందు రెండు పరిష్కారాలను కూడా ఉంచారు.
వీటిలో ఒకటి గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను పట్టించుకోకుండా, మన స్వార్ధ పూరిత చర్యలతో ప్రకృతిని మరింత నాశనం చేయడమా లేక ఇప్పటికైన మేల్కొని గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను తగ్గించి, పర్యావరణాన్ని కాపడడమా. ఈ రెండింటిలో మనిషి ఎంచుకునే దాని మీదనే అంటార్కిటిక భవిష్యత్తు ఆధారపడి ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.
అంటర్కిటికాయే ఎందుకు...
భూమి మీద ఎక్కడ ఎలాంటి మార్పులు జరిగిన వాటి ఫలతం మిగితా ప్రాంతాల్లో అంత త్వరగా కనిపించే అవకాశం ఉండదు. కానీ అంటార్కిటికా, దక్షిణ సముద్రంలో వచ్చే మార్పులు మాత్రం మానవాళి మీద చాలా త్వరగా ప్రభావం చూపుతాయంటున్నారు శాస్త్రవేత్తలు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పాటు అధిక మొత్తంలో విడుదలవుతున్న కార్బన్ డయాక్సైడ్ వల్ల సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడమే కాకుండా, మంచు శకలాలు కూడా త్వరగా కరుగుతాయి. ఫలితంగా ఇంతకాలం సముద్ర పర్యావరణ వ్యవస్థను కాపాడుతున్న దక్షిణ సముద్రం అతి త్వరలోనే విపత్కర పరిస్థితులును ఎదుర్కొనున్నట్లు ఆందోళన చెందుతున్నారు శాస్త్రవేత్తలు.
తక్షణ కర్తవ్యం...
భూమి మీద ముఖ్యమైన అంటార్కిటికా, దక్షిణ సముద్రాల పర్యవేక్షణ బాధ్యతలను ‘అంటార్కిటికా ట్రీటి సిస్టం’ పర్యవేక్షిస్తుంది. ఇన్నాళ్లు అంటార్కిటికా బాధ్యతలను కాపాడిన ఈ సంస్థకు మారుతున్న పర్యావరణ పరిస్ధితుల నుంచి అంటార్కిటకాను కాపాడటం పెద్ద సవాలుగా మారింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మంచు తిరోగమనం వల్ల సముద్ర జలాల ఆమ్లీకరణ పెరుగుతుంది. ఫలితంగా మహాసముద్రాల పర్యావరణ వ్యవస్థ దెబ్బ తింటుంది.
కాబట్టి ఎంత త్వరగా వీలైత అంత త్వరగా గ్రీన్ హౌస్ వాయువులను నియంత్రించడంతో పాటు పర్యావరణానికి హానీ చేసే మానవ కార్యకలపాలను కూడా తగ్గించుకుంటే అంటార్కిటికాను మాత్రమే కాక ప్రపంచాన్ని కూడా కాపాడిన వాళ్లం అవుతాము.