నీరు.. చెట్టు.. ఎక్కని మెట్టు!
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమం ముక్కుతూ మూల్గుతోంది. రెండు నెలలు గడిచినా లక్ష్యం చేరుకోలేకపోవడం అసలు ఉద్దేశాన్ని నీరుగారుస్తోంది. మొక్కల పెంపకంతో పాటు ప్రతి నీటి బొట్టును పొదుపు చేయాలనే ఆశయానికి ఆదిలోనే చుక్కెదురవుతోంది. అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కల పెంపకం.. జల వనరులు, పంచాయతీరాజ్ శాఖలు సంయుక్తంగా చెరువుల్లో పేరుకుపోయిన పూడికను తొలగించి సమీపంలోని రైతుల పొలాలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. పనుల తీరుతెన్నులను పరిశీలిస్తే లక్ష్యం ఎన్నటికి నెరవేరుతుందోననే అనుమానం కలుగక మానదు. వాస్తవానికి పనులు జూన్ నాటికి పూర్తి చేయాల్సి ఉండగా.. పూడిక తరలింపునకు రైతులు ఆసక్తి కనబర్చకపోవడంతో మొదటికే మోసమొచ్చినట్లయింది.
జిల్లాలో మొదటి విడత నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా 13 నియోజకవర్గాల్లోని 22 చెరువుల్లో పూడికతీతకు అనుమతి లభించింది. ఇందుకోసం రూ.4.41 కోట్లు కేటాయించారు. జల వనరుల శాఖ ఆధ్వర్యంలో చేపట్టే పనులకు నేరుగా ప్రభుత్వమే నిధులు సమకూరుస్తుండగా.. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోని పనులకు ఉపాధిహామీ నిధులను డ్వామా కేటాయిస్తోంది. జలవనరులు శాఖ ఆధ్వర్యంలో చేపట్టే పనులకు జేసీబీలు, పొక్లెయిన్లు ఉపయోగించే వీలుండగా.. పంచాయతీరాజ్ ఆధ్వర్యంలోని పనులను ఉపాధి కూలీలతోనే చేయించాలని నిర్ణయించారు. పనులు ప్రారంభించింది మొదలు.. సిబ్బందితో పాటు పొక్లెయిన్లు, జేసీబీల కొరతతో సగం కాలం గడిచిపోయింది. ఇప్పుడిప్పుడే పనులు గాడిన పడుతున్నాయనుకుంటున్న తరుణంలో పూడికను తరలించేందుకు రైతులు ముందుకు రాకపోవడం అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒక ట్రాక్టర్ పూడిక తరలింపునకు ప్రభుత్వం రూ.200 మాత్రమే ఇస్తుండగా.. యజమానులు ఆ మొత్తానికి ట్రాక్టర్ పంపేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ కారణంగా ఆర్థిక స్థోమత కలిగిన రైతులు మాత్రమే పూడికను తరలించుకుంటున్నారు.
అ‘లక్ష్యం’: జిల్లా అధికారులు 22 చెరువుల నుంచి 17.70 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను రైతుల పొలాలకు తరలించాలని లక్ష్యంగా ఎంచుకున్నారు. ఖరీఫ్ నాటికి అంటే జూన్ మొదటి వారంలోపు పనులను పూర్తి చేయాల్సి ఉంది. అయితే రైతులపై ఆర్థిక భారం పడుతుండడంతో పూడిక తరలింపునకు రైతులు పెద్దగా ఆసక్తి కనబర్చని పరిస్థితి. ఫలితంగా ఇప్పటి వరకు 4.62 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను మాత్రమే తరలించగలిగారు. పనులు ప్రారంభమై రెండు నెలలు గడుస్తుండటం.. మరో 40 రోజులు మాత్రమే సమయం ఉండటంతో లక్ష్యం ఎన్నటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పనులకు వరుణ దేవుడు నిలువరిస్తే పరిస్థితి ఏమిటనే చర్చ జరుగుతోంది.
రెండో విడతలో 22 పనులు మంజూరు: మొదటి విడత పనులే కొనసాగుతుండగా.. రెండో విడత కింద మరో 22 చెరువుల్లో పూడిక తరలింపునకు చర్యలు చేపట్టింది. 17 చెరువుల్లో రూ.3.98 కోట్లతో పనులను చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ విజయమోహన్ పాలనా పరమైన అనుమతులు మంజూరు చేశారు. ఈ పనులను కూడా జూన్ నాటికే పూర్తి చేయాలని నిర్ణయించడంతో లక్ష్యం చేరుకోవడం అసాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ట్రిప్పుకు రూ.300 తీసుకుంటున్నారు
నా పొలానికి ట్రిప్పు పూడిక తరలించేందుకు రూ.300 తీసుకున్నారు. చెరువుకు దగ్గర్లో ఉన్నా ఇంత మొత్తం తీసుకుంటే ఎలా. ఇంకాస్త దూరం ఉండే పొలాలకు రూ.600 వరకు వసూలు చేస్తున్నారు. అందుకే చానా మంది వద్దనుకుంటున్నారు. రవాణా చార్జీలు ప్రభుత్వమే భరించాల. ట్రాక్టర్ల యజమానులకు ముందే బాడుగ చెల్లిస్తున్నాం.. ప్రభుత్వం మాకెప్పుడిస్తాదో తెలదు. - సోమన్న, హుళేబీడు
కూలి ఎంతిస్తారో చెప్పనేలేదు
ఉపాధి పనుల కింద పనులు చేయిస్తున్నారు. ఎంత కూలి ఇ స్తారో.. ఎప్పుడిస్తారు ఇప్పటికీ చెప్పనేలేదు. పనులు లేకపోవడంతో సరే చూద్దామని వచ్చినాం. ఎండలో చానా ఇబ్బం దిగా ఉంది. కష్టానికి తగిన ఫలితం ఉంటుందో లేదోనని బెంగగా ఉంది. కనీసం కూలి గురించి చెప్తేనైనా బాగుంటాది.
- మల్లేశప్ప, హుళేబీడు