కాన్కాస్ట్ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన
ఆమదాలవలస రూరల్ : కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని కాన్కాస్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు టి.కృష్ణారావు, బి.నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మండలంలోని దూసి గ్రామంలో గల కాన్కాస్ట్ పరిశ్రమ వద్ద ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో భాగంగా శనివారం కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించాలని కోరుతూ 29 రోజులుగా కార్మికులు ధర్నాలు చేపడుతున్నా యాజమాన్యం పట్టించుకోపోవడం దారుణమన్నారు. యాజమాన్యం కక్షసాధింపు చర్యలు మానుకోవాలని, నిలుపుదల చేసిన కార్మికులను పనిలోకి తీసుకోవాలని కోరారు. నూతన వేతన ఒప్పందం తక్షణమే అమలు చేయకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు ఎస్.రాజు, కె.కమల్, టి.సత్యనారాయణ, సి.హెచ్.రమణబాబు, సి.హెచ్.కోటినాయుడు తదితరులు పాల్గొన్నారు.