వేగంగా పెరుగుతున్న సముద్ర మట్టం!
స్టాక్‌హోం: సముద్రపు నీటిమట్టం ఆరేళ్ల క్రితం అనుకున్న దానికన్నా వేగంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ మార్పుపై అంతర్జాతీయ కమిటీ (ఐపీసీసీ) నిర్థారణకు వచ్చింది. ప్రపంచ దేశాల ప్రసిద్ధ శాస్త్రవేత్తలతో కూడిన ఐపీసీసీ భూతాపోన్నతి వల్ల వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, నివేదికలను వెలువరిస్తూ ఉంటుంది. 2100 నాటికి సముద్రపు నీటిమట్టం 18 నుంచి 59 సెంటీమీటర్ల ఎత్తును పెరిగే అవకాశం ఉందని 2007లో ఐపీసీసీ నాలుగో నివేదికలో అంచనా వేసింది. ఈ నివేదికకు నోబెల్ బహుమతి కూడా దక్కింది. అయితే, అప్పుడు అనుకున్నదానికన్నా అధికంగా 26 నుంచి 81 సెంటీమీటర్ల ఎత్తున సముద్రపు నీటి మట్టం పెరగనున్నదని, ఫలితంగా కోస్తా తీరప్రాంతాలకు ముంపు ముప్పు అనుకున్నదానికన్నా అధికంగా ఉంటుందని ఐపీసీసీ తాజాగా అంచనా వేసింది.