చుక్క నీరు రాక చిక్కులు
నోయిడా: సెక్టార్ -72వాసుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. ఇందుకు కారణం గత ఎనిమిది రోజులుగా నీరు రాకపోవడమే. దీంతో తమ అవసరాలను తీర్చుకునేందుకు సమీపంలోని సర్ఫాబాద్ గ్రామంలోని బోర్‌బావులపై వారు ఆధారపడుతున్నారు. కిలోమీటర్ల కొద్దీ నడిచీ నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఇదే అంశంపై సెక్టార్ 72లోని ఏ బ్లాక్‌లో నివసించే డాక ్టర్ ఆర్కే శర్మ మాట్లాడుతూ ‘గురువారం నుంచి నీరు రావడం లేదు. పండుగల సీజన్ కావడంతో ఇళ్లకు బంధువులు వచ్చిపోతున్నారు. ఇంటి పనులకు కూడా మినరల్ వాటర్‌ను కొనుగోలు చేయడం తప్ప మరో మార్గమే లేకుండాపోయింది. ఇలా ఎంతకాలం డబ్బులు వెచ్చించగలుగుతాం. నీరు, విద్యుత్ లాంటి కనీస అవసరాలు కల్పించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపైనే ఉంది’ అని అన్నారు.
ఇదే అంశంపై ఈ బ్లాక్ నివాసి త్రిపాఠి మాట్లాడుతూ ‘ప్రతిరోజూ సర్ఫాబాద్ గ్రామానికి వెళ్లి అక్కడి బోరుబావుల్లో నుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. ఇంతకుమించి మరో మార్గమే లేకుండాపోయింది. ఇదేదో ఒకటి లేదా రెండు రోజుల సమస్య కాదు. ఎనిమిది రోజుల నుంచి నానా ఇబ్బందులు పడుతున్నాం. మా అవసరాలను తీర్చుకోవడానికి నానాయాతన పడాల్సివస్తోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
పునరావృతమవుతూనే ఉంది
ఈ సమస్యపై రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్డబ్ల్యూ) ప్రధాన కార్యదర్శి ముఖేష్ భండారీ మాట్లాడుతూ ‘ఈ సమస్య పునరావృతమవుతూనే ఉంది. ఈ సెక్టార్లో ఎప్పుడూ ఏదో ఒక మరమ్మతు పని కొనసాగుతూ ఉండడమే. రెండు రోజులపాటు నేను స్నానమే చేయలేదు. చివరికి ధంతేరాస్ రోజున కూడా సర్ఫాబాద్ గ్రామానికి వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వచ్చింది’ అని వాపోయారు.
వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం
ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని నీటి విభాగం అధికారి యోగేంద్ర కస్నా హామీ ఇచ్చారు. మంగళవారంలోగా సెక్టార్ 72లకు నీరు సరఫరా అయ్యేవిధంగా చూస్తామన్నారు. పైప్లైన్లు పగిలిపోయిన కారణంగా మరమ్మతు పనులను చేపట్టామని, అందువల్లనే ఈ సమస్య తలెత్తిందని ఆయన వివరించారు.