దేశంలోనే మేటి.. కర్నూలు సీడ్
కర్నూలు (అగ్రికల్చర్): కర్నూలు.. విత్తనాల సీజన్లో దేశంలోని రైతులకు.. ముఖ్యంగా ఉత్తరాది రైతులకు గుర్తుకు వచ్చే పేరిది. దేశంలోనే పెద్ద విత్తన కేంద్రంగా ఉమ్మడి కర్నూలు జిల్లా విరాజిల్లుతోంది. ఏటా రూ.500 కోట్ల విలువ చేసే విత్తనాలు ఇక్కడి నుంచి పలు రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఖరీఫ్ సీజన్ దగ్గర పడుతుండటంతో ప్రస్తుతం విత్తన ప్రాసెసింగ్ ముమ్మరంగా సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యే విత్తనాల్లో 50 శాతం కర్నూలు జిల్లా నుంచే ఉండటం విశేషం. రాష్ట్రం నుంచి ఏటా ఇతర రాష్ట్రాలకు రూ.1000 కోట్ల విలువైన విత్తనాలు వెళ్తుండగా.. ఇందులో సగం జిల్లా నుంచే ఎగుమతి అవుతున్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, కర్ణాటక, హరియాణా, ఒడిశా, గుజరాత్ తదితర రాష్ట్రాలకు బీటీ పత్తి విత్తనాలతో పాటు మొక్కజొన్న, జొన్న, సజ్జల్లో హైబ్రిడ్ విత్తనాలు, వేరుశనగ, మినుము, పెసర, జనపనార, వరి తదితర విత్తనాలు ఎగుమతి అవుతున్నాయి.
వ్యవసాయ సీజన్ మొదలవుతుందంటే సగానికిపైగా రాష్ట్రాల అధికారులు విత్తనాల కోసం కర్నూలుకు క్యూ కడతారు. ఇప్పటికే రాజస్థాన్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, జనరల్ మేనేజర్ తదితరులు ఇక్కడికి వచ్చి మొక్కజొన్న, సజ్జ, జొన్న విత్తనాల నాణ్యత, ప్రాసెసింగ్‌ను రెండు రోజుల పాటు పరిశీలించారు. ఒక్క రాజస్థాన్‌కే దాదాపు రూ.50 కోట్ల విలువ చేసే విత్తనాలు ఎగుమతి అవుతున్నాయి. మహారాష్ట్ర విత్తన అవసరాలన్నీ కర్నూలు జిల్లా ద్వారానే తీరుతున్నాయి.
మహారాష్ట్ర ప్రభుత్వం విత్తనాభివృద్ధి సంస్థ ప్రాంతీయ కార్యాలయాన్ని కూడా కర్నూలులోనే ఏర్పాటు చేసింది. వివిధ విత్తన కంపెనీలతో విత్తనోత్పత్తి చేయిస్తూ నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షిస్తోంది. కర్నూలు నుంచి అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు జనపనార విత్తనాలు, అసోం, బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలకు హైబ్రిడ్ మొక్కజొన్న, సజ్జ విత్తనాలు ఎగుమతి అవుతున్నాయి. గుజరాత్, హరియాణాకు పత్తి, మొక్కజొన్న, వరి విత్తనాలు ఎగుమతి అవుతున్నాయి.
విత్తనోత్పత్తిలో బహుళజాతి కంపెనీలు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో దేశీయ కంపెనీలతో పాటు బహుళ జాతి సంస్థలు కూడా విత్తనోత్పత్తి చేస్తున్నాయి. నూజివీడు, గంగా–కావేరి, సింజెంటా, కావేరి, బేయర్, పయనీర్, మహికో, అంకూర్, తులసీ సీడ్ కంపెనీలు జిల్లాలో బీటీ పత్తితో సహా వివిధ విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. జాతీయస్థాయి విత్తన సంస్థలు కూడా ఇక్కడ ప్రధానా కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడం విశేషం. బహుళజాతి కంపెనీలు కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు కేంద్రాలుగా ఉన్న విత్తన కంపెనీల భాగస్వామ్యంతో విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. నంద్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాలు వరి, మొక్కజొన్న విత్తనోత్పత్తికి పెట్టింది పేరు.
రైతులకు లాభసాటి
విత్తనోత్పత్తి ద్వారా రైతులకు రెట్టింపు లాభాలు వస్తాయి. జిల్లాలో దాదాపు 10 వేల మంది రైతులు 25 వేల నుంచి 30 వేల ఎకరాల్లో విత్తనోత్పత్తి చేస్తున్నారు. ఒక్కో రైతు 2 – 4 ఎకరాల వరకు విత్తనం సాగు చేస్తున్నారు. ఉదాహరణకు మొక్కజొన్నకు మార్కెట్లో క్వింటాకు నాణ్యతను బట్టి రూ.1,600 నుంచి రూ.2,000 వరకు ధర లభిస్తోంది. అదే విత్తనమైతే క్వింటాకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు ధర లభిస్తుంది. ఉత్పాదకతను బట్టి విత్తన కంపెనీలు ధరను ఇస్తాయి.
దిగుబడి ఎక్కువగా ఉంటే ధర కొంచెం తక్కువగా, తక్కువగా ఉంటే ఎక్కువ ధర లభిస్తుంది. విత్తన కంపెనీలు యూనివర్సిటీలతో ఎంవోయూ చేసుకొని బ్రీడర్ సీడ్ తెప్పిస్తారు. ఆ సీడ్‌ను ఎంపిక చేసుకున్న కొంత మంది రైతులకు ఇచ్చి, దాని ద్వారా ఫౌండేషన్ సీడ్ ఉత్పత్తి చేయిస్తారు. తద్వారా సర్టిఫైడ్ సీడ్ ఉత్పత్తి అవుతుంది.. విత్తనోత్పత్తి ద్వారా రైతులు పండించిన పంటలకు 50 శాతం అధిక ధర లభిస్తోంది. ఏ కంపెనీ విత్తనోత్పత్తి చేయిస్తుందో.. అదే కంపెనీ రైతుల నుంచి సీడ్‌ను కొంటుంది.
ప్రభుత్వ ప్రోత్సాహం
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక విత్తనోత్పత్తిని ప్రోత్సహిస్తోంది. కర్నూలు నగరానికి సమీపంలోని ఓర్వకల్లు ఇండ్రస్టియల్ హబ్‌లో విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు, విత్తన పరిశ్రమలకు ప్రత్యేకంగా భూములు కేటాయిస్తోంది. ఇండ్రస్టియల్ హబ్‌లో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే 80 కంపెనీలు ముందుకు రావడం విశేషం. ఈ కంపెనీలకు ప్రభుత్వం పలు రాయితీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది.
విత్తనోత్పత్తి మరింత వృద్ధి చెందాలంటే..
విత్తనోత్పత్తికి జిల్లా భూములు, వాతావరణం అనుకూలం. ఇక్కడ విత్తన ధ్రువీకరణ సంస్థ కూడా ఉంది. విత్తనోత్పత్తికి ముందుకు వచ్చే రైతులకు రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. విత్తన సంస్థలు, ప్రాసెసింగ్ యూనిట్లకు కూడా పెట్టుబడి రాయితీ, సబ్సిడీ, విద్యుత్ రాయితీలు వంటివి ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. కర్నూలును పత్తి విత్తన కేంద్రంగా, నంద్యాల వరి విత్తన కేంద్రంగా, తంగెడంచ ఫారాన్ని కూరగాయల విత్తనాలు, ఇతర విత్తనాల ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ది చేయవచ్చని, దేశవాళీ విత్తనాలను మరింతగా ప్రోత్సహించాలని తెలిపారు.
దేశంలోనే సీడ్ హబ్‌గా కర్నూలు
విత్తనోత్పత్తి, విత్తన పరిశ్రమకు కర్నూలు జిల్లా దేశంలో పెట్టింది పేరు. 2000 సంవత్సరానికి ముందు దేశం మొత్తానికి అవసరమైన విత్తనాల్లో 75 శాతం ఇక్కడే ఉత్పత్తి అయ్యేవి. నాటితో పోలిస్తే నేడు విత్తనోత్పత్తి తగ్గింది. అయినప్పటికీ వివిధ రాష్ట్రాలు విత్తనాల కోసం కర్నూలు వైపు చూస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఓర్వకల్లు ఇండ్రస్టియల్ హబ్‌లో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు భూములు కేటాయించడంతో పాటు రాయితీలు ఇస్తోంది. మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
– ఎంవీ రెడ్డి, చైర్మన్, సీడ్ మెన్ అసోసియేషన్, కర్నూలు జిల్లా
దేశంలోని సగం రాష్ట్రాలకు కర్నూలు విత్తనం
ఖరీఫ్ సీజన్ దగ్గర పడుతుండటంతో వివిధ రాష్ట్రాలకు విత్తనాలు ఎగుమతి చేసేందుకు ముమ్మరంగా ప్రాసెసింగ్ జరుగుతోంది. విత్తనోత్పత్తికి జిల్లాలోని భూములు చాల అనుకూలమైనవి. బహుళజాతి కంపెనీలు కూడ ఇక్కడ విత్తనోత్పత్తి చేస్తున్నాయి. విత్తనోత్పత్తి రైతులకు లాభసాటిగా ఉంటోంది. – మురళీధర్‌రెడ్డి, చైర్మన్, తెలుగు రాష్ట్రాల సీడ్ మెన్ అసోషియేషన్