వంగడాలతోనూ ‘పట్టు’సాధించొచ్చు
మల్బరీ సాగులో నూతన వంగడాలతో అధిక దిగుబడులు
- పట్టు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కేపీ కిరణ్కుమార్
కళ్యాణదుర్గం: మల్బరీ సాగులో నూతన వంగడాలతో రైతులు అధిగ దిగుబడి సాధించొచ్చని పట్టు పరిశోధన విస్తరణ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కేపీ కిరణ్కుమార్ పేర్కొన్నారు. మల్బరీలో నూతన వంగడాలు, వాటి ప్రాముఖ్యత, పంట కాలం తదితర విషయాలపై రైతులకు వివరించారు. పట్టుపురుగులు, పట్టుదారం ఉత్పత్తికి కావాల్సిన ముడి పదార్థాలు దాదాపుగా 70 శాతం మల్బరీ ఆకుల నుంచే లభిస్తాయన్నారు. మల్బరీ సాగు చేసే రైతులు మొక్కల రకాలు, వాటి ప్రాముఖ్యత, మొక్కల సామర్థ్యంపై అవగాహన పెంచుకుని పంటలను ఎంపిక చేసుకోవాలన్నారు.
వీ1 వంగడం:
ఈ వంగడం మొక్కను కత్తిరిస్తే వెంటనే చిగురుస్తుంది. వేరు ఉత్పత్తి సామర్థ్యం 94 శాతం ఉంటుంది. ఆకులు చీలిక లేకుండా అండాకారంలో, వెడల్పుగా, మందంగా ఆకుపచ్చ రంగులో దాదాపు 5.2 సెం.మీ ఉండి తళతళలాడుతూ ఉంటాయి. కణువుల నిడివి 5.2 సెం.మీ ఉండి ఆకుమచ్చ, బూడిద తెగులును, ఆకు తుప్పు రోగాలను తట్టుకునే శక్తిఉంటుంది. ఆకులు 78 శాతం తేమాంశం, 27 శాతం ప్రొటీన్లు, 26 శాతం కార్పొహైడ్రేట్లు కలిగి ఉంటుంది. హెక్టారుకు ఏడాదికి 50–60 మెట్రిక్ టన్నుల దిగుబడి ఇస్తుంది.
జీ4 వంగడం :
ఈ వంగడం మొక్క ఆకులు వెడల్పుగా, చీలికలు లేకుండా హృదాయాకారంలో ఉంటాయి. ముదురు ఆకుపచ్చ రంగులో ఉపరితలము అలలుగా ఉంటాయి. ఈ వంగడం మొక్కను కత్తిరించినా వెంటనే చిగురువస్తుంది. వేరు ఉత్పత్తి సామర్థ్యం 92 శాతం ఉంటుంది. కణువుల మధ్య నిడివి 3.9 సెం.మీ వరకు ఉంటుంది. ఒక హెక్టారుకు ఏడాదికి 65 మెట్రిక్ టన్నుల దిగుబడి ఇస్తుంది. ఆకులు 75 శాతం తేమాంశం, 26 శాతం ప్రోటీన్లు, 25 శాతం కార్పొహైడ్రేట్లు కలిగి ఉంటుంది.
జీ2 వంగడము :
వంగడం మొక్క ఆకులు వెడల్పుగా, చీలికలు లేకుండా ఉంటాయి. ముదురు ఆకుపచ్చ రంగులో ఉపరితలము అలలుగా ఉంటాయి. ఈ వంగడం మొక్కను కత్తిరించినా వెంటనే చిగురువస్తుంది.ఆకులు 80 శాతం తేమాంశం, 27 శాతం ప్రొటీన్లు, 25 శాతం కార్పొహైడ్రేట్లు కలిగి ఉంటుంది. వేరు ఉత్పత్తి సామర్థ్యం 94 శాతం ఉంటుంది. కణువుల మధ్య నిడివి 4.0 సెం.మీ. వరకు ఉంటుంది. ఒక హెక్టారుకు ఏడాదికి 36–38 మెట్రిక్ టన్నుల దిగుబడి ఇస్తుంది.
యస్ 13 వంగడం :
ఈ వంగడం అధిక వేరు ఉత్పత్తి 80 శాతం కలిగి ఉంటుంది. ఆకులు చిన్నవిగా అండాకారంలో ఉండి ఆకుపచ్చ రంగులో తళతళలాడుతూ ఉంటాయి. కణువుల మధ్య దూరం 3.2 సెం.మీ ఉండి, ఆకుమచ్చతెగులు, బూడది రోగం, ఆకు తుప్పు రోగం తట్టుకునే శక్తి కలిగి ఉంటాయి. అలాగే తుక్రా రోగమును తట్టుకునే శక్తి కలిగి ఉంటాయి. ఇవి హెక్టారుకు 13–16 మెట్రిక్ టన్నులు ఉంటుంది. ఆకులు 78 శాతం తేమాంశం, 23 శాతం ప్రోటీన్లు, 27 శాతం కార్పొహైడ్రేట్లు కలిగి ఉంటుంది.
యస్ 34 వంగడం :
ఈ వంగడం ఆకులు చిన్నవిగా హృదయాకారంలో చీలికలు లేకుండా ఉంటాయి. వేరు ఉత్పత్తి 75 శాతం కలిగి ఉంటుంది. ఇవి ఆకుమచ్చతెగులు, బూడది రోగం, ఆకు తుప్పు రోగం తట్టుకునే శక్తి కలిగి ఉంటాయి. ఆకులు 75 శాతం తేమాంశం, 24 శాతం ప్రోటీన్లు, 26 శాతం కార్పొహైడ్రేట్లు కలిగి ఉంటుంది. ఇవి హెక్టారుకు 13–16 మెట్రిక్ టన్నులు ఉంటుంది.
యస్ 36 వంగడం:
ఈ వంగడం మొక్కను కత్తిరించినా వెంటనే ఉత్పత్తి అవుతుంది. 48 శాతం వేరు వ్యవస్థ కలిగి ఉంటుంది. ఆకులు వెడల్పుగా చీలికలు లేకుండా హృదయాకారంలో లేత పసుపు రంగులో తళతళలాడుతూ ఉంటాయి. ఆకులు 78 శాతం తేమాంశం, 25 శాతం ప్రోటీన్లు, 25 శాతం కార్పొహైడ్రేట్లు కలిగి ఉంటుంది. 3.53 సెం.మీల తక్కువ కణువుల నిడివి కలిగి ఉండి, ఆకుమచ్చ, బూడిద తెగులు, ఆకు తుప్పు రోగాలను తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. ఆకు దిగుబడి సామర్థ్యం 28 మెట్రిక్ టన్నుల వరకు ఉంటుంది.
యస్.జీ2 వంగడం:
ఈ వంగడం మొక్కను కత్తిరించినా వెంటనే ఉత్పత్తి అవుతుంది. 89 శాతం వేరు వ్యవస్థ కలిగి ఉంటుంది. ఆకులు మధ్యమ వెడెల్పుతో హృదయాకారంలో నునుపుగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కణువుల మధ్య నిడివి 4.2 సెం.మీ ఉండి, ఆకుమచ్చ, బూడిద తెగులు, ఆకు తుప్పు రోగాలను తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. ఆకు దిగుబడి సామర్థ్యం 22–23 మెట్రిక్ టన్నుల వరకు ఉంటుంది.
ఆర్.సి.1 వంగడం:
ఈ వంగడం ఆకులు పెద్దవిగా, హృదయాకారంలో చీలికలు లేకుండా ముదురు ఆకుపచ్చరంగులో మృధువుగా ఉంటాయి. ఈ మొక్కలు కత్తిరించినా, ఆకుకోత వెంటనే ఉత్పత్తి అవుతుంది. వేరు ఉత్పత్తి సామర్థ్యం 85 శాతం ఉంటుంది. కణువుల మధ్య దూరం 4.3 సెం.మీ ఉండి, ఆకుమచ్చ, బూడిద తెగులు, ఆకు తుప్పు రోగాలను తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. ఆకు దిగుబడి సామర్థ్యం 23– 25 మెట్రిక్ టన్నుల వరకు ఉంటుంది.
ఆర్.సీ.2 వంగడం:
ఈ వంగడం ఆకులు చిన్నవిగా, హృదయాకారంలో ముదురు ఆకుపచ్చరంగులో మృదువుగా ఉంటాయి. ఈ మొక్కలు కత్తిరించినా, ఆకుకోత వెంటనే ఉత్పత్తి అవుతుంది. వేరు ఉత్పత్తి సామర్థ్యం 89 శాతం ఉంటుంది. కణువుల మధ్య దూరం 4.4 సెం.మీ ఉండి, ఆకుమచ్చ, బూడిద తెగులు, ఆకు తుప్పు రోగాలను తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. ఆకు దిగుబడి సామర్థ్యం 21– 23 మెట్రిక్ టన్నుల వరకు ఉంటుంది.
ఏ ఆర్ 12 వంగడం:
ఈ వంగడం అధిక వేరు ఉత్పత్తి సామర్థ్యం 90 శాతంగా ఉండి ఆకులు వెడల్పుగా, హృదయాకారంలో చీలికలు లేని ముదురు ఆకుపచ్చరంగులో మృధువుగా ఉంటాయి. కణువుల మధ్య దూరం 3.75 సెం.మీ కలిగి ఉంటుంది. ఆకుతుప్పు తట్టుకునే సామర్థ్యం మధ్యస్థంగా ఉంటుంది. ఈ వంగడం ఆకులు 74 శాతం తేమాంశం, 23 శాతం ప్రోటీన్లు, 21 శాతం కార్పొహైడ్రేట్లు కలిగి ఉంటుంది. ఆకు దిగుబడి ఏడాదికి 16–24 మెట్రిక్ టన్నుల వరకు ఇస్తుంది.
సహన వంగడం:
ఈ వంగడం ఆకులు వెడెల్పుగా, చీలిక లేకుండా హృదాయాకారంలో ముదురు ఆకుపచ్చ రంగులో తళతళలాడుతూ ఉంటాయి. ఆకు దిగుబడి హెక్టారుకు ఏడాదికి 25–30 మెట్రిక్ టన్నులు ఇస్తుంది. అధిక వేరు ఉత్పత్తి సామర్థ్యం 80 శాతంగా ఉంటుంది. ఆకుమచ్చ తెగులు తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. అలాగే ఆకుతుప్పు, తూక్రా తెగుళ్లను తట్టుకునే సామర్థ్యం మధ్యస్తంగా ఉంటుంది. ఆకుల పోషక విలువలు 73 శాతం తేమాంశం, 27 శాతం ప్రోటీన్లు, 22 శాతం కార్పొహైడ్రేట్లు కలిగి ఉంటుంది. నీటి వసతి గల కొబ్బరి తోటలలో అంతర పంటగా వేయిటకు సిఫారసు చేయబడింది.