సీతయ్య
మధ్యాన్నమయింది. పొద్దున ముసలమ్మ దగ్గిర నుంచి అడుక్కున్న కానీతో రంగు చూసి మోసపోయి ఆ చక్కెర బిళ్ళలు కొనకపోతే, గుగ్గిళ్ళు కొని తింటే ఇప్పుడింత ఆకలి వెయ్యదుకదా అని పశ్చాత్తాపపడ్డాడు సీతయ్య. మధ్యానం టిఫెన్ కొరకై మామూలు స్థలాలు వెతికాడు. కోమటిరత్నం ఇంటిముందు పుల్లిస్తరాకులు కుక్కలు చప్పగా నాకేశాయి. ఏమీ ఆశలేదు. ఈవాళ దోసకాయలేమీ కుళ్ళినట్లులేవు. దుకాణం దగ్గిర ఒక మేకయినా లేదు. మిఠాయికొట్టు దగ్గిర వచ్చిపోయ్యేవాళ్ళని కనిపెడుతూ ఓ కుక్కపిల్ల కానీ కారప్పూస కొనుక్కున్న కోమటిపిల్ల కాళ్ల చుట్టూ తిరిగింది. పరికిణీ పట్టుకులాగింది. వెంటపరుగెత్తికెళ్ళింది. ఆ కోమటిపిల్ల తంతే దూరానపడి, మళ్ళీ తోకాడించుకుంటూ వెంట పరుగెత్తింది. సందు ములుపులో ఇద్దరూ అదృశ్యమైనారు. ఇదంతా చూశాడు సీతయ్య. తానో కుక్కపిల్లనైనా బాగుండును ఎవరో ఒకరు దయదలచి వుందురు తన మీద. కుయ్యిమని యేడిస్తే తన ఆకలి అబద్ధమనుకోరు. తన మకిలి లాగు పైకి లాక్కుని పట్టుకున్నాడు. బనియను చిల్లుల్లో వేళ్లు పెట్టుకొని రాజకుమారుడి ఠీవితో చూశాడు రోడ్డు వంక.
తాను కుక్కనై యే ధనవంతుడి వెంటనో వాడి ఇల్లు చేరుకుంటే వాడు తనని పెంచుకుంటే? ఎవడు పెంచుకుంటాడు? పోనీ తనే ఎవణ్ణో తండ్రిగా పెంచుకుంటే నేం? బస్సు డ్రైవరు ప్రకాశి, తోటి డ్రైవర్లిద్దరూ, కండక్టరు కోటయ్య వెడుతున్నారు. కాఫీ హోటల్ నుంచి, బస్సుస్టాండ్ దగ్గరికి. సీతయ్య వాళ్ళ వెనకనే వెళ్ళి, ప్రకాసి చొక్కా పట్టుకులాగాడు. అతను వెనక్కి తిరిగి, ‘‘ఏం కావాలిరా?’’‘‘నీ కోసమే నాన్నా’’
అందరూ తిరిగి చూశారు. ‘‘నేను కాదురా, మీ నాన్న–బాగా చూడు’’‘‘కాదు. వెళ్ళు, వెళ్ళు’’ అని జేబులోంచి కాని తీసి యిచ్చాడు దయతలచి. అది తీసుకొని వెంటనడిచాడు సీతయ్య, యుముడి వెనకసావిత్రిలాగు.‘‘కానీ యిచ్చానుగా పో’’‘‘ఇప్పుడెక్కడున్నావు నాన్నా’’తక్కిన డ్రైవర్లు అర్థయుక్తంగా కనుగీటులతో ఒకరి మొహాలు ఒకరు చూసి నవ్వుకుంటున్నారు.‘‘నా వెంట రాకు. పో. యేం? తెలుస్తుందా నే చెప్పేది?’’‘‘సరే నాన్నా!’’‘‘నన్ను నాన్నా అనకు’’‘‘ఎందుకు?’’ప్రకాశి స్నేహితులు నవ్వుతో వొంగిపోతున్నారు.‘‘పోతావా? తన్నులు కావాలా?’’‘‘ఎక్కడికి పోను?’’ అన్నాడు చాలా జాలిగా!‘‘ఇంటికి పో’’‘‘ఇంటికే వస్తున్నా మరి’’‘‘వీణ్ణి తప్పించుకొని పారిపో. అది అన్యాయమైన పనేగాని, యేం చేస్తావు మరి!’’ అన్నాడు కండక్టరు కోటయ్య. ‘‘అన్యాయమేమిటి? అన్యాయమంటే యేమిటి నీ ఉద్దేశ్యం?’’ అన్నాడు ప్రకాసి కోపంగా.‘‘నీకే తెలియాలి, పాపం! నాకేం తెలుసు? మరి చేసినపనికి అనుభవించవద్దూ?’’‘‘ఎన్నాళ్ల కిందట చూశావు మీ నాన్నని?’’ అని అడిగాడు ఒక డ్రైవరు.‘‘నాకు జ్ఞాపకంలేదు. చాలా నెలలయింది’’‘‘అప్పటికి యిప్పటికీ మారాడా, మీ నాన్న?’’‘‘ఒక్కరవ్వ మారలేదు’’‘‘ఒరే నువ్వు పోతావా పోవా?’’ అన్నాడు పళ్ళు కొరుకుతో ప్రకాశి–అని త్వరత్వరగా నడిచాడుఎదురుగా చూస్తూ. ‘‘ఇంకా వస్తున్నాడు’’ అన్నాడు డ్రైవరు. ‘‘చాలా పట్టు వుందిరోయి వీడికి!’’ అన్నాడు కోటయ్య.‘‘వాళ్ళ అమ్మపోలిక అయి వుంటుంది’’ అన్నాడు యింకోడు.
ప్రకాశి మాట్లాడకుండా నడిచాడు దబదబా బస్సు దగ్గరకి. తన సీటులో ఎక్కి ఒకసారి తిరిగి చూశాడు. ఎన్నడూ లేనిది త్వరగా ‘స్టార్టు’ చెయ్యాలని చూస్తున్నాడు. సీతయ్య వెనక చక్రాన్ని ఆనుకు నుంచున్నాడు. ఆ మోటరు సొంతదారుఆంజనేయులుగారు కుర్రాణ్ణి చూశారు. ‘‘ఏం కావాలి, నీకు?’’ అన్నాడు.‘‘మా నాన్న కావాలి’’‘‘ఎవరు మీ నాన్న’’‘‘డ్రైవరు ప్రకాశం’’‘‘ఏమోయ్ ప్రకాశీ ఇట్టరా’’రాలేదు.‘‘మీ అబ్బాయి వచ్చాడోయ్, నీకోసం’’‘‘మా అబ్బాయి కాదండి’’‘‘కాదూ ఇక్కడ వుంటేనే. వొచ్చిచూడు’’విధిలేక వచ్చాడు. నవ్వుతున్న కోటయ్యని కాల్చేట్టు చూసి, అటు తిరిగాడు. ‘‘పాపం ఎట్లావున్నాడో చూడు? నీ పిల్లల్ని యిట్లా వుపేక్ష చేయ్యడం ఏమీ బాగాలేదు’’‘‘నాకేం సంబంధం వీడి మొహం నేనెరుగను’’‘‘మీ నాన్న అట్లా అంటున్నాడేం, అబ్బాయి. నువ్వుండు ప్రకాశి–మీ అమ్మ ఎక్కడ వుంది?’’‘‘చచ్చిపోయిందండి. నాన్న తప్ప నా కెవరూ లేరు’’ఆంజనేయులుగారి మనసు కరిగిపోయింది. ‘‘మీ నాన్నతో బెజవాడ వస్తావా?’’ సీతయ్య మొహం వికసించింది. ‘‘కోటయ్యా, ఈ కుర్రాణ్ణెక్కించు. మనవాడు, టిక్కెట్టు, గిక్కెట్టు అక్కర్లేదు. మన ప్రకాశి కొడుకయ్యెను’’‘‘మన వాడేమిటి నాకేం తెలవదంటాడోయ్’’‘‘ఎందుకులే, నేనేం అడగనంటూ వుంటే? ఎవరో అంతర బొంతర వాళ్ళని వూరికే ఎక్కిస్తే కోపమొస్తుందిగాని సొంత కొడుకైనప్పుడు నేనేమంటాను? పాపం–ఆకలిగా వున్నట్టుంది ఏమన్నా కొనిపెట్టు. నీ దగ్గిర డబ్బులు లేవు గావును. ఇదిగో అబ్బాయి, పావలా–కాఫీ హోటల్కుపో–తరువాత ఇద్దురుగానిలే ప్రకాశీ’’కుర్రాడు పావలా తీసుకొని ‘‘నేను వచ్చిందాకా పోకండి’’ అని హోటలు వేపుకు దూకాడు.
‘‘ఈ బస్సులవాళ్ళు–వీళ్ళకి ప్రతివూళ్ళో ఒక భార్య’’ ‘‘ఈయన్ది బెజవాడగా’’ ‘‘ఐతేనేం, ఈ వూళ్ళో ఒక భార్య వుంటుంది’’ ‘‘తన కొడుకునే మరచిపోయినాడు?’’ ‘‘బలేవాడు’’ ‘‘మొహాన అట్టా పోలిక కనబడుతుంటే–పైగా బూకరిస్తాడేమిటి?’’ ‘‘తల్లి పనికొచ్చిందిగాని, పిల్ల పనికి రాలేదు’’కుర్రాడు వొచ్చాడు, పొట్టా, జేబులూ నింపుకుని. ప్రతివాళ్ళూ చోటిచ్చి రమ్మనే వాళ్ళే! బస్సు బయలుదేరింది. కొంచెం సేపట్లో ఆంజనేయులు కేకలు వేస్తున్నాడు. ‘‘ఇదిగో. ప్రకాశం. యేమిటి ‘నీ కుర్రాడు–అరే, కిందపడేట్టున్నాడు–వీడికి భయభక్తులులేవే! ఆ మూట కింద తోశాడు. ఆపు–ఆపు’’‘‘ఇంత అల్లరి యెట్లా నేర్పావయ్యా! మా అందరికీ పిల్లులు లేరూ?’’ అన్నాడు ఒకాయన. ‘‘నేనా!’’ అన్నాడు చివరికి ప్రకాశి. ‘‘మొత్తానికి నీ గుణాలే–ఒక్కటొక్కటే బైటికొస్తున్నాయి. చిన్నప్పుడు మనంచదువుకునేప్పుడునువ్వింతే!’’ అన్నాడు కోటయ్య.‘‘అట్లాచూస్తో నుంచుంటావేం? నీ కుర్రాణ్ణి సద్దుకో మా ప్రాణాలు తీస్తున్నాడు’’ అన్నాడు ఇంకో పెద్ద మనిషి. ఏ లోకంలో వున్నాడో కలో మాయో నిశ్చయించుకోలేని చూపుపెట్టి చక్రం ముందు కూచున్నాడు ప్రకాశి, మధ్య ఊళ్ళో బస్సాగింది. మళ్ళీ కాఫీ హోటల్లోకి అందరూ ప్రవేశించారు.‘‘నాన్నా! ఆకలిగా వుంది’’ అని ప్రకాశి వెంట బైల్దేరాడు కుర్రాడు. ‘‘పోరా వెధవా’’ అని తప్పించుకుని గుంపులో ప్రవేశించాడు ప్రకాశి. బస్సు బయలుదేరాలి, డ్రైవరు లేడు. పిలిచారు. వెతికారు. గంటసేపు చూశారు. కనబడలేదు. ‘‘నాన్నా! నాన్నా’’ అంటూ యేడుస్తున్నాడు కుర్రాడు. కోటయ్య మోటరు నడపవలసి వచ్చింది. ‘‘మరి ఈ కుర్రాణ్ణి యేం చేద్దాం?’’ అన్నాడు కోటయ్య. ప్రకాశి యెంత రౌడీ ఐనా ఇంత నిలబడలేని టక్కరివాడనుకోలేదు. తన సొంత కుర్రాణ్ణి ఇట్లా నడివడిలో వొదిలిపోయినాడే! మరీ ఇంత ఘాతుకుడనుకోలేదు’’ అన్నాడు ఆంజనేయులు. ‘‘కుర్రాడు. యేం చేస్తాం? బెజవాడలో ప్రకాశి దగ్గిర వదలి పెడదాం’’
‘‘వాడిల్లు నాకు సరిగా తెలీదు’’ అన్నాడు కోటయ్య. ‘‘ఏం చేస్తావు సీతయ్యా!’’‘‘ఏం చెయ్యను?’’ అని బాధత్య వాడికే వదిలివేశాడు. కొంచెం యేడుపు మాని జాలి పుట్టించేట్టు అందరి మొహాలు చూసి, ముడుచుకొని ముసిలమ్మ వొళ్ళో తలపెట్టుకొని నిద్రపోయాడు. ఒక అరగంటలో నిద్రపోయి లేచి ప్రక్కనున్న రెడ్డిగారి బోదకాలు తొక్కి, సీటు నుంచి సీటుకి గంతులు వేస్తున్నాడు. బెజవాడ చేరారు. ఒక్కొక్కళ్ళె దిగిపోతున్నారు. దిగిపోయే వాళ్ళందర్ని ‘‘మీ ఇల్లెక్కడ!’’ అని అమాయకంగా ముద్దొచ్చేట్టు అడుగుతున్నాడు కుర్రాడు. ‘‘మరి కుర్రాడో’’ అన్నాడు కోటయ్య.‘‘ఏంచేస్తాం? రాత్రి ఇక్కడ పడుకొని, రేపు మళ్ళీ ఆ వూరే తీసుకుపోయి దిగపెడదాం’’ అన్నాడు కనికరంగల ఆంజనేయులు. కోటయ్యా, ఆంజనేయులూ, బజారువీధి నుంచి నగరప్పేటవేపు పోతున్నారు. తెలిసినవాణ్ణి పిలవడానికని కోటయ్య వెనక్కు తిరిగిచూసి ‘అరే’ అన్నాడు. కొంచెం దూరంలో నెమ్మదిగా బెజవాడ పురజనుల ఔదార్యమూ, పట్టణ సౌందర్యమూ తీరుబడిగా తిలకిస్తో సీతయ్య వొస్తున్నాడు. ఆంజనేయులు, కోటయ్యా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. తన మీద వాళ్ళు తీసుకుంటున్న శ్రద్ధను గమనించి, వాడు–‘‘నాన్నా!’’ అన్నాడు. ‘‘నిన్ను పెంచుకున్నాడోయి, కోటయ్య’’ అన్నాడు ఆంజనేయులు.‘‘మిమ్మల్ని’’ అన్నాడు కోటయ్య. అప్పుడు ఇద్దరు ముగ్గురు రోడ్డు మీద ఆగి చూస్తున్నారు. కోటయ్య, ఆంజనేయులు త్వరత్వరగా నడిచారు. ‘‘నాన్నా, ఆగు త్వరగా వెడుతున్నావు’’ అని అన్నాడు సీతయ్య.‘‘నేనా సందుకు పోతాను. పనివుంది’’ అన్నాడు కోటయ్య.‘‘అరే, ఆ కుర్రాణ్ణి ఏం చేసుకోమంటావు? పొమ్మని కేకెయ్యి’’‘‘మీ కోసం వొస్తున్నాడు. ఎవరి కోసం సీతయ్యా’’ అన్నాడు దయగా.‘‘నాన్న కావాలి’’ అని ఆంజనేయుల్ని చూపించాడు. ‘‘ఎవరు కావాలి?’’ అన్నాడు భయంగా ఆంజనేయులు.‘‘నువ్వే నాన్నా’’ఆంజనేయులు త్వరత్వరగా వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడు ఇంటికి.‘‘ఏం లేదు. లోపలికి పద’’‘‘ఆ కుర్రాడెవడు?’’‘‘పాపం, ఎవరో వెర్రికుర్రాడు, మా బస్సు ఎక్కాడు’’‘‘నేను వెర్రివాణ్ణా, నాన్నా! కాను’’‘‘పాపం పిచ్చివాడికి. ప్రకాశి కొడుకునన్నాడు పాపం’’‘‘కాదు. నువ్వు నానాన్న’’‘‘అంతేలే, కనబడ్డ ప్రతీవాణ్ణీ నాన్న నాన్న అంటాడ, అదీ వాడి పిచ్చి. కొంతసేపు కోటయ్యని నాన్నా అన్నాడు’’‘‘లేదు. నన్ననలేదు’’‘‘తరువాత ఈ శేషయ్యగార్ని నాన్న అన్నాడు...మిమ్మల్ని కాదేమిటి? ఆ శెట్టిగారిని’’‘‘గావును’’‘‘సరేలెండి. ప్రకాశిని అన్నాడా లేదా?’’‘‘ప్రకాశి ఏడి ఐతే?’’ అంది కాంతమ్మ. ‘‘వాడు పారిపోయినాడు’’
‘‘ఆహా, తెలుస్తోంది. ఈ పెద్దమనుష్యులందరూ వీడు ప్రకాశి కొడుకని నాతో చెప్పడానికి వొచ్చారా?’’‘‘అవును’’ అన్నారు అందరూ. కాంతమ్మ రోడ్డువంక చూసింది. కన్నీళ్లతో, గద్గద స్వరంతో, ‘‘ఎంతపని చేశారండీ’’ అంది. ‘‘నేనేమీ యెరగను. కోటయ్యని అడుగు’’‘‘అడగడమెందుకులెండి? మీ కండక్టరేమంటాడు, అంతకంటే?’’‘‘ఈ పెద్దమనుష్యులు చూడలేదూ? వాళ్లనడుగు ఈ కుర్రాడెవరి కోసం వచ్చాడో అసలు’’‘‘వాళ్ళు మాత్రం మీ స్నేహితులు కారూ? ఎందుకులెండి. ఎంత అన్యాయం చేశారండి నన్ను! ఎంత నమ్మాను!’’‘‘ఏంరా! వెధవా, పాపం ఆంజనేయులుగారు నిన్ను అంత దయతో చూసినందుకుఆయనకీ కుంపటి తెచ్చిపెట్టావా?’’ అన్నాడు శేషయ్య. ‘‘దయగా చూశారా?’’ అంది కాంతమ్మ మండిపడుతూ.‘‘సొంత కొడుకు కాదు. మేనల్లుడిమల్లె చూసుకున్నాడు. ఎవర్నీలేంది వీణ్ణి టికట్టులేకుండా బస్సులో ఎక్కించాడు. ఫలహారం పెట్టించాడు. మా అందరికీ ఆశ్చర్యం వేసింది. ఆయన చూపే ప్రేమ చూసేటప్పటికి’’ఇంత గొప్పగా పొగుడుతున్నా ఆంజనేయులు మొహంమాత్రంమండిపోతుంది. కాంతమ్మ ఇంక భరించలేక చప్పున ఇంట్లోకిపోయి తలుపేసుకుంది. గుంపులో మనుషులంతా ఒకరొకరే జారిపోయినారు. అందరూ పోగానే ఆంజనేయులు ఇంట్లోకి వెళ్ళాడు.ఏడుస్తో కాంతమ్మ పక్కమీద పడుకుంది‘‘ఒసే–మాట’’ ‘‘నాతో మాట్లాడకండి. నా మొహం చూడ్డానికి సిగ్గులేదూ’’‘నా మాట విని ముందు...’’ ‘‘నే ననుకుంటూనే వున్నా, యేదో ఇట్టాంటిది రహస్యంగా జరుగుతుందని–బస్సు అనేది, రాత్రులంతా యెక్కడో వుండిపొయ్యేదీ, ఆ డబ్బు అంతా యేమవుతుంది? మొన్న లైసెన్సుకి అడ్డిగ అమ్ముతానని తీసుకెళ్ళారే? ఇదా సంగతి! యెంతమోసంచేశారండీ? ఎప్పుడూ దిగులుగా కూచోడం–అదీ–తెలిసిపోతుంది–అంతా తెలిసింది’’‘‘విను–ముందు’’ ‘‘వినడమే! ఏమిటి వినడం? ఎందుకు వినడం–మీ అబద్ధాలన్నీ! ఇంకా మోసపోతానా? నేనూరుకోను. చూడండి...ఏం చేస్తానో! ఇంతటితో మీకు నాకు సరి’’‘‘విను–కుర్రాడు ప్రతివాణ్ణి అంటాడు నాన్నా అని, ఈపాటికి ఇంకెవణ్ణో పట్టుకుని వుంటాడు’’‘‘నే నూరుకోను–ఇది వూరంతా’’ అటూ వుండగానే, మెల్లిగా తలుపు తెరుచుకొని మొహం లోపలికి పెట్టి చూస్తున్నాడు సీతయ్య. మండిపడుతో కాంతమ్మ వాడి వేపు చూసింది. ఎవరూ మాట్లాడలేదూ రెండు నిమిషాలు. ‘‘అమ్మా’’ అన్నాడు. తలఎత్తి చూసింది. నిర్ఘాంతపోయి కుర్రాడి మొహం చూస్తో పడుకుంది. తలుపు ఇంకొంచెం తెరుచుకొని లోపలికి వచ్చాడు. ఆంజనేయులు భార్య వైపు చూశాడు. నవ్వాపుకోలేక కిటికీ వైపు తిరిగాడు.‘‘అమ్మా యేం అట్లా పడుకున్నావు?’’‘‘ఎంత పనిచేశావే! నన్ను ఇంత మోసం చేశావనుకోలేదు’’‘‘పోండి. వేళాకోళం చేస్తారు!’’‘‘సందేహం లేదు–పోలిక కనపట్టం లేదనుకున్నావా? పగలంతా లైను మీద చస్తాను. ఇంటి దగ్గర నువు చేసే పని ఇదా? యెప్పుడు కన్నావే వీణ్ణి?’’ అంటో నవ్వాపుకోలేక కిటికీకేసి తిరిగాడు. కాంతమ్మ లేచి అతని మెడ గట్టిగా పట్టుకుంది. ‘‘అంటారు! నన్నట్లా అంటారు?’’‘‘ఏమిటా, దిగులుగా ఆలోచిస్తోకూచుంటుంది అనుకున్నాను. ఎంత ఇచ్చినా చాలదంటుంది. ఏమవుతుందా అనుకున్నాను’’కాంతమ్మ అతని నోరు మూసింది. ‘‘ఏంరా, వేధవా! నేను నీకు అమ్మనట్రా?’’‘అవును. అమ్మవేగా?’’ అని నిశ్చయంగా అన్నాడు. హడలిపోయి చూసింది కుర్రాణ్ణి. చప్పున ఆపుకోలేక ఒక పెద్ద నవ్వు నవ్వింది. ఆంజనేయులు ఆపుకున్న నవ్వును అంతా నవ్వేశాడు. ఇద్దరూ సీతయ్యనిలాక్కుని కౌగిలించుకున్నారు.
- చలం