స్విస్ బ్యాంకుల్లో మన సొమ్ము రూ.14 వేల కోట్లు
గతేడాదితో పోలిస్తే 40 శాతం పెరుగుదల
జ్యూరిచ్/న్యూఢిల్లీ: ప్రఖ్యాతిగాంచిన స్విట్జర్లాండ్ రహస్య బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా అణచివేత కొనసాగుతున్నప్పటికీ.. స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల నిల్వలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. గతేడాది చివర్లో ఈ బ్యాంకుల్లో భారతీయుల నగదు నిల్వలు 142 కోట్ల స్విస్ ఫ్రాంకులుగా ఉండగా.. ఇప్పుడవి 40 శాతం పెరిగి 200 కోట్ల స్విస్ ఫ్రాంకులను(దాదాపు రూ.14 వేల కోట్లు) దాటేశాయి. స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంకింగ్ సంస్థ స్విస్ నేషనల్ బ్యాంకు గురువారం ఈ వివరాలు వెల్లడించింది. కాగా, స్విస్ బ్యాంకులో ఇతర విదేశీయుల నిల్వలు భారీగా తగ్గుతున్నాయి. 2013 చివరి నాటికి ఎప్పుడూ లేనంతగా రూ. 90 లక్షల కోట్లకు విదేశీ నిల్వలు పడిపోయాయి. స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల సొమ్ముల్లో దాదాపు రూ.13 వేల కోట్లు నేరుగా భారతీయుల వ్యక్తిగత, సంస్థల ఖాతాల్లో ఉండగా.. దాదాపు రూ.462 కోట్లు ట్రస్టీల పేర్ల మీద ఉన్నాయి. భారత్ సహా పలు దేశాలు.. విదేశీ ఖాతాదారుల పేర్లు బయటపెట్టాలంటూ స్విట్జర్లాండ్‌పై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఎస్ఎన్బీ తాజా వివరాలు వెల్లడించడం గమనార్హం. అయితే ఈ జాబితాలో నల్లధనంపై ఎలాంటి సమాచారమూ లేదు.