సమ్మె విరమించం: సీమాంధ్ర ఉద్యోగుల సంఘాలు
సీఎంకు తేల్చిచెప్పిన ఉద్యోగ సంఘాలు.. చర్చలు విఫలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు నిరసనగా, సమైక్యాంధ్ర కోసం సమ్మె బాట పట్టిన ఉద్యోగ సంఘాలతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమై సమ్మెవల్ల రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజ లు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారని, వెంటనే విధుల్లో చేరాలని కోరారు. సీఎం అభ్యర్థనను ఉద్యోగ సంఘాల నేత లు తోసిపుచ్చారు. ఉద్యోగుల సమస్యలు, విభజనానంతర పరిణామాలను సీఎంకు వివరించిన వారు... అంతిమంగా రాష్ట్ర విభజనను నిలుపుదల చేస్తున్నట్లు కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వస్తేనే సమ్మె విరమించడం సాధ్యమవుతుందని తేల్చిచెప్పారు. తాను సీఎంగా ఉన్నంతకాలం రాష్ట్ర విభజన జరగదని, అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించి తద్వా రా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తానని ఉద్యోగులకు నచ్చజెప్పారు. తుపాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు వచ్చే ప్రమాదమున్నందున సమ్మె విరమించి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.
సమైక్యంకోసం సీఎంగా ఏ చర్యలు తీసుకుంటున్నారు
ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఆనం రామనారాయణరెడ్డి, పితాని సత్యనారాయణ, కొండ్రు మురళి, రఘువీరారెడ్డి కూడా ఉద్యోగ సంఘాలతో సీఎం జరిపిన చర్చల్లో పాలుపంచుకున్నారు. సమావేశంలో ఉద్యోగులు సంఘాల వారీగా సీఎంకు సమస్యలను వివరిస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం తప్ప సమస్యల పరిష్కారానికి మరో మార్గం లేదని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రాష్ట్ర సమైక్యతపై స్పష్టమైన హామీ వస్తే తప్ప సమ్మె విరమించబోమని తేల్చిచెప్పారు. సీమాం ధ్ర ప్రజల ఆకాంక్షల మేరకే తాము సమ్మె చేస్తున్నామన్నారు. తమ సమ్మె విరమణ కంటే ముందు రాష్ట్ర సమైక్యత కోసం కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని ప్రజలు కోరుతున్నారని తెలిపారు. దీనికి జవాబొస్తేనే సమ్మె విరమణపై ఆలోచిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కలిపి ఉంచేందుకు సీఎంగా మీరు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని కిరణ్‌ను కోరారు. ఆయన స్పందిస్తూ... అధికార పార్టీగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నామని, కాంగ్రెస్ అధిష్టానంపై కూడా వీలైనంత మేర ఒత్తిడి తెస్తున్నామని వివరించారు.
సమైక్య రాష్ట్రంలోనే పీఆర్సీ: సీఎం
తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన అంశం రాష్ట్ర శాసనసభ్యుల అభిప్రాయం కోరుతూ ఒకసారి, తీర్మానం రూపంలో మరోసారి అసెంబ్లీకి వస్తుందని దిగ్విజయ్‌సింగ్ తనమాటగా ఉద్యోగులతో చెప్పమన్నట్లు ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ తీర్మానం అసెంబ్లీకి రావడం ఖరారైందని భావిస్తున్నామని, అదే జరిగితే అసెం బ్లీలో తీర్మానాన్ని ఓడించి తీరుతామని ఉద్యోగులతో సీఎం పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం విభజన జరిగే ప్రశ్నే లేదని హామీ ఇచ్చారు. అహింసా మార్గంలో ఇంతకాలం ఉద్యమం కొనసాగించినందుకు సీఎం వారిని అభినందించారు.
ఒకటి రెండు రోజులు సమయం తీసుకుని సమ్మె విరమణపై భాగస్వామ్య ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయం ప్రకటించాలని కోరారు. సమైక్య రాష్ట్రంలోనే పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. సీఎం సూచనలపై ఉద్యోగులు స్పందిస్తూ... సీఎంగా మీ మాటల్ని గౌరవిస్తామని, అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే దిశగా స్పష్టమైన హామీ వచ్చేవరకూ సమ్మె విరమించడం సాధ్యం కాదని బదులిచ్చారు. తుపాను,వరదలొస్తే సమ్మెలో కొనసాగుతూనే ప్రజలకు అండగా నిలిచి సహాయ పునరావాస చర్యల్లో పాలుపంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని హామీఇచ్చారు.
గతంలోనూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. కేబినెట్ నోట్లో ‘371 డి’ అధికరణ ప్రస్తావన ఉందని, దానిగురించి ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టత లేదని, ఈ అంశంపై కేంద్ర పెద్దలతో మాట్లాడి మరిం త సమాచారాన్ని తమకు విపులంగా ఇవ్వాలని సీఎంను ఉద్యోగులు కోరారు. ‘371 డి’ ఏ రాష్ట్రంలోనూ లేదని, ఆ అంశంపై హోంశాఖ అనుసరించే విధివిధానాలను కేంద్రాన్ని అడిగి తెలుసుకోవాలన్నారు. ‘371 డి’ ఆర్టికల్ తొలగింపు వల్ల ఉద్యోగుల సీనియారిటీ, జోనల్ వ్యవస్థ రద్దు తదితర సమస్యలు వస్తాయని, వాటిని పరిష్కరించడం సాధ్యమయ్యే పని కాదని వివరించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రజా రవాణాను ఒక విభాగంగా నడిపించాలంటూ ఆర్టీసీ సంఘాలు ముఖ్యమంత్రికి వినతిపత్రాలు ఇచ్చాయి.
సీఎంతో 29 సంఘాల చర్చలు: ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం చైర్మన్ మురళీకృష్ణ, కార్యదర్శి కె. వి కృష్ణయ్య, ఆర్టీసీ ఈయూ సమైక్యాంధ్ర పోరాట కమిటీ చైర్మన్ సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, కన్వీనర్ దామోదరరావు, ఎన్ఎంయూ సమైక్యాంధ్ర స్టీరింగ్ కమిటీ నాయకులు ప్రసాదరావు, రమణారెడ్డి, మోహన్, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోషియేషన్ అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు, ట్రెజరీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ జి.రవికుమార్, మున్సిపాలిటీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కృష్ణమోహన్, వర్మ, డ్రైవర్ల సంఘాల నాయకులు శ్రీరాములు, రాయుడు అప్పారావు, గెజిటెడ్ అధికారుల సంఘం నేత మణికుమార్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు బాబూరావు, సహకార శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఫణి పేర్రాజు, వీఆర్వోల సంఘం నేత భక్తవత్సలనాయుడు, సమైక్యాంధ్ర టీచర్ల జేఏసీ నేత కమలాకరరావు, వైఎస్సార్‌టీచర్స్ ఫెడరేషన్ కన్వీనర్ ఓబుళపతి.. మొత్తం 29 సంఘాల ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు.
విరమించబోమని తేల్చిచెప్పాం
ముఖ్యమంత్రితో మేం జరిపిన చర్చలు విఫలమయ్యాయో, సఫలమయ్యాయో చెప్పలేం. చర్చలు వాయిదా పడ్డాయి. రాష్ట్ర సమైక్యతపై సీఎం నుంచి నిర్దిష్ట హామీ రానందున సమ్మె విరమించలేమని స్పష్టం చేశాం. సమ్మెలో ఉన్న అన్ని సంఘాలతో చర్చించి నిర్ణయం చెప్పాలని సీఎం కోరారు. ఈనెల 11వతేదీ లేదా 12న జేఏసీ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం ప్రకటిస్తాం.
- అశోక్‌బాబు(ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు)
ఒకటి రెండు రోజుల్లో చెబుతాం
తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం విభజన జరగబోదని, అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడిస్తామని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. అయితే రాష్ట్రం సమైక్యంగానే కొనసాగుతుందని మాకు స్పష్టమైన హామీ రానందున సమ్మె విరమించలేం. ఒకటి రెండు రోజుల్లో ఫోరం సర్వసభ్య సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలపై చర్చిస్తాం. అనంతరం మా నిర్ణయాన్ని మంత్రివర్గ ఉపసంఘానికి తెలియజేస్తాం.
- మురళీకృష్ణ(సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల
ఫోరం కన్వీనర్)
ముందుగానే సమైక్య తీర్మానం చేస్తే విభజన ఆగుతుంది
తెలంగాణ ఏర్పాటు తీర్మానం శాసనసభకు వచ్చినప్పుడు ఓడించడం కాకుండా, అంతకంటే ముందే శాసనసభను సమావేశపరచి సమైక్య తీర్మానం చేయాలని మేం చేసిన డిమాండ్‌పై ముఖ్యమంత్రి స్పందించలేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అసెంబ్లీలో ముందుగానే తీర్మానం చేస్తే విభజన ప్రక్రియ నిలిచిపోతుంది.
- ఓబుళపతి (వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ కన్వీనర్)