విషాదంలో చెన్నుంబొట్లవారిపాలెం
♦ వరుస హత్యల తర్వాత ఎస్సీ కాలనీలో మిగిలింది ఆవేదనే..
♦ హంతకులు తండ్రీకొడుకు వెనుక ఎవరైనా ఉన్నరా?
♦ ఆ కోణంలో కూడా కొనసాగుతున్న పోలీసుల విచారణ
♦ ముందు జాగ్రత్తగా గ్రామంలో పోలీసు పికెట్
♦ బందోబస్తు నడుమ అంత్యక్రియలు
పర్చూరు: పాతకక్షల నేపథ్యంలో మంగళవారం ముగ్గురి హత్య అనంతరం చెన్నుంబొట్లవారిపాలెం ఎస్సీ కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది. అంతేకాక అక్కడ వీధుల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. మూడు మృతదేహాల వద్ద బంధువులు విషణ్ణ వదనంతో ఉన్నారు. మిగిలిన గ్రామస్తులు ఉలికిపాటుకు గురయ్యూరు. తండ్రీకొడుకు గొడ్డళ్లతో పది నిమిషాలు పాటు సృష్టించిన మారణ హోమాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. పత్యర్థుల హత్యలకు హంతకులు దిడ్ల శ్యాంసన్, బోస్‌లు గ్రామంలో రెండు రోజులుగా రెక్కీ నిర్వహిస్తున్నా ఎవ్వరికీ అనుమానం రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. స్థానికులైనా మరో గ్రామంలో ఉంటూ స్వగ్రామానికి వచ్చి ఇంత ధైర్యంగా తండ్రీకొడుకు కలిసి ముగ్గురిని హతమార్చడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఇంకెవరి సహకారమైనా తీసుకుని ఉంటారా.. అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
బంధువుల కన్నీటిపర్యంతం
మృతులు కీర్తిపాటి రత్తయ్య, సుశీల దంపతులు, జంగా లూధర్‌బాబు ఇళ్ల వద్ద పరిస్థితి వర్ణించలేనిది. పట్టపగలు ఇంత కిరాతంగా హంతకుల చేతిలో బలైపోయిన కుటుంబ సభ్యులను తలచుకొని మిగిలిన వారు కన్నీటిపర్యంతమవుతున్నారు. గతంలో పాతకక్షలున్నా హత్యలు చేసుకునేంత వరకూ వెళ్తాయని ఎవరూ ఊహించలేదు. ఆ పరిసర ప్రాంతాల్లో కూడా విషాదం అలుముకుంది.
పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలు
ఉద్రిక్తతల మధ్య గ్రామంలో ఎలాంటి దాడులు జరగకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. ఇంకొల్లు ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామంలో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. చీరాల ప్రభుత్వాస్పత్రిలో ముగ్గురి మృతదేహాలకు పోస్టుమార్టం చేశారు. అనంతరం స్వగ్రామమైన చెన్నుంబోట్లవారిపాలెంలో పోలీసుల పహారా మధ్య ముగ్గురి మృతదేహాలకు అంత్యక్రియలు చేశారు.
హంతకులు తండ్రీకొడుకు అరెస్టు
నిందితుల వివరాలు వెల్లడించిన డీఎస్పీ ప్రేమ్‌కాజల్
పర్చూరు మండలం చెన్నుంబొట్లవారిపాలెం ఎస్సీ కాలనీలో మంగళవారం జరిగిన ముగ్గురి హత్యకు పాతకక్షలే కారణమని చీరాల డీఎస్పీ డాక్టర్ ప్రేమ్‌కాజల్ వెల్లడించారు. కీర్తిపాటి రత్తయ్య, జంగా బాబు, జంగా సుశీలను నరికి చంపిన నిందితులు దిడ్లా శ్యాంసన్, ఆయన కొడుకు బోసును అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచే ముందు బుధవారం స్థానిక పోలీసుస్టేషప్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఆమె మీడియూకు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. మృతుల కుటుంబానికి, హంతకుల కుటుంబానికి ఏడాదిన్నర నుంచి గొడవలు ఉన్నారుు. నిందితులు తాత్కాలికంగా మార్టూరు మండలం చిన డేగరమూడిలో నివాసం ఉంటున్నారు. హంతకుడు దిడ్ల శ్యాంసన్ ప్రతి నెలా పింఛన్ కోసం స్వగ్రామం చెన్నుంబొట్లవారిపాలెం వస్తున్నాడు. ఆ సమయంలో మృతులు, వారి బంధువులు శ్యాంసన్‌ను సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టారు. ఈ నేపథ్యంలో మృతులు, వారి కుటుంబ సభ్యులపై శ్యాంసన్, ఆయన కొడుకు కక్ష పెంచుకున్నారు. పథకం ప్రకారం ముగ్గురిని హత్య చేశారు. ఏడాదిన్నర కిందట గ్రామంలో వాలీబాల్ పోటీలు జరిగారుు. రత్తయ్య కుమారుడు మేరీబాబుతో బోసుకు గొడవ జరిగింది. మేరీబాబుపై బోసు కత్తితో దాడి చేసి గాయపరిచాడు. క్షతగాత్రుని ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో రాజీ కుదిరింది. అయినా ఇరు కుటుంబాల వారు తరుచూ గొడవలు పడుతున్నారు. గ్రామం వదిలి వెళ్లడానికి రత్తయ్య, ఆయన బంధువులే కారణమని శ్యాంసన్ భావించాడు. అప్పటి నుంచి రత్తయ్య బంధువులపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో రెండు రోజులు రెక్కీ నిర్వహించి మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో తండ్రీకొడుకు కలిసి ముగ్గురిని గొడ్డళ్లతో దారుణంగా హతమార్చారు. నిందితుల నుంచి కత్తి, రెండు గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్సీ తెలిపారు. ఆమెతో పాటు సీఐలు ఎం.శ్రీనివాసరావు, ఎన్. సత్యనారాయణ, ఎస్సై జి.సోమశేఖర్, కానిస్టేబుళ్లు ఉన్నారు.
ఇదీ..జరిగింది!
మృతుల కుటుంబానికి, హంతకుల కుటుంబానికి మధ్య ఏడాదిన్నర నుంచి వివాదం ఉంది. అప్పటి నుంచి తరచూ ఘర్షణ పడుతున్నారు. హంతకుడు శ్యాంసన్ ప్రతి నెలా గ్రామానికి వచ్చి పింఛన్ తీసుకొని వెళ్తున్నాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం నెల కిందటే రెండు గొడ్డుళ్లు కొనుగోలు చేసి వాటిని తాత్కాలిక ఉంటున్న అగ్రహారంలోని తన నివాసంలో ఉంచాడు. ఆ క్రమంలో రుణమాఫీ పత్రాల కోసం ఇటీవల గ్రామానికి వచ్చాడు. ఆ రోజే ప్రణాళిక ప్రకారం తుద ముట్టించాలనుకున్నాడు. వీలుగాక వెనుదిరిగి వెళ్లినట్లు సమాచారం. శ్యాంసన్ కుటుంబ సభ్యుల ప్రవర్తనతో విసుగు చెంది గ్రామస్తులంతా వీరిని చాలాకాలంగా దూరంగా పెట్టారు.
గతంలో జరిగిన గొడవులు, ప్రస్తుతం జరుగుతున్న పరిణాలతో కాలనీపై హంతకులు పగ పెంచుకున్నారు. శ్యాంసన్‌కు 60 ఏళ్లు ఉంటారుు. యుక్త వయసులో ఉన్న కొడుకుకు నచ్చజెప్పాల్సిందిపోరుు రెచ్చగొట్టాడు. కొడుకును హత్యాకాండకు పురికొల్పడం అతని నేర ప్రవృత్తికి అద్దం పడుతోంది. గొడ్డళ్లతో గ్రామంలో తిరుగుతూ తండ్రీకొడుకు భయానక వాతావరణం సృష్టించారు. అడ్డుకునే ప్రయత్నం చేసినవారి సైతం తుద ముట్టించేందుకు వెనుకాడ లేదు. కళ్ల ముందే హత్యాకాండ జరుగుతున్నా గ్రామస్తులు చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. ముగ్గురి హత్య అనంతరం కూడా మారణాయుధాలతో హంతకులు అక్కడే ఉండటం వారి కరుడు గట్టిన మనస్తత్వాన్ని తెలియజేస్తోంది.
శాంతిభద్రతలు కల్పిస్తాం.. ఎస్పీ త్రివిక్రమ్ వర్మ
చెన్నుంబొట్లవారిపాలెం ఎస్సీ కాలనీలో శాంతి భద్రతలు కల్పిస్తామని ఎస్పీ సీఎం.త్రివిక్రమవర్మ తెలిపారు. మూడు హత్యలు జరిగిన స్థలాన్ని ఆయన బుధవారం రాత్రి పరిశీలించారు. అనంతరం ఎస్సీ కాలనీలోని మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. హంతకులను వదిలి పెట్టేది లేదని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామంలో ఉండాలంటే భయంగా ఉందని, ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని ఎస్పీ ఎదుట వారు ఆందోళన వ్యక్తం చేశారు. హంతకులను గ్రామంలోకి రానీయకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు.
మూడు నెలల తర్యాత జైలు నుంచి బయటకు వచ్చి తమను కూడా చంపుతామని హంతకులు బెదిరించారని చెప్పారు. నిందితులు ఒక వేళ బెయిల్‌పై బయటకు వచ్చినా వారిపై రౌడీషీట్ తెరిచామని, హంతకులు ఇంట్లో బయట ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు పోలీసులు సమాచారం సేకరిస్తారని ఎస్పీ వారికి ధైర్యం చెప్పారు. మృతుల పిల్లలకు కలెక్టర్‌తో మాట్లాడి న్యాయం చేస్తామన్నారు. అనంతరం స్థానిక పోలీసుస్టేషన్లో ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. గ్రామంలో పోలీసు పికెట్ కొనసాగుతుందన్నారు. డీఎస్పీ ప్రేమ్‌కాజల్, సీఐలు ఎం.శ్రీనివాసరావు, షేక్ అల్తాఫ్ హుస్సేన్, ఎన్.సత్యనారాయణ, ఎస్సైలు సోమశేఖర్, కె.రామకృష్ణ, చెంచుప్రసాద్ ఉన్నారు.