సివిల్ సర్వీసెస్ ఆశావహులకు శుభవార్త
ఇక నుంచి మరో రెండు ప్రయత్నాలకు అవకాశం
గరిష్ట వయోపరిమితి రెండేళ్లు పెంపు
1,291 పోస్టులతో నోటిఫికేషన్
న్యూఢిల్లీ: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి ప్రతిష్టాత్మక అఖిలభారత సర్వీసు ఉద్యోగాలను సాధించాలనుకునే ఆశావహ విద్యార్థులకు శుభవార్త. భారీ మార్పులతో ఈ ఏడాది పరీక్షలు నిర్వహించేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సిద్ధమైంది. అంగ వైకల్య అభ్యర్థులకు ప్రత్యేకించిన 26 సహా దాదాపు 1,291 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి నుంచి అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో రెండేళ్ల సడలింపుతో పాటు పరీక్షలకు అదనంగా రెండు ప్రయత్నాలు (అటెమ్ట్స్) చేసుకొనే అవకాశం లభిస్తుంది. ఈ లెక్కన నిర్దేశిత వయోపరిమితికి లోబడి జనరల్ అభ్యర్థులు గరిష్టంగా ఆరుసార్లు (గతంలో నాలుగు సార్లు) పరీక్షలకు హాజరుకావచ్చు. నోటిఫికేషన్ ప్రకారం ఓబీసీ అభ్యర్థులకు ఏడు ప్రయత్నాల వరకు అవకాశం ఉంది.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ ప్రయత్నాలపై పరిమితి లేదు. ఈ ఏడాది ఆగస్టు 1 నాటికి 21-32 ఏళ్ల మధ్య వయసు (1982 ఆగస్టు 2 కంటే ముందు, 1993 ఆగస్టు 1 తర్వాత జన్మించి ఉండకూడదు) ఉన్న అర్హులెవరైనా యూపీఎస్సీ పరీక్షలకు హాజరుకావచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మరో ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మరో మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అయితే ఈసారి పరీక్షల నిర్వహణ విధానంలో కానీ, సిలబస్లో కానీ ఎలాంటి మార్పులూ చేయలేదు. ఈ ఏడాది ఆగస్టు 24న ప్రాథమిక పరీక్ష (ప్రిలిమినరీ), తర్వాత ప్రధాన పరీక్షలు (మెయిన్స్), మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) ద్వారా అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఈనెల 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఉంది. ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులైనవారు సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెయిన్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది