hanumantharayappa
-
పట్టు సాగుతో ప్రతి కుటుంబంలో వెలుగు
పెనుకొండ : పట్టు పరిశ్రమ ద్వారా ప్రతి రైతు కుటుంబంలో వెలుగులు నింపుకోవచ్చని, అధిక ఆదాయాన్ని పొందవచ్చని కేంద్ర పట్టుమండలి చైర్మన్ కేఎం హనుమంతరాయప్ప అన్నారు. పట్టణంలోని మార్కెట్‌యార్డ్‌లో శనివారం కేంద్రపట్టు మండలి, జౌళిమంత్రిత్వశాఖ, ఆంధ్రప్రదేశ్ పట్టు పరిశ్రమ శాఖ నేతృత్వంలో మార్కెట్‌యార్డ్‌లో పట్టు రైతుల సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్ర పట్టుమండలి అధ్యక్షుడితో పాటు జెడ్పీ చైర్మన్ చమన్‌సాబ్, జేసీ –2 ఖాజా మోహిద్దీన్, శాస్త్రవేత్తలు శాంతన్‌బాబు, విద్యున్మాల, జేడీ అరుణకుమారి, ఏడీ సదాశివరెడ్డి తదితర శాస్త్రవేత్తలు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం సమావేశంలో కేంద్ర పట్టుమండలి చైర్మన్ మాట్లాడుతూ మేడిన్ ఇండియా, మేకిన్ ఇండియా అనే నినాదంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మల్బరీ సాగు విస్తీర్ణం పెంచడానికి కృషి చేస్తున్నానన్నారు. ఇందులో భాగంగా సిక్కిం, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో పర్యటిస్తూ రైతులను మల్బరీ సాగు వైపు దృష్టి సారించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. రైతులకు షెడ్లు, ఇతర ఉపకరణలకు భారీ సబ్సిడీలతో అందిస్తామన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త డా.శివప్రసాద్§Š, జెడ్పీటీసీ నారాయణస్వామి, రైతులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ డ్రైవర్ మృతి
మడకశిర : గుడిబండ మండలం హిరేతుర్పి వద్ద మంగళవారం టిప్పర్, కారు ఢీ కొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ హనుమంతరాయప్ప(55) బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు గుడిబండ పోలీసులు తెలిపారు. మృతుడు కర్ణాటక రాష్ట్రంలోని శిర తాలూకా కరిదాసనహళ్లి గ్రామానికి చెందినవాడు కావడంతో గుడిబండ ఎస్ఐ ఖాజాహుస్సేన్ ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని ఆ గ్రామానికి తరలించారు. ఇదిలా ఉండగా ఇదే ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మరో ముగ్గురు చిన్నారుల పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలిసింది. -
ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు
హిందూపురం రూరల్ : పట్టు రైతులు ఆధునిక పద్ధతులను అవలంభించి అధిక దిగుబడులు సాధించాలని కేంద్ర పట్టు బోర్డు మండలి చైర్మన్ హనుమంతరాయప్ప అన్నారు. ఆదివారం గుడ్డంలోని బైవోల్టిన్ విత్తన ఉత్పత్తి కేంద్రంలో పట్టు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు బైవోల్టిన్ పట్టు పురుగుల పెంపకంతో అధిక ఆదాయం పొందవచ్చన్నారు. అందుకు అవసరమైన ఆధునిక పద్ధతులను అవలంభించాలన్నారు. దేశంలో పట్టు పురుగ పెంపకం ద్వారా తక్కువ దిగుబడి రావడంతో చైనా, కొరియా దేశాల నుంచి ముడిపట్టును దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన చెందారు. ప్రభుత్వం అందించే సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆటోమెటిక్ రీలింగ్ మిషన్‌కు పూర్తి ధర రూ.1.30 కోట్లు ఉండగా అందులో రూ.65 లక్షల సబ్సిడీ అందిస్తామన్నారు. జేడీ అరుణకుమారి, విశ్రాంత జేడీ సత్యనారాయణరాజు, సెంట్రల్ సెరికల్చర్ బోర్డు శాస్త్రవేత్తలు రాఘువేంద్రరావు, శ్రీనివాసులు, డాక్టర్ మూర్తి, శాస్త్రవేత్త మనోహర్‌రెడ్డి, విద్దున్మాల, శాంతన్‌బాబు, బాలాజి చౌదరి, డీడీ సదాశివరెడ్డి, ఏడీ నాగరంగయ్య, పట్టురైతులు పాల్గొన్నారు. -
పట్టు ఉత్పత్తికి ప్రత్యేక చర్యలు
– కేంద్ర సిల్క్ బోర్డు చైర్మన్ హనుమంతరాయప్ప హిందూపురం టౌన్ : దేశంలో పట్టు ఉత్పత్తికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని సెంట్రల్ సిల్క్ బోర్డు చైర్మన్ హనుమంతరాయప్ప పేర్కొన్నారు. పట్టణంలోని పలు ట్విస్టింగ్, రీలింగ్ యూనిట్లను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం పట్టుగూళ్ల మార్కెట్‌ను పరిశీలించి రైతులతో గిట్టుబాటు ధర లభిస్తోందా లేదా అనే అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో పట్టు ఉత్పత్తి తగ్గడంతోనే చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. ప్రధాని నరేంద్రమోదీ మేకిన్ ఇండియాలో భాగంగా దేశంలో పట్టు ఉత్పత్తి పెంచడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ట్విస్టింగ్, రీలింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడం కోసం 75 శాతం సబ్సిడీ అందిస్తోందన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి షెడ్లు మంజూరు చేస్తామన్నారు. ఈ సందర్భంగా కల్లూరుకు చెందిన రైతు చెన్నకేశవ షెడ్ల నిర్మాణం కోసం అందించే రూ.80 వేలు చాలా తక్కువగా ఉందని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ఎక్కువ మొత్తం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం సిల్క్ కాలనీలో రీలింగ్ యూనిట్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో జేడీ అరుణకుమారి, ఏడీ నాగరంగయ్య, ప్రసాద్, శాస్త్రవేత్తలు మనోహర్‌రెడ్డి, సత్యనారాయణ, ఉమేష్, సిబ్బంది పాల్గొన్నారు.