విమానం కోసం కొనసాగుతున్న వేట
పెర్త్: నెలరోజుల నుంచి మిస్టరీగా మారిన మలేసియా విమానం ఆచూకీ కనిపెట్టేందుకు నిరంతరాయంగా అన్వేషణ కొనసాగుతోంది. దక్షిణ హిందూ మహాసముద్రంలో విమానం బ్లాక్ బాక్స్ నుంచి ఎలెక్ట్రానిక్ పల్స్ సిగ్నల్స్ చైనా ఓడకు రావడంతో ఆ దిశగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.
పది యుద్ధ విమానాలు, రెండు జెట్లు, 13 ఓడలతో విమానం జాడ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వాతావరణం కూడా అనుకూలిస్తుండటంతో గాలింపు చర్యల్ని ముమ్మరం చేసినట్టు చైనాకు చెందిన ఓ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. పెర్త్ (ఆస్ట్రేలియా)కు వాయువ్య దిశగా రెండు వేల కిలో మీటర్ల దూరంలో వెతుకుతున్నారు. 239 ప్రయాణికులతో కూడిన మలేసియా ఎయిర్లైన్స్ ఎమ్హెచ్ 370 విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇందులో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు.