ఇంటర్మీడియెట్ బోర్డు తెలంగాణదే!
అదీనంలోకి తీసుకునేందుకు రాష్ట్రప్రభుత్వం కసరత్తు
* సెక్షన్ 75 ప్రకారం సంస్థ ఎక్కడ ఉంటే దానికే అధికారం
* విభజన చట్టం చెబుతున్నదిదే
* ఏపీ కోరితే సేవలకు సిద్ధం
* వేరుగానే ఇంటర్ పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్డుపై అధికారం తమకే ఉంటుందని, ఈ దృష్ట్యా బోర్డును తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశలో రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 75 ప్రకారం బోర్డు తెలంగాణ ప్రభుత్వ పరిధిలోనే పని చేయాలని, ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. బోర్డును తమ ఆధీనంలోకి తీసుకుని, ఆంధ్రప్రదేశ్ కోరితే వారికి అవసరమైన సేవలు అందించాలని భావిస్తోం ది. ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో, మంత్రి జగదీశ్‌రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశం లోనూ ఇంటర్ బోర్డును తమ పరిధిలోకి తెచ్చుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
సెక్షన్ 75 ఏం చెబుతోందంటే...
‘పదో షెడ్యూలులోని సంస్థలు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్ర పరిధిలోకే వస్తాయి. అయితే పొరుగు రాష్ట్రానికి ఏడాదిపాటు ఆ సంస్థ సేవలు అందించాలి. రాష్ట్ర విభజనకు ముందు ఎలాంటి సేవలు అందాయో ఆలాంటి సేవలను కొనసాగించాలి. ఎలాంటి తేడా చూపడానికి వీల్లేదు’ అని విభజన చట్టంలో సెక్షన్ 75 చెబుతోంది.
వేర్వేరుగా పరీక్షల ఏర్పాట్లు
ఇంటర్మీడియెట్ పరీక్షలను వేర్వేరుగానే నిర్వహించేందుకు బోర్డు అధికారులు రెండు రాష్ట్రాలకు అవసరమైన ప్రశ్న, జవాబు పత్రాల పేప రు కొనుగోలు, ముద్రణకు సంబంధించిన టెం డర్లను గురువారం పిలిచారు. రెండు రాష్ట్రాలకు వేర్వేరుగానే సరఫరా చేసేలా టెండర్ నోటిఫికేషన్లో నిబంధన విధించారు. ఏపీకి, తెలంగాణకు వేర్వేరుగా ప్రశ్నపత్రాలు ఇచ్చేలా చర్యలు చేపడుతోంది. రెండు రాష్ట్రాలు కలిపి ఒకే ప్రశ్నపత్రం తో పరీక్షలు నిర్వహిస్తే మూడు సెట్లను ముద్రిం చాలని భావిస్తోంది. లేదంటే 6 సెట్లను ముద్రిం చి ఒక్కో రాష్ట్రానికి 3 సెట్లు అందజే యనుంది.
రెండు, మూడు రోజుల్లో షెడ్యూలు ఖరారు!
ప్రస్తుతం పరీక్షలు వేర్వేరుగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టగా, ప్రశ్నపత్రాలు వేర్వేరుగా ఇవ్వాలా? రెండు రాష్ట్రాల్లో ఒకే రకమైన ప్రశ్నపత్రాలను ఇవ్వాలా? అనేది తేలాల్సి ఉంది. ఇంటర్ బోర్డు పరీక్షల షెడ్యూలును సిద్ధం చేసే పనిలో పడింది. షెడ్యూళ్లను కూడా రెండు రకాలుగా సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. దీంతోపాటు నిర్ణీత తేదీల్లోగా ప్రశ్నపత్రాల వ్యవహారాన్ని తేల్చాలంటూ రెండు రాష్ట్రాలను కోరాలని బోర్డు నిర్ణయానికి వచ్చింది.