25 నుంచి పర్యాటక ఉత్సవాలు
వెంకటాపురం : ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని సెప్టెంబర్ 27న ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి యం.శివాజీ శనివారం తెలిపారు. దీన్ని పురస్కరించుకొని ఈనెల 25 నుంచి 27 వరకు పర్యాటక ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా పర్యాటకుల సౌకర్యార్ధం ప్రత్యేక ప్యాకేజీ టూర్లను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. 25న(ఆదివారం) హన్మకొండ నుంచి రామప్ప, లక్నవరం, కోటగుళ్లకు ప్యాకేజీ టూర్ సౌకర్యం ఉంటుందన్నారు. ప్యాకేజీ టూర్ చార్జీలు పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.200 ఉంటుందన్నారు. ఉచిత భోజన వసతి కూడా కల్పిస్తామని శివాజీ వివరించారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 23లోగా కాజీపేటలోని నిట్ పెట్రోల్ పంపు ఎదుటనున్న పర్యాటక శాఖ కార్యాలయంలో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. 26న జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధిపై సెమినార్ ఉంటుందన్నారు. 27న నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. వివరాలకు 98669 19131, 98493 38854 నంబర్లలో సంప్రదించాలన్నారు.