నగరంపై నిఘా
నెల్లూరు(క్రైమ్): ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎస్.సెంథిల్ కుమార్ నెల్లూరు నగరంలో శాంతిభధ్రతలపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇటీవల కాలంలో నేరాల శాతం పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రించేందుకు తనదైన శైలిలో చర్యలు చేపట్టారు. వీఆర్‌లో ఉన్న సీఐలు, ఎస్సైలతో ఇటీవల సమావేశం నిర్వహించిన ఆయన నేరనియంత్రణపై వారితో చర్చించి పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో భాగంగా నగరంలోని ప్రతి పోలీసుస్టేషన్‌కు ముగ్గురు ఎస్సైలు, ఐదుగురు స్పెషల్ పార్టీ సిబ్బందిని కేటాయించారు. వీరిపై పర్యవేక్షణ బాధ్యతలను వీఆర్‌లో ఉన్న సీఐలకు అప్పగించారు. ఎస్సైల్లో ఒకరు రాత్రి పూట గస్తీ నిర్వహించాలి. మరొకరు వాహనాలు తనిఖీలు చేపట్టాలి. ఇంకొకరు స్టేషన్ పరిధిలోని ప్రాంతాల్లో తిరుగుతూ అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలి.
ఇప్పటికే తమకు కేటాయించిన స్టేషన్లలో ఎస్సైలు, సిబ్బంది చర్యలను వేగవంతం చేశారు. రాత్రి పూట గస్తీ తిరుగుతూ అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు తరలిస్తున్నారు. విచారించిన తర్వాత సొంతపూచీకత్తుపై విడుదల చేస్తున్నారు. అవసరమైతే బైండోవర్ చేసుకుంటున్నారు. ఆకతాయిలతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ప్రతి పోలీసుస్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
రికార్డులు సరిగా లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. ప్రధానంగా శివారు ప్రాంతాలతో పాటు నేరాలు అధికంగా జరిగే ప్రాంతాలపై దృష్టిపెట్టారు. మద్యం దుకాణాలు, జాతీయరహదారి వెంబడి ఉన్న దాబాలను రాత్రి 10.30 గంటల లోపే మూయించివేస్తున్నారు. ఆర్టీసీ, ఆత్మకూరు బస్టాండుల్లోని దుకాణాలను సైతం మూసివేసేలా చర్యలు చేపట్టారు.