బంగారం ఎలా ఉన్నా బంగారమే
బంగారం అంటే ఆభరణాల రూపంలో కొనుగోలు చేయడమే ఎక్కువ మందికి తెలిసిన విషయం. కానీ, నేడు డిజిటల్ రూపంలోనూ ఎన్నో సాధనాలు అందుబాటులో ఉన్నాయి. సార్వభౌమ బాండ్లు, డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్‌లు గురించి తెలిసింది తక్కువ మందికి. ఇటీవలి కాలంలో ప్రచారం కారణంగా డిజిటల్ బంగారం సాధనాల పట్ల అవగాహన పెరుగుతోంది.
భౌతిక రూపంలో కంటే డిజిటల్ రూపంలో కొనుగోలు చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. అలా అని బంగారం ఆభరణాలు, కాయిన్లు కొనడానికి దూరంగా ఉండాలని కాదు. డిజిటల్ సాధనాలు వచి్చనప్పటికీ బంగారం ఆభరణాల రూపంలో పెద్ద మొత్తంలో విక్రయం అవుతూనే ఉంది. నిజానికి డిజిటల్‌గానూ, భౌతికంగానూ ఏ రూపంలో ఉన్నప్పటికీ పసిడికి ఉన్న డిమాండ్ ఎంతో ప్రత్యేకం. భౌతిక బంగారంతోనూ కొన్ని అనుకూలతలు ఉన్నాయి. అవేంటో తెలియజేసే కథనమే ఇది.
బంగారం ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేసినప్పుడు తయారీ చార్జీలు, తరుగు విధిస్తుంటారు. తయారీలో వృథాగా పోయే మొత్తాన్ని కస్టమర్ నుంచే వర్తకులు రాబడుతుంటారు. కనుక పెట్టుబడి కోసం చూసేవారు, భవిష్యత్తులో ఆభరణాల కోసమని కొంచెం, కొంచెం సమకూర్చుకునేవారు డిజిటల్ బంగారానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తుంటారు.
డిజిటల్‌గా ఉంటే బంగారం భద్రంగా దాచుకునేందుకు లాకర్ల అవసరం ఉండదని చెబుతుంటారు. బంగారం తీసుకెళ్లి బ్యాంక్ లాకర్లలో పెట్టడం ద్వారా రక్షణ పొందొచ్చు. కానీ ఏటా లాకర్ నిర్వహణ చార్జీలు చెల్లించుకోవాల్సి వస్తుంది. డిజిటల్ రూపంలో ఉంటే కనిపించే ప్రయోజనాలు ఇవి. అలా అని భౌతిక బంగారం అవసరం లేదా? బంగారాన్ని భౌతిక రూపంలో కలిగి ఉంటే ప్రయోజనం లేదా? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం అన్ని అంశాలను సమగ్రంగా తెలుసుకోవాల్సిందే.
వినియోగ డిమాండ్
చారిత్రకంగా చూస్తే.. ఆభరణాల కోసం విస్తృతంగా వినియోగించడం వల్లే బంగారానికి ఈ స్థాయి విలువ సమకూరింది. అందుకే బంగారం ధరలను వినియోగం ప్రభావితం చేస్తుంటుంది. కాలక్రమేణా ఇన్వెస్టర్లు తమ సంపద విలువను కాపాడుకునే సాధనంగానూ ఇది మారిపోయింది. ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కాచుకునే హెడ్జింగ్ సాధనంగా అవతరించింది. పెట్టుబడుల పరంగా డిజిటల్ బంగారాన్ని ఎంతో ప్రోత్సహించినప్పటికీ, అదే సమయంలో భౌతిక రూపంలో బంగారానికి అంతకంటే డిమాండ్ ఎక్కువేనని చెప్పుకోవాలి. అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ మారకం నిల్వల్లో కొంత మొత్తాన్ని భౌతిక బంగారం రూపంలోనే నిర్వహిస్తుంటాయి. ఆరి్థక అనిశి్చతుల్లో దీన్ని రక్షణ సాధనంగా పరిగణిస్తుంటారు. అందుకే దశాబ్దాలు గడిచినా బంగారం డిమాండ్ పెరుగుతోంది.
లిక్విడిటీ సాధనం
పెట్టుబడి సాధనం ఏదైనా కానీయండి, అందులో లిక్విడిటీకి ప్రాధాన్యం ఇవ్వడం అన్నింటికంటే ముఖ్యమైన అంశం అవుతుంది. బంగారం విషయంలో లిక్విడిటీకి (కావాల్సినప్పుడు వెంటనే నగదుగా మార్చుకోవడం) ఢోకా ఉండదు. ఆభరణాల వర్తకుడి వద్దకు వెళ్లి సులభంగా విక్రయించుకోవచ్చు. బంగారం డిజిటల్, భౌతికం ఏ రూపంలో ఉన్నా లిక్విడిటీకి ఇబ్బంది దాదాపుగా ఉండదు. ‘‘బంగారం ఆభరణాలపై బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు ఇస్తుంటాయి. అవే బ్యాంకులు వజ్రాలపై రుణాలను ఇవ్వవు’’ అని ఇండియా బులియన్ అండ్ జ్యుయలర్స్ అసోసియేషన్ నేషనల్ సెక్రటరీ సురేంద్ర మెహతా తెలిపారు. భౌతిక బంగారం అయితే గంటలోపే దాన్ని విక్రయించి సొమ్ము చేసుకోవచ్చు.
లేదంటే పనిదినాల్లో అయితే బ్యాంక్‌కు వెళ్లి గంట, రెండు గంటల్లోనే రుణాన్ని పొందొచ్చు. కానీ గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో విక్రయించిన తర్వాత సొమ్ము చేతికి అందాలంటే రెండు రోజులు పడుతుంది. సావరీన్ గోల్డ్ బాండ్లో పెట్టుబడుల కాలవ్యవధి ఎనిమిదేళ్లు. కానీ, ఐదేళ్ల తర్వాతే విక్రయించుకోవచ్చు. సెకండరీ మార్కెట్లో ఎప్పుడైనా విక్రయించుకోవచ్చు కానీ లిక్విడిటీ చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని బ్యాంకులు సావరీన్ గోల్డ్బాండ్పైనా రుణం ఇస్తున్నాయి. విలువ పరంగానే కాదు, భౌతిక బంగారంతో భావోద్వేగమైన బంధం కూడా ఉంటుందన్నది నిజం. ఒకవైపు పెట్టుబడికి, మరోవైపు ఆడంబర సాధనంగా వినియోగించే ఏకైక కమోడిటీ బంగారమే. భౌతిక రూపంలో బంగారా న్ని తమ గౌరవ చి హ్నంగానూ భావిస్తుంటారు. డిజిటల్ గోల్డ్‌తో ఇది రాదు.
ఆదుకునే సాధనం
ఊహించని పరిస్థితులు ఎదురైనప్పుడు బంగారం ఆదుకునే సాధనంగా పూర్వ కాలం నుంచి గుర్తింపు ఉంది. కరోనా వంటి విపత్తులు ఎదురైనప్పుడు చాలా మందిని ఈ బంగారమే ఆదుకుందని మెహతా పేర్కొన్నారు. బంగారాన్ని బులియన్ రూపంలో (ఆభరణం కాకుండా) కలిగి ఉంటే అప్పుడు తయారీ చార్జీల రూపంలో నష్టపోయేదేమీ ఉండదు. అవసరమైనప్పుడు బులియన్ గోల్డ్‌ను ఆభరణాలుగా మార్చుకోవచ్చు. అలా సమకూర్చుకున్న బులియన్ గోల్డ్, బంగారం కాయిన్లను భవిష్యత్తులో వివాహ సమయాల్లో ఆభరణాల కోసం వినియోగించుకోవచ్చు. భౌతిక బంగారానికి ఉన్న ఒకే ఒక రిస్క్ భద్రత. అందుకని భద్రత కోసం బ్యాంక్ లాకర్‌ను ఆశ్రయించొచ్చు.
లేదంటే ఇంట్లోనే ఆభరణాలను ఉంచుకునేట్టు అయితే, హోమ్ ఇన్సూరెన్స్ తీసుకుని వాటికి రక్షణ కలి్పంచుకోవాలి. బ్యాంక్ లాకర్‌కు వార్షిక నిర్వహణ చార్జీలు, హోమ్ ఇన్సూరెన్స్ కోసం ప్రీమియం రూపంలో కొంత వ్యయం చేయాల్సి వస్తుంది. కాకపోతే ఈ చార్జీలు మరీ అంత ఎక్కువా? అన్నది ఒక్కసారి సమీక్షించుకోవాలి. ఎందుకంటే ఇతర రూపాల్లోని బంగారంలోనూ కొంత వ్యయాలు ఉంటుంటాయి. ‘‘డిజిటల్ గోల్డ్ రూపంలోనూ చార్జీలు ఉంటాయి.
కనుక ఇక్కడ చార్జీలనేవి ప్రధాన అంశం కాబోదు. కాకపోతే, భౌతిక రూపంలోని బంగారాన్ని నిల్వ చేసుకోవడంలోనే సమస్యలు. కానీ, చాలా మందికి భౌతిక బంగారం సౌకర్యాన్నిస్తుంది. ఇది డిజిటల్ గోల్డ్ వల్ల రాదు’’అని మై వెల్త్ గ్రోత్ సంస్థ వ్యవస్థాపకుడు హర్షద్ చేతన్‌వాలా పేర్కొన్నారు. అన్ని ముఖ్య వేడుకలు, శుభ కార్యక్రమాలకు బంగారం ఆభరణాలను ధరించడాన్ని చాలా మంది గొప్పగా భావిస్తుంటారు. ప్రియమైన వారిని సంతోష పెట్టేందుకు బంగారం మించిన సాధనం లేదన్నది మెహతా అభిప్రాయం. డిజిటల్, వర్చువల్ రూపంలోని బంగారంతో అంత సంతోషం రాదు.
కనుక బ్యాంక్ లాకర్ లేదా బీమా ప్రీమి యం అనేది పెద్ద అంశం కాబోదని చేతన్ వాలా అభిప్రాయపడ్డారు. ‘‘అత్యవసర పరిస్థితులు ఏర్పడితే భౌతిక రూపంలోని బంగారాన్ని వెంటనే విక్రయించుకోవచ్చు. కాయిన్ లేదా ఆభరణం ఏ రూపంలో ఉందన్నది కీలకం అవుతుంది. ఆభరణాల రూపంలో అయితే జ్యుయలర్ కొంత మొత్తాన్ని చార్జీల రూపంలో మినహాయించుకోవచ్చు. డిజిటల్ గోల్డ్‌ను సైతం వెంటనే మానిటైజ్ (నగదుగా మార్చుకోవడం) చేసుకోవచ్చు. ఎక్సే్ఛంజ్‌లో విక్రయించినప్పుడు ఆ మొత్తం బ్యాంక్ ఖాతాకు వచ్చి జమ అవుతుంది’’అని చేతన్ వాలా వివరించారు.
ఎంత.. ఏ రూపంలో..?
డిజిటల్, భౌతిక బంగారం రెండింటిలోనూ అనుకూలతలు, ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి. ఆభరణాలు, కాయిన్లు, అలాగే డిజిటల్ గోల్డ్ సాధనాల రూపంలో పెట్టుబడులు కలిగి ఉండాలన్నది కొందరు నిపుణుల ఇచ్చే సూచన. ఒక వ్యక్తి తన మొత్తం పెట్టుబడుల్లో 5–15 శాతం మధ్య పసిడికి కేటాయించుకోవచ్చు. ఉదాహరణకు పోర్ట్‌ఫోలియోలో 10 శాతాన్ని బంగారానికి కేటాయించారని అనుకుందాం. ఇప్పుడు ఈ 10 శాతంలో కొంత డిజిటల్ గోల్డ్, కొంత భౌతిక బంగారం రూపంలో ఉండాలి.
భౌతికంగా అంటే ఆభరణాలా లేక కాయిన్లా? అన్నది తమ వ్యక్తిగత అవసరాలు, అభిరుచుల ఆధారంగానే నిర్ణయించుకోవాలి. ఆభరణాల రూపంలో అయితే అవసరమైన వాటికే పరిమితం కావాలి. మిగిలినది కాయిన్లు, బార్ల రూపంలో కలిగి ఉండాలి. దీనివల్ల తయారీ, తరుగు చార్జీలను ఆదా చేసుకోవచ్చు. భవిష్యత్తులో పిల్లల వివాహాల కోసం భౌతిక రూపంలోనే పసిడిని పోగేసుకునే వారు ఆభరణాలకు బదులు కాయిన్లు కొనుగోలు చేసుకోవడం నయం.
ఎందుకంటే ఆభరణాల రూపంలో కొనుగోలు చేసినా, భవిష్యత్తులో వాటిని మళ్లీ కొత్త ఆభరణాల కోసం మార్చుకోవాల్సి వస్తుంది. కనుక భవిష్యత్తులో అదే రూపంలో వినియోగించనప్పుడు ఆభరణాలు తీసుకోవడం సరికాదు. అంతేకాదు భవిష్యత్తు కోసం లేదంటే అత్యవసరాల్లో ఆదుకుంటుందన్న ఉద్దేశంతో బంగారాన్ని సమకూర్చుకునే వారు ఆభరణాల రూపంలో కాకుండా వేరే మార్గాన్ని పరిశీలించాలి. ఎందుకంటే అవసరం వచి్చనప్పుడు విక్రయించేట్టు అయితే వర్తకులు ఆ ఆభరణాల నుంచి కొంత మొత్తాన్ని చార్జీల పేరుతో మినహాయించుకుంటారు.
రోజువారీ ధరించేవి, పెళ్లిళ్లు, ముఖ్య వేడుకల సందర్భంగా ధరించేవి, ఇతరులకు బహుమానంగా ఇచ్చేవి మినహా మిగిలినదంతా డిజిటల్ సాధనాల రూపంలో తీసుకోవడాన్ని పరిశీలించాలి. పెట్టుబడి దృష్ట్యా డిజిటల్ సాధనాలు మెరుగైనవి. ఎందుకంటే వీటి క్రయ, విక్రయాలు చాలా సులభంగా, వేగంగా చేసుకోవచ్చు. డిజిటల్ గోల్డ్‌ను సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో ప్రతీ నెలా కొనుగోలు చేసుకుంటూ, అలా సమకూరిన పసడిని అవసరమైనప్పుడు ఆభరణాలుగా మార్చుకోవచ్చు.
కొందరు అయితే ప్రతీ నెలా తమకు తోచినంత కాయిన్ల రూపంలో సమకూర్చుకుని, అవసరమైనప్పుడు వాటిని ఆభరణాలుగా మార్చుకుంటుంటారు. కనుక ప్రతి ఒక్కరూ తమ పోర్ట్‌ఫోలియోలో డిజిటల్, భౌతిక బంగారానికి చోటు కలి్పంచుకోవడం సరైనదేనన్నది నిపుణుల సూచన. డిజిటల్ సాధనాల్లో సావరీన్ గోల్డ్ బాండ్లో ఎలాంటి వ్యయాలు, ఖర్చులు ఉండవు. పైగా బంగారం పెట్టుబడి విలువపై ఎనిదేళ్ల పాటు ఏటా 2.5 శాతం వడ్డీ కూడా లభిస్తుంది. డిజిటల్‌గా ఇది మెరుగైన సాధనం.