షాప్క్లూస్లోకి రూ.615 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ సంస్థ షాప్‌క్లూస్ దాదాపు 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 615 కోట్లు) పెట్టుబడులు సమీకరించినట్లు సోమవారం తెలిపింది. టైగర్ గ్లోబల్ సారథ్యంలోని ఇన్వెస్టర్ల గ్రూప్ తాజా విడత నిధులు ఇన్వెస్ట్ చేసింది. గతంలో ఏంజెల్, ఏ, బీ, సీ విడతల కింద నిధులు సమీకరించిన షాప్‌క్లూస్ తాజా ఫండింగ్‌ను సిరీస్ డీ కింద దక్కించుకుంది.
కంపెనీలో ఇంతకు ముందు హీలియోన్ వెంచర్ పార్ట్నర్స్, నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్ వంటి సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. 2011లో ప్రారంభమైన షాప్‌క్లూస్ ప్రస్తుతం ప్రతి నెలా 15 లక్షల లావాదేవీలు నిర్వహిస్తోంది. ఇందులో 70 శాతం వ్యాపారం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచే వస్తోంది. ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరంలో స్థూల వ్యాపార పరిమాణం రూ. 1,500 కోట్లకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు షాప్‌క్లూస్ వెల్లడించింది.