పట్టు సాగుతో ప్రతి కుటుంబంలో వెలుగు
పెనుకొండ : పట్టు పరిశ్రమ ద్వారా ప్రతి రైతు కుటుంబంలో వెలుగులు నింపుకోవచ్చని, అధిక ఆదాయాన్ని పొందవచ్చని కేంద్ర పట్టుమండలి చైర్మన్ కేఎం హనుమంతరాయప్ప అన్నారు. పట్టణంలోని మార్కెట్‌యార్డ్‌లో శనివారం కేంద్రపట్టు మండలి, జౌళిమంత్రిత్వశాఖ, ఆంధ్రప్రదేశ్ పట్టు పరిశ్రమ శాఖ నేతృత్వంలో మార్కెట్‌యార్డ్‌లో పట్టు రైతుల సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్ర పట్టుమండలి అధ్యక్షుడితో పాటు జెడ్పీ చైర్మన్ చమన్‌సాబ్, జేసీ –2 ఖాజా మోహిద్దీన్, శాస్త్రవేత్తలు శాంతన్‌బాబు, విద్యున్‌మాల, జేడీ అరుణకుమారి, ఏడీ సదాశివరెడ్డి తదితర శాస్త్రవేత్తలు హాజరయ్యారు.
జ్యోతి ప్రజ్వలన అనంతరం సమావేశంలో కేంద్ర పట్టుమండలి చైర్మన్ మాట్లాడుతూ మేడిన్ ఇండియా, మేకిన్ ఇండియా అనే నినాదంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మల్బరీ సాగు విస్తీర్ణం పెంచడానికి కృషి చేస్తున్నానన్నారు. ఇందులో భాగంగా సిక్కిం, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో పర్యటిస్తూ రైతులను మల్బరీ సాగు వైపు దృష్టి సారించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. రైతులకు షెడ్లు, ఇతర ఉపకరణలకు భారీ సబ్సిడీలతో అందిస్తామన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త డా.శివప్రసాద్§Š, జెడ్పీటీసీ నారాయణస్వామి, రైతులు పాల్గొన్నారు.